పీహెచ్‌డీ చేయాలనుకున్నాడు.. కటకటాలపాలయ్యాడు | police solved Professor Ramachandramurthy Case | Sakshi
Sakshi News home page

పీహెచ్‌డీ చేయాలనుకున్నాడు.. కటకటాలపాలయ్యాడు

Aug 18 2025 10:09 AM | Updated on Aug 18 2025 10:19 AM

police solved Professor Ramachandramurthy Case

ఆధార్‌ కార్డే భాస్కర్‌ను పట్టించింది 

జూలై 28న   ప్రొఫెసర్‌ రాంచంద్రమూర్తిపై దాడి 

ప్రొఫెసర్ల మధ్య వాగ్వాదమే దాడికి కారణం 

యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థుల నిరసనలు 

దాడి కేసు చేధించిన వారణాసి పోలీసులు

నారాయణపేట: అసలు వారణాసిలో ఏమి జరిగిందంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్‌ విశ్వవిద్యాలయం బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) మరోసారి వెలుగులోకి వచ్చింది. తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్‌ సీఎస్‌ రామచంద్రమూర్తిపై గత నెలలో జరిగిన దాడి కేసును వారణాసి పోలీసులు సీరియస్‌గా తీసుకొని .. 15 రోజుల్లోనే చేధించారు. ఈ నేపథ్యంలో అసలు ఏమి జరిగిందనే విషయం చర్చనీయాంశంగా మారింది.  అసలు కథ ...  

అంతర్గత వివాదమే దాడికి దారి 
ప్రొఫెసర్‌ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్‌ వెంకటేశ్వర్లు మధ్య జరిగిన వివాదమే దాడికి దారి తీసిందనేది వారణాసి పోలీసుల విచారణలో వెల్లడైంది. కలత చెందిన మాజీ విభాగాధిపతి తెలంగాణకు చెందిన తన ఇద్దరు పూర్వ పరిశోధన విద్యార్థులు భాస్కర్, మోడ్గు కాసిం బాబుకు హెచ్‌ఓడీ తనను వేధిస్తున్నాడని, తనను పని చేయనివ్వడం లేదని తన బాధను వెలిబుచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో వారు ప్రయాగ్‌రాజ్‌లోని మహమ్మద్‌ కాసీం అనే పరిచయస్తుడిని సంప్రదించారు. ఈ ముగ్గురు కలిసి జూలై 25న వారణాసికి చేరుకొని కాంట్రాక్ట్‌ నేరస్తులను నియమించుకున్న గణేష్‌పాసిని కలిశారు. బీహెచ్‌యూ క్యాంపస్‌ వెలుపల ప్రొఫెసర్‌ మూర్తిపై దాడి చేయడమే అసలు పథకం. ముందుగా క్యాంపస్‌ లోపల దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ కుదరకపోవడంతో.. కట్‌చేస్తే  

ఫ్రొఫెసర్‌పై దాడి జరిగిందిలా..  
జూలై 28న సాయంత్రం 6:30 గంటకు ప్రొఫెసర్‌ మూర్తి క్యాంపస్‌ నుంచి బ్రిజ్‌ఏన్‌క్లేవ్‌ కాలనీలోని ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బిర్లా హాస్టల్‌ క్రాసింగ్‌ వద్ద ప్రొఫెసర్‌పై కడ్డీలతో దాడి చేశారు. దాడిలో ప్రొఫెసర్‌ రెండు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. దాడి అనంతరం దుండగులు హైవేపై పారిపోయారు. స్థానికులు గాయపడిన ప్రొఫెసర్‌ను చికిత్స నిమిత్తం బీహెచ్‌యూ ట్రామా సెంటర్‌కు తరలించారు.  బాధితుడి ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకోవడానికి మూడు బృందాలను ఏర్పాటు చేశారు.   

కటకటాల పాలయ్యాడు 
చిన్నప్పుడే భాస్కర్‌ తల్లిదండ్రులను కోల్పోయాడు. పెద్దనాన్న కిష్టప్ప పోషణలో పెరిగాడు. పీజీ వరకు టాప్‌ ర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. పీహెచ్‌డీ ఎంట్రెన్స్‌లో సైతం ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. పీహెచ్‌డీ పూర్తి చేయాలనుకున్న భాస్కర్‌ విధి రాత.. ప్రొఫెసర్‌ వెంకటేశ్వర్లు పెట్టిన ఆశతో కటకటాల వైపు తీసుకెళ్లినట్లు అవుసలోనిపల్లి గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement