జ్వరమొస్తే కరోనా, డెంగీ టెస్టులు తప్పనిసరి

Corona and dengue tests are mandatory for fever - Sakshi

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టీకరణ 

రెండూ వస్తే వైద్యం చేయడం సవాలేనని వెల్లడి 

ఎలాంటి వైద్యం ఇవ్వాలన్నదానిపై మార్గదర్శకాలు

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పుడు సీజనల్‌ వ్యాధులు ఒకవైపు, కరోనా మరోవైపు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ, కరోనాతో జనం గజగజలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండూ ఒకేసారి వస్తే చికిత్స అందించడం వైద్యులకు సవాల్‌గా మారిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే కరోనా, డెంగీ పరీక్షలు రెండూ చేయించాలని సూచించింది. కరోనా, డెంగీ జ్వరాల్లో లక్షణాలు దాదాపు దగ్గరగా ఉండటం వల్ల వ్యాధిని గుర్తించడంలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని తెలిపింది. మరో విషయం ఏంటంటే రెండింటిలోనూ 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదని తెలిపింది.

ఇవి తీవ్రమైతే మాత్రం ఆస్పత్రిలో చేరాల్సిన స్థితి ఎదురవుతుంది. కాబట్టి వేగంగా చికిత్స అందించడమే ముఖ్యమని తెలిపింది. రెండింటికీ నిర్దిష్టమైన చికిత్స లేనందున వైద్యుల సమక్షంలో లక్షణాలకు అనుగుణంగా చికిత్స పొందాల్సి ఉంటుంది. పైగా రెండింటికీ వేర్వేరు చికిత్స చేయాలి. ఎందుకంటే డెంగీలో ఐవీ ఫ్లూయిడ్స్‌ ఇస్తారు. కరోనా రోగుల్లో వాటిని ఇవ్వడం ద్వారా అక్యూట్‌ రెస్పిరేటరీ డిసీజ్‌ సిండ్రోమ్, ఊపిరితిత్తుల్లో వాపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టకుండా ఇచ్చే హెపారిన్‌ మందు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. డెంగీ రోగుల్లో హెపారిన్‌ ఇస్తే రక్తస్రావం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్‌లో కరోనా, డెంగీ బారిన ప్రజలు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం కోరింది. 

ఇంకా ఏం చేయాలంటే? 
► రెండింటి బారిన పడిన బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స అందించాలి. బాధితుడిలో లక్షణాలు, సమస్యలను బట్టి చికిత్స చేసే విధానాన్ని మార్చాలి. 
► డెంగీ బాధితుల్లో ‘ప్యాక్డ్‌ సెల్‌ వాల్యూమ్‌ (పీసీవీ)’ఎక్కువగా ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్‌ ఇవ్వాలి. అలాగే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. 
► రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు ఎప్పటికప్పుడూ పల్స్‌ ఆక్సీమీటర్‌ ద్వారా పరీక్షించాలి. 
► ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను తెలుసుకోవడానికి ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ చేయించాలి. 
► ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డెంగీ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
► ముఖానికి మాస్కు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, భౌతికదూరాన్ని పాటించడం వంటి కరోనా నివారణ పద్ధతులు పాటించాలి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top