
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో ఉద్యోగుల బదలాయింపునకు సంబంధించిన ఆప్షన్ల వ్యవహారంపై జూనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలవారీ కేటాయింపుల వల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఆప్షన్లు ఇచ్చినా సీనియర్ల తర్వాతే తమకు కేటాయింపులు చేస్తున్నారని అంటున్నారు. పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వీరు జిల్లా పరిధిలోకి వచ్చే కేడర్ అయినా, ఆప్షన్ల వ్యవహారంతో ఇతర జిల్లాల్లో పనిచేయాల్సిన పరిస్థితి వస్తోందని కలవరపడుతున్నారు. మొదటగాసొంత జిల్లా, ఆ తర్వాత పక్క జిల్లా, దగ్గర్లోని జిల్లాలకు వీరు ఆప్షన్లు ఇస్తున్నారు.
జూనియర్లు ఆప్షన్లు ఇచ్చినా సీనియారిటీ ప్రకారం కేటాయింపులు జరుగుతుండటంతో తమను మళ్లీ వేరే జిల్లాకే కేటాయించి శాశ్వతంగా తమ సొంత జిల్లా నుంచి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మూడు, నాలుగు నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత, చాలామంది పాత జిల్లా హెడ్‌క్వార్టర్‌గా ఉన్న ప్రాంతానికే ఆప్షన్లు ఇస్తుండటంతో మరింత ఆందోళన పెరుగుతోందని జూనియర్లు వాపోతున్నారు. తమను కాదని సీనియారిటీ ప్రకారం కేటాయిస్తే పక్క జిల్లా స్థానికత ఉన్నవారు సీనియారిటీలో తమ కన్నా ముందుకు వస్తారని, దీనివల్ల తమ పదోన్నతులు సైతం ఏళ్లపాటు ఆలస్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు పద్దతుల్లోనూ సీనియారిటీనే ప్రాతిపదికగా తీసుకుంటే ఇక, తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ఇంతమాత్రం దానికి ఆప్షన్లు ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రెండున్నరేళ్లుగా..
నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆర్డర్ టు సర్వ్ కింద తమ సొంత జిల్లా కాకుండా ఇతర జిల్లాల్లో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నామని, దీనివల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నామని జూనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ సీనియారిటీ లెక్కన కేటాయింపులు జరిగితే ఇక తాము పర్మనెంట్‌గా ఆర్డర్ టు సర్వ్ కింద ప్రస్తుత ప్రాంతానికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడనుందని ఆందోళన చెందుతున్నారు. స్థానికత ప్రకారం కేటాయింపులు చేస్తే తక్కువ శాతం మందికి ఇబ్బందులున్నా, మెజారిటీ ఉద్యోగులు లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆప్షన్లలో స్థానికతకే పెద్దపీట వేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.