
బషీర్‌బాగ్ కాల్పులకు పాతికేళ్లు
ప్రజాఉద్యమంగా మారిన విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమం
కాల్పుల ఘటనతో నాటి చంద్రబాబు పాలనకు చరమగీతం
సాక్షి, హైదరాబాద్: బషీర్‌బాగ్ షహీద్‌చౌక్.. విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమానికి సాక్షీభూతంగా నిలుస్తోంది. సరిగ్గా పాతికేళ్ల క్రితం.. 2000 సంవత్సరం ఆగస్టు 28న ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ నడిబొడ్డున బషీర్‌బాగ్‌లో పోలీస్ కాల్పుల్లో ముగ్గురు నెలకొరిగారు. ఈ కాల్పుల ఘటనతో నాటి చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనకు ‘కౌంట్‌డౌన్’ మొదలైంది.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభు త్వం గ్రామీణ ప్రాంతాలు, రైతులను తీవ్ర నిర్లక్ష్యం చేసిన పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రకరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి భయానక పరిస్థితుల్లోనూ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఆదు కునే దిశగా చంద్రబాబు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అనేక జిల్లాల్లో కరువు తీవ్రత పెరిగినా పట్టించుకోలేదు.
ఇదీ నేపథ్యం...
ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి విద్యుత్ సంస్కరణల అమల్లో భాగంగా ప్రైవేటీకరణ విధానా లతో ప్రజలపై పెనుభారాన్ని పెంచేలా విద్యుత్ చార్జీలను పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ప్రజలు, రాజకీయపార్టీలు, సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను చంద్రబాబు పట్టించుకోలేదు. దీనిని వ్యతిరేకిస్తూ సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షపార్టీలు ప్రారంభించిన విద్యుత్‌చార్జీల పెంపుదల వ్యతిరేక ఉద్యమానికి పీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు, డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు.
వైఎస్ నిరవధిక దీక్షతో ప్రజా ఉద్యమంగా...
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్.రాజశేఖరరెడ్డి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. దీంతో ఈ పోరాటం రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకొని ప్రజాఉద్యమంగా రూపుదాల్చింది. చార్జీల పెంపుదల నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తంచేస్తూ సీఎం చంద్రబాబుకు నాడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ లేఖ రాశారు. 2000 సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వామపక్షాలు, కాంగ్రెస్ వేర్వేరుగా చేపట్టిన ‘చలో అసెంబ్లీ’పై బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిరసనకారులు ముందుకు సాగే ప్రయత్నం చేయగా, పోలీసులు కాల్పులకు దిగడంతో రామకృష్ణ, విష్ణువర్దన్‌రెడ్డి, బాలస్వామి తూటాలకు బలయ్యారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమం, పోలీసుకాల్పుల ఘటనలు పరోక్షంగా టీఆర్‌ఎస్ ఏర్పాటుకు కారణమయ్యాయి.
విద్యుత్ అమరవీరుల స్మారకార్థం ‘షహీద్‌చౌక్’
2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. పాదయాత్రతో ప్రజల హృదయాల్లో నిలిచిన డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఎల్బీస్టేడియంలో ప్రజల సమక్షంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అక్కడికక్కడే నిండు సభలో వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తూ తొలి సంతకంపై వైఎస్ సంతకం చేశారు. అనంతరం బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ కింద పోలీసుకాల్పుల్లో ముగ్గురు మరణించిన చోట విద్యుత్ అమరవీరుల స్మారకార్థం ‘షహీద్‌చౌక్’ను ఏర్పాటు చేశారు.
ఆనాటి నుంచి ప్రతీ ఏడాది ఆగస్టు 28న చంద్రబాబు పాలనలో కాల్పుల ఘటనను గుర్తు చేసుకుంటూ ముగ్గురు విద్యుత్ ఉద్యమ అమరవీరులకు వామపక్షాలు, ప్రజాసంఘాలు, సంస్థలు నివాళులు అర్పిస్తూ వస్తున్నాయి. గురువారం షహీద్‌చౌక్ వద్ద విద్యుత్ అమరవీరులకు జోహార్ జోహార్, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ వామపక్షపార్టీల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆనాటి విద్యుత్ ఉద్యమం నేటికీ స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.