ramachandramurthy
-
నవ్యాంధ్రలో మరో నాటకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకో భయపడు తున్నారు. భయం లేదని ప్రజలను నమ్మించేందుకు ఎనలేని ధైర్యం, పోరాట పటిమ ఉన్నట్టు నటిస్తున్నారు. ఉదారస్వభావులైన నాయకులూ, స్వశక్తిలేని అర్భకులూ ఢిల్లీ సింహాసనంపైనlఉన్నప్పుడు మాయోపాయం చేసి స్వప్రయో జనాలు నెరవేర్చుకోవడం, ప్రత్యర్థులకు అపకారం చేయడం తెలిసిన చంద్ర బాబు పప్పులు ఇప్పుడు ఉడుకుతున్నట్టు లేదు. చంద్రబాబూ, ఆయన మిత్రులూ ఒక పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో వ్యవహారం చేశారు. ఢిల్లీలో బలమైన యంత్రాంగం ఏర్పాటు చేసుకున్నారు. వాజపేయి అధికారంలో ఉన్నం తకాలం ఆయననూ, ఉపప్రధాని లాల్‌కృష్ణ అడ్వాణీనీ సేవించి తమ ప్రయో జనాలు నెరవేర్చుకునేవారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉండగా చిదంబరం, గులాంనబీ ఆజాద్ వంటి నాయకుల ద్వారా తమకు అవసరమైన పనులు చేయించుకున్నారు. వారితో కలసి కుట్రలు చేశారు. అదే కార్యాచరణ నరేంద్ర మోదీ హయాంలో నాలుగేళ్ళు కొనసాగించారు.. వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్నంత కాలం ఆయన సహకారంతో కొన్ని పనులు చేయించుకున్నారు. ఆయనకు ఉపరాష్ట్రపతిగా పదోన్నతి లభించిన అనంతరం నరేంద్రమోదీని చంద్రబాబు కలుసుకోవడమే అసాధ్యంగా కనిపించింది. అరుణ్‌జైట్లీని ప్రసన్నం చేసుకున్నప్పటికీ చంద్రబాబు కోరికలు తీర్చమని మోదీకి చెప్పే చొరవ ఆయనకు లేదు. ఎత్తులూ, పైఎత్తులే రాజకీయంగా, కుట్రలూ, కుతంత్రాలే యుద్ధవ్యూహాలుగా పరిగణించి ‘చక్రం’ తిప్పే క్రమంలో చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారు. ఎన్నికల వ్యయాన్ని విపరీతంగా పెంచడం ఆయన దేశానికి చేసిన అపకారాలలో ప్రధానమైనది. భారీగా ఖర్చు చేసి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన నాయకులు జరిగిన ఎన్నికలలో పెట్టిన ఖర్చునూ, జరగబోయే ఎన్నికలలో పెట్టవలసిన ఖర్చునూ దృష్టిలో పెట్టుకొని ప్రజాధనం కైంకర్యం చేస్తున్నారు. ఈ జాడ్యం కర్ణాటక, తమిళనాడు మీదుగా ఇతర రాష్ట్రా లకూ పాకింది. అడ్డదారులు తొక్కి అర్ధంతరంగా సంపన్నులైన క్రోనీ కేపిట లిస్టులకు రాజకీయాలలో పెద్దపీట వేయడం కూడా చంద్రబాబు ప్రారంభించిన ఆనవాయితీనే. రాజకీయ విలువలకు సమాధికట్టిన నాయకులలో అగ్రగణ్యుడు ఆయన. విలువలు లుప్తమైన ప్రస్థానంలో చంద్రబాబుపైన అనేక అవినీతి అరో పణలు వచ్చాయి. న్యాయస్థానాలలో దాఖలైన కేసులపైన విచారణ జరగకుండా ‘స్టే’ తెచ్చుకోగలిగారు. ఒక సందర్భంలో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని హైకోర్టు ఆదేశించినా ఆ సంస్థ వెనువెంటనే కదలలేదు. ఈలోగా చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. బహుశా దేశంలో మరెక్కడా ఇటువంటి పరిణామం సంభవించి ఉండదు. కాంగ్రెస్ నాయకులతో అపవిత్రమైత్రి కాంగ్రెస్ నాయకులతో సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని, కాంగ్రెస్‌కు చెందిన శంకరరావూ, టీడీపీకి చెందిన ఎర్రంనాయుడూ వేసిన పిటిషన్‌ను పురస్క రించుకొని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపైన సీబీఐని ప్రయోగించి కేసులు బనాయించారు. ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా దర్యాప్తు పేరుతో జగన్‌ను జైలులో పెట్టించి 16 మాసాలు బెయిల్ రాకుండా పకడ్బందీగా కథ నడిపించారు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత జరిగిన ఎన్నికలలో బీజేపీతో, జనసేనతో పొత్తు పెట్టుకొని అతి ప్రయాసతో గట్టెక్కారు. కడచిన నాలుగున్నర సంవత్సరాలలో అనేక అక్రమాలు జరిగాయి. అవినీతి జడలు విచ్చుకొని నాట్యం చేసింది. గవర్నర్‌కూ, ప్రధానికీ, రాష్ట్రపతికీ ప్రతిపక్షం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం శూన్యం. తన నిగూఢమైన డిమాండ్లు నెరవేర్చని కారణంగా మార్చిలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించినప్పటి నుంచీ చంద్రబాబుకు భయం పట్టుకుంది. తానూ, చిదంబరం కలిసి సీబీఐని జగన్మోహన్రెడ్డిపైన ఉసిగొల్పినట్టు మోదీ అదే సీబీఐని తనపైన ప్రయోగిస్తారేమోనన్న భయం వెన్నా డుతున్నట్టున్నది. అటువంటిదే జరిగితే ప్రజలు తన చుట్టూ రక్షణవలయంగా ఏర్పడి తనను రక్షించాలంటూ విజ్ఞప్తి కూడా చేశారు. సుజనాచౌదరి, సీఎం రమేష్‌లకు చెందిన సంస్థలలో ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడాన్ని ఖండించారు. గుజరాత్, కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్‌కు చంద్ర బాబు నిధులు అందజేసినట్టు మోదీకి సమాచారం అందిందని అంటారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడమే కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు నిధులు సమకూర్చడానికి చంద్రబాబు సన్నాహాలు చేశారని మోదీ అనుమానం. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో రాహుల్‌గాంధీతో కర చాలనం, అనంతరం ఎన్డీఏకి ప్రత్యామ్నాయం నిర్మిస్తున్నట్టు ప్రకటనలూ, తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలో కూటమి, ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళి మీడియాతో మాట్లాడి రావడం, మరోసారి వెళ్ళి రాహుల్‌తో భేటీ కావడం, బెంగళూరూ, చెన్నై సందర్శన, మీడియాలో బ్రేకింగ్ న్యూస్ మోదీకి ఆగ్రహం కలిగించి ఉంటాయి. చంద్రబాబు ఆర్థిక మూలాలను నియంత్రించకపోతే ఆయన లోక్‌సభ ఎన్నికలలో మాయావతికీ, మమతాబెనర్జీకి, ఇతర బీజేపీ ప్రత్యర్థులకూ నిధులు సమకూర్చగలరనే ఆందోళన మోదీ, షాలను కదిలించినా ఆశ్చర్యం లేదు. మోదీ మెతక వైఖరి మోదీ ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ఎంత దూరమైనా వెడతారనే పేరు ఉన్నది. కానీ చంద్రబాబు విషయంలో మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ఆయన కవ్వించినా స్పందించడం లేదు. మోదీతో యుద్ధం చేయాలన్న అభిలాష చంద్రబాబుకు ఉన్నది కానీ ఆయన తనకు దీటైన ప్రత్యర్థి అనే అభిప్రాయం కలిగించడం మోదీకి ఇష్టం లేనట్టు కనిపిస్తున్నది. అవినీతి ఆరోపణలు వచ్చినా దర్యాప్తు చేయించే ప్రయత్నం చేయలేదు. బాధితుడిగా ప్రజల సానుభూతికి చంద్రబాబు పాత్రుడు కావడం బీజేపీకి నష్టదాయకమని భావించి ఉంటారు. చంద్రబాబు మోదీనీ, ఎన్డీఏ సర్కార్‌నీ ఎంత ఘాటుగా విమర్శించినా పట్టించుకున్న దాఖలా లేదు. చంద్రబాబును ఆయన పల్లెత్తు మాట అనలేదు. తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశంసించడమే తనను అభిశంసించడంగా చంద్ర బాబు చెప్పుకుంటున్నారు తప్పితే మోదీ నోటి నుంచి ఒక్క పరుషవాక్యమైనా వెలువడలేదు. చంద్రబాబుకు నష్టం, కష్టం కలిగించే చిన్నపాటి చర్య కూడా తీసుకోలేదు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రతిష్టంభనను తొలగించే ప్రయత్నం చేయలేదు. 23మంది శాసనసభ్యులను కొనుగోలు చేసినా ఆక్షేపించలేదు. వారిలో నలుగురిని మంత్రులుగా నియమించినా తప్పు పట్టలేదు. కేంద్ర నిధులకు లెక్క చెప్పకపోయినా మందలించలేదు. అందుకే, ఇప్పటికీ బీజేపీతో చంద్రబాబుకు రహస్య మైత్రి కొనసాగుతున్నదనే సందేహం వెలిబుచ్చేవారు అనేకమంది. టీడీపీ, బీజేపీల మధ్య దోబూచులాట కొనసాగుతుండగానే, అక్టోబర్ 25న విశాఖపట్టణం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయ కుడిపైన హత్యాయత్నం జరిగింది. మొదట డీజీపీ, తర్వాత ముఖ్యమంత్రి నేలబారుగా మాట్లాడిన తర్వాత వివరాలు ఒకటి తర్వాత ఒకటి వెలుగు చూడసాగాయి. కోడిపందేలలో ఉపయోగించే వాడైన కత్తితో జగన్‌పైన హత్యా యత్నం చేసిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒంటరి కాడనీ, అతని వెనుక గూడు పుఠానీ చేసిన పెద్దలు ఉన్నారనీ, పటిష్టమైన వ్యూహంతో జగన్మోహన్రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నించారనీ నిర్ధారించే నిజాలు క్రమంగా వెల్లడ వుతున్నాయి. డీజీపీ ఠాకూర్ నాయకత్వంలోని పోలీసుల దర్యాప్తులో తమకు విశ్వాసం లేదనీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ చేత దర్యాప్తు జరిపించాలనీ కోరుతూ జగన్మోహన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ ఆరోపణలను సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని రాష్ట్రపతి కానీ ఉన్నత న్యాయస్థానం కానీ ఆదేశిస్తే పరిస్థితులు తలకిందులు అవుతాయనే ఆదుర్దాతో చంద్రబాబు సీబీఐకి ఆగస్టు 3న ఇచ్చిన అనుమతిని నవంబర్ 8న ఉపసంహరించుకున్నారు. భయభ్రాంతులతో తీసుకున్న ఈ చర్యను సైతం ఎన్డీఏ ప్రభుత్వంపైన పోరాటంగా చిత్రించడానికి వీలుగా రేపు కోల్‌కతా వెడుతున్నారు. 22న ఢిల్లీలో ప్రతిపక్ష నేతల సమావేశం నిర్వహి స్తున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా సీబీఐకి 1989లో వామపక్ష సంఘటన ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటు న్నట్టు ప్రకటించారు. అవినీతి ఆరోపణలు అనేకం చంద్రబాబుపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా, సన్నిహితులపైనా తాజా అరోపణలే అనేకం ఉన్నాయి. 1)సీబీఐలో చిచ్చు పెట్టిన సానా సతీశ్ చంద్ర బాబుకు సన్నిహితుడు. సీబీఐ ఉన్నతాధికారికి ముడుపులు చెల్లించారనే ఆరోపణ సతీశ్ ఎదుర్కొంటున్నారు. 2) చంద్రబాబు, లోకేశ్‌ల అక్రమార్జనపైన సీబీఐ దర్యాప్తును ఆదేశించాలని కోరుతూ రిటైర్డ్ న్యాయాధికారి శ్రావణ్‌కుమార్ సెప్టెం బర్లో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. మరిన్ని సాక్ష్యాధా రాలతో మరో పిటిషన్ వేయవలసిందిగా హైకోర్టు కోరింది. 3) 2013లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఆస్తులపైన దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌ల ఆస్తులపైన కూడా పరిశీలన జరిపించాలని కోరింది. 4) లోకేశ్ 80 ఎకరాల భూమిని కబ్జా చేశారనే అరోపణపైన విచారణ జరిపించాలని సీబీఐకి వైఎస్ఆర్సీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. లోకేశ్ భార్య బ్రాహ్మణిపైన సైతం 2011లో ఆరోపణలు వచ్చాయి. 5) సీఎం రమేశ్‌కు చెందిన కంపెనీలపైన ఐటీ దాడులలో లభించిన సాక్ష్యాధారాలు పరిశీలనలో ఉన్నాయి. 6) ‘ఆపరేషన్ గరుడ’ అనే హాస్యభరి తమైన నేరకథనంపైన దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ ఉండనే ఉన్నది. ఇవి కాక అనేక కేసులలో విచారణ జరగకుండా ‘స్టే’ తెచ్చుకున్నారు. ఏ ఒక్క కేసులోనైనా సీబీఐ దర్యాప్తు జరిగినా, ‘స్టే’ ఎత్తివేసినా చంద్రబాబుకు సమస్యలు ఎదురవుతాయి. సీబీఐ సోదాలను అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఆగస్టు3 జారీ చేసిన జీవో నంబర్ 109ని ఉపసంహరించుకుంటూ మరో జీవో జారీ చేయడం వల్ల వాస్తవంగా ఏమి జరుగుతుంది? సీబీఐ రంగంలో ఎప్పుడు దిగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు లేదా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆదేశించిన ప్పుడు. ఆదాయంపన్ను సోదాలు చేసినా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ దాడులు చేసినా, సీబీఐ దర్యాప్తు జరిపినా రాష్ట్ర ప్రజలపైన దాడి చేసినట్టుగా అభివర్ణిస్తూ ఆవేశం రగిలించడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు స్వయంగా సీబీఐ దర్యా ప్తును కోరే అవకాశం లేదు. ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తే సీబీఐని అడ్డుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ సంగతి తెలిసి కూడా అనుమతి ఉప సంహరించుకుంటూ జీవో ఎందుకు జారీ చేశారు? తనపైన వచ్చిన ఆరో పణలన్నీ రాజకీయ లక్ష్యంతో, ప్రతీకారేచ్ఛతో చేసినవేనని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. ఉత్తరోత్తరా తాను భయపడుతున్నట్టు సీబీఐ దర్యాప్తు జరిగినా దానికి రాజ కీయరంగు పులమటం తేలిక. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల దృష్టిని మౌలిక సమస్యలపై నుంచీ, టీడీపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచీ, పెచ్చరిల్లిన అవినీతి నుంచీ మళ్ళించడానికి ఏదో ఒక నాటకీయమైన ఉదంతం సాగుతూ ఉండాలి. కొంతకాలం అమరావతి అనే అద్భుతమైన నగరం గురించి అందమైన కథలు చెప్పారు. అస్మదీయులతో కలసి విదేశీ పర్యటనలు చేశారు. ప్రత్యేక తరగతి హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఎంత అభిలషణీయమో వివరిస్తూ ప్రసంగాలు చేశారు. ప్యాకేజీ ప్రసాదించినవారికి దండాలు పెట్టారు. సన్మానాలు చేశారు. మోదీ గ్రాఫ్ పడిపోతోందని భావించి, కొత్త కూటమి కట్టడం అనివార్య మనిపించి సరికొత్త నాటకానికి తెరతీశారు. ఎన్డీఏ నుంచి వైదొలిగారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకీ, లోక్‌సభకూ జరిగే ఎన్నికల సమయంలో దీనిని పతా కస్థాయికి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం. అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్, కడప సిమెంట్ ఫ్యాక్టరీ, దుర్గగుడి ఎదుట ఫ్లయ్‌ఓవర్, కరువు జిల్లాలలో సహాయ, పునరావాస చర్యలు, వ్యవసాయదారుల అగచాట్లు, నిరుద్యోగుల నిర్వేదం, డ్వాక్రామహిళల ఆక్రందనల ప్రస్తావన ఎక్కడా కనపడకుండా, వినప డకుండా మీడియాలో మత్తెక్కించే నాటకీయ రాజకీయ సమాచారం దట్టించడం తాజా వ్యూహం. కె. రామచంద్రమూర్తి -
నిరర్థక విన్యాసాలు
త్రికాలమ్ మితభాషి మౌనంగా ఉండటంలో వింత లేదు. ప్రతి సందర్భంలోనూ గంటకు తక్కువ కాకుండా మీడియా గోష్ఠిలో మాట్లాడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండువారాలకు పైగా మాట్లాడకుండా లీకులతోనే వార్తలలో అగ్రగణ్యుడిగా ఉండటం విశేషం. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులూ, అన్ని రాష్ట్రాలలోనూ ఆంధ్రప్రదేశ్‌కే అధికంగా కేంద్ర నిధులు అందాయంటూ బీజేపీ నాయకులూ వాదులాడుకున్నారు. చంద్రబాబునాయుడు మాత్రం పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి మీడియాకు దూరంగా ఉంటూ ఆయన కేంద్రంపైన నిప్పులు కురిపించినట్టూ, ఆగ్రహం వెలిబుచ్చినట్టూ, తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధమైనట్టూ వార్తలు పుంఖానుపుంఖంగా పత్రికలలోనూ, టీవీ చానళ్ళలోనూ వచ్చేట్టు చేశారు. మేఘనాథుడు, ఘటోత్కచుడు మేఘాల మాటున కదలాడుతూ నేలపైన ఉన్న శత్రువులతో యుద్ధం చేసినట్టు మీడియా మాటున చంద్రబాబునాయుడు అత్యంత లాఘవంగా పోరాటం చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటులో సమర్పించి రెండువారాలు దాటిన తర్వాత శనివారంనాడు ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో బిత్తరపోయి చూస్తున్న విద్యార్థుల ఎదుట గంభీరమైన రాజకీయోపన్యాసం చేశారు. ఆవేశంగా ప్రసంగించారు కానీ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సందేశం ఏదీ అందించలేదు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని అనలేదు. చివరికి బడ్జెట్లో సైతం అన్యాయం చేసినందుకు కేంద్రం నుంచి ఇద్దరు తెలుగుదేశం మంత్రులనీ ఉపసంహరించుకుంటానని చెప్పలేదు. పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేయిస్తానని కూడా చెప్పలేదు. పాత మాటలనే స్వరం పెంచి కాస్త కటువుగా అన్నారంతే. అంతకు ముందు సాధారణంగా మెత్తగా మాట్లాడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. హరిబాబు, కేంద్ర బీజేపీ ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఎంతెంత సాయం చేసిందో గణాంకాలు విడుదల చేశారు. సోము వీర్రాజు వంటి బీజేపీ నాయకులు చంద్రబాబునాయుడిని గట్టిగానే విమర్శించారు. వీర్రాజు, బోండా ఉమామహేశ్వరరావుల మధ్య వాగ్వాదం రాష్ట్ర ప్రజలందరూ ఆలకించారు. తాను బీజేపీతో అంటకాగుతూనే వైఎస్ఆర్సీపీతో బీజేపీ ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకోబోతోంది అంటూ చంద్రబాబునాయుడు ఒకానొక సమావేశంలో వ్యాఖ్యానిం చినట్టు వచ్చిన లీకులకు మీడియా ప్రాచుర్యం ఇచ్చింది. పవన్‌కల్యాణ్ పూనిక తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తున్న రాజకీయ నాటకానికి తోడుగా సుప్రసిద్ధ సినీ నటుడు పవన్‌కల్యాణ్ మరో వేదికపైన సరికొత్త విన్యాసం ప్రారంభించారు. ప్రజల తరఫున పోరాటం చేయడానికి తన బలం చాలడం లేదని చెబుతూ జగమెరిగిన జయప్రకాశ్‌నారాయణ (జీపీ)నీ, వాగ్బాణాలు సంధించడంలో సవ్యసాచిగా పేరు తెచ్చుకున్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌నీ, కేంద్ర మాజీ హోం కార్యదర్శి పద్మనాభయ్యనూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ముఖ్యకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావునీ, మరికొంతమంది మేధావులనూ ఒక వేదికపైన చేర్చి నిజనిర్ధారణ కమిటీ (జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ)ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పనక్కర లేదంటూ శుక్రవారంనాడు ఎన్టీవీ ఇంటర్వ్యూలో జయప్రకాశ్‌నారాయణ అన్న మాటలనే చంద్రబాబునాయుడు ఇంజనీరింగ్ కళాశాల ఉపన్యాసంలో మరింత స్పష్టంగా అన్నారు. నోటుకు ఓటు కేసులో తెలంగాణ ప్రభుత్వంతో ‘మీకు సీబీసీఐడీ ఉంది మాకూ సీబీసీఐడీ ఉంది, మీకు పోలీసులు ఉన్నారు, మాకూ పోలీసులు ఉన్నారు’ అన్న చందంగానే ‘కేంద్రానికి అధికారాలు ఉన్నాయి, రాష్ట్రానికీ అధికారాలు ఉన్నాయి. కేంద్రం లెక్కలు పార్లమెంటులో చెప్పాలి. రాష్ట్రం శాసనసభలో చెప్పాలి,’ అంటూ వాదించారు. జమాఖర్చు వివరాలు ఎక్కడైనా చెబుతున్నారా? నిజనిర్ధారణ కమిటీలో ఉన్న మేధావులు స్వతంత్ర వ్యక్తిత్వం కలిగినవారు. ఒకరి మాటను మరొకరు మన్నించాలన్న పట్టింపు లేదు. లోకం తీరు బాగా తెలిసినవారూ, అనేక యుద్ధముల ఆరియు తేరినవారూ పవర్‌స్టార్ పిలుపందుకొని ఆయనకు అండగా నిలబడటం విశేషం. వీలైనంతవరకూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేయాలన్నది వారి సంకల్పం అనడంలో సందేహం అక్కరలేదు. సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఎన్ని పిటిషన్లు పెట్టినా స్పందించని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్‌కల్యాణ్ నాయకత్వంలోని నిజనిర్ధారణ కమిటీకి అన్ని వివరాలూ అందజేయడానికి సంసిద్ధతను వెలిబుచ్చింది. హరిబాబు విడుదల చేసిన వివరాలకూ, మంత్రి కాల్వ శ్రీనివాసులు అందజేసే అంకెలకూ మధ్య అంతరం విధిగా ఉంటుంది. లక్ష కోట్లకు పైగా ఇచ్చామని హరిబాబు చెబుతున్నారు. వేలకోట్లు కూడా ముట్టలేదని చంద్రబాబునాయుడు అంటున్నారు. అందరూ ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నప్పటికీ మొదటిరోజు నిజనిర్ధారణ సంఘం సమావేశం ముగిసే సమయానికే మేధావులలో భిన్నస్వరాలు వినిపించాయి. ప్రత్యేక హోదాను మంత్రంతో పోల్చుతూ జేపీ రాష్ట్ర అభివృద్ధికి ఏమి కావాలో అడగాలి కానీ మంత్రాలతో ప్రయోజనం లేదని ఎన్టీవీ ఇంటర్వ్యూలో వాదించారు. ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్‌కి ప్రయోజనం కలుగుతుందని తాను భావిస్తున్నట్టు ఉండవల్లి అన్నారు. మనం చెల్లిస్తున్న పన్నులనే మనకు తిరిగి ఇస్తున్న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పవలసిన అవసరం లేనేలేదని జేపీ అంటే లెక్కచెప్పి తీరాలనీ, యుటిలైజేషన్ సర్టిఫికెట్ కూడా కేంద్రానికి పంపించాలనీ ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం సాయంత్రమే స్పష్టం చేశారు. ‘గణాంకాలు కొత్తగా సేకరించేది ఏముంది? అన్ని లెక్కలూ ఉన్నాయి. ఇప్పుడు కావలసింది అధ్యయనం, క్షేత్రంలో పోరాటం,’ అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ దిశానిర్దేశం చేశారు. నానాగోత్రీకులు పవన్‌కల్యాణ్ ఆహ్వానం అందుకొని ఒక వేదిక మీదికి వచ్చారు. కానీ వారు ఎన్ని అంశాలపైన ఏకాభిప్రాయం వెలిబుచ్చుతారో చూడాలి. ఇరవై ఏళ్ళ కిందట జేపీ లోక్‌సత్తాను నెలకొల్పినప్పుడు ఆయనతో కలసి పనిచేయడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి కెఆర్ వేణుగోపాల్, అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు వంటి హేమాహేమీలు నడుం బిగించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు వీలైనంత సేవ చేయాలన్నదే వారి అభిలాష కూడా. తర్వాత వారు వెనక్కు తగ్గారు. వారిలాగే చాలామంది పోరాటం విరమించుకున్నారు. జేపీ ఒక్కరే అలుపెరుగని యోధుడిలాగా పోరాటం చేస్తున్నారు. పవన్‌కల్యాణ్‌కైనా, చిరంజీవికైనా రాజకీయాలు సినిమారంగానికి కొనసాగింపే. విజయం సిద్ధిస్తే ఇక్కడ కొనసాగుతారు. లేకపోతే సినిమారంగం ఉండనే ఉన్నది. సినిమా కొనసాగింపు అన్ని స్థానాలకూ పోటీ చేయాలనీ, గెలిచి అధికారం చేపట్టాలనే సంకల్పంతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పారు. పార్టీ అధ్యక్షుడుగా, కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల రుచి చూశారు. అవి రుచించకనే తిరిగి సిని మాలలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్‌లో తిరిగి జవసత్వాలు నింపడానికి ప్రయత్నిస్తానంటే పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అధిష్ఠానం సిద్ధంగా ఉంది. కానీ చిరంజీవి సిద్ధంగా లేరు. పవన్‌కల్యాణ్ నాలుగేళ్ళపాటు సినిమాలో ఒక కాలూ, రాజకీయాలలో ఒక కాలూ అన్నట్టు కాలక్షేపం చేశారు. నరేంద్రమోదీని కానీ చంద్రబాబునాయుడిని కానీ పల్లెత్తు మాట అనకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటూ కొన్ని కార్యక్రమాలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా కొన్ని రోజుల పాటు వరుసగా రాజకీయాలలో గడుపుతున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టూ, టీడీపీని కూడా విమర్శిస్తున్నట్టూ అర్థం కావడానికి ప్రయత్నిస్తున్నారు. నిజనిర్ధారణ సంఘం ఒక ఎన్జీవో లాంటిది. బీజేపీ విడుదల చేసిన జాబి తానూ, రాష్ట్ర ప్రభుత్వం అందించిన జాబితానూ పరిశీలించిన అనంతరం ఈ సంఘం ఏమి చేస్తుంది? ఎవరి వాదన నిజమో ఎట్లా నిర్ధారిస్తుంది? అంతకు మించి ఏమి చేస్తుంది? ఉదాహరణకు రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పవచ్చు. ఆ నిధులను ఎట్లా ఖర్చు చేసిందో ప్రభుత్వం ఈ కమిటీకి చెబుతుందా? వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్ (బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్స్ ఫండ్) కింద ఎంత ముట్టిందో, ఎంత ఖర్చు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందా? పట్టిసీమ నిర్మాణం ఆవసరమా, కాదా అనే అంశంపైన, పోలవరం పనులపైనా జేపీకీ, ఉండవల్లికీ మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా? ఎవరి రాజకీయ ప్రయోజనాలూ, దృష్టికోణాలూ ఎట్లా ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఎందుకు అవసరమో తెలుసుకోవాలి. ఇది మంత్రమే. ప్రగతిమంత్రం. సాధారణంగా బాగా వెనుకబడిన కొండ ప్రాంతాలకు మంజూరు చేసే ఈ హోదాను ప్రత్యేక పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వడానికి రాజ్యసభలో సరిగ్గా నాలుగేళ్ళ కిందట 2014 ఫిబ్రవరి 20న విభజన బిల్లుపైన రాజ్యసభలో చర్చ జరుగుతున్న సందర్భంలో బీజేపీ నాయకుడు ఎం వెంకయ్యనాయుడు నాటి ప్రధాని మన్మోహన్సింగ్ను గట్టిగా అడిగి సాధించారు. 1967 నుంచి ఇప్పటి వరకూ ప్రత్యేకహోదాను అస్సాం, నాగాలాండ్, జమ్మూ–కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌కు ఇచ్చారు. కొండలూ గుట్టలూ ఉండి, తక్కువ జనాభా ఉండి, అంతర్జాతయ సరిహద్దు పొడవునా ఉండి, ఆర్థికంగా వెనుకబడి ఉండి, ప్రాథమిక వసతులు ఏ మాత్రం లేని, అర్థికంగా అట్టడుగున ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చారు. ఈ అంశాల దృష్టితో చూస్తే ఆంధ్రప్రదేశ్‌కు అర్హత ఉండదు. కానీ హైదరాబాద్ నగరం తెలంగాణలో ఉండటం కారణంగా బాగా నష్టబోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సహాయం కింద అయిదేళ్ళపాటు ప్రత్యేకహోదా ఇవ్వాలని మన్మోహన్సింగ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యసభలో ప్రకటన తర్వాత మంత్రిమండలి తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ప్రణాళికాసంఘానికి ఆదేశాలు పంపింది. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో ఉన్న అంశాలతో పాటు ప్రత్యేకహోదా హామీని అమలు చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది. ఆ పని చేయకుండా నరేంద్రమోదీ, చంద్రబాబునాయుడూ యూపీఏ ప్రభుత్వం అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిందంటూ శాపనార్ధాలు పెడుతూ నాలుగేళ్ళు కాలక్షేపం చేశారు. 14వ ఆర్థిక కమిషన్‌ను అడ్డం పెట్టుకొని ప్రత్యేకహోదా కుదరదన్నారు. ప్రత్యేక ప్యాకేజి అన్నారు. చివరికి అది కూడా అందలేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. ఎవరు నిజం చెబుతున్నారో తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ సంఘం పరిశీలనాంశాలలో ప్రత్యేకహోదా లేకపోవడం విచిత్రం. ప్రత్యేకహోదా ఆవశ్యకత ప్రణాళికాసంఘం పోయి నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత పన్నుల ఆదాయం మొత్తంలో రాష్ట్రాలకి ఇదివరకు వచ్చే 32 శాతానికి బదులు 42 శాతం వాటా వస్తుంది కనుక ప్రత్యేకహోదా ప్రసక్తి ఉండదని తేల్చి చెప్పారు. ప్రత్యేకహోదా ఇవ్వరాదని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదు. ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రాలలో పరిశ్రమలు పెట్టినవారికి పెట్టుబడులలో సబ్సిడీ ఉంటుంది. ఆదాయంపన్నూ, ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలూ, కార్పొరేట్ పన్నులలో రాయితీలు ఉంటాయి. రవాణా చార్జీలలో సబ్సిడీ ఇస్తారు. ఇన్ని వసతులు అదనంగా ఉంటాయి కనుకనే హిమాచల్‌ప్రదేశ్‌లోనూ, ప్రత్యేకహోదా కలిగిన ఇతర రాష్ట్రాలలోనూ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి ప్రదర్శిస్తారు. ఎన్ని శిఖరాగ్ర సదస్సులు నిర్వహించినా, ఎంత భూమి ఇస్తానంటూ వాగ్దానం చేసినా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పరిశ్రమలు రాకపోవడానికి కారణం ప్రత్యేకహోదా లేకపోవడమే. ప్రత్యేకహోదా కారణంగా లభించే రాయితీలు లేకపోతే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలను కాదని విజయవాడకో, విశాఖకో, తిరుపతికో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ఎందుకు వస్తారు? పరిశ్రమలు రాకపోతే ఉపాధి అవకాశాలు ఎట్లా పెరుగుతాయి? అందుకే ప్రత్యేకహోదా సంజీవని అంటున్నది. ప్రత్యేకహోదా నిరర్థకమైనదే అయితే పదేళ్ళు కావాలని వెంకయ్యనాయుడూ, పదిహేనేళ్ళు కావాలని చంద్రబాబునాయుడు ఎందుకు ఉద్ఘోషించారు? ఆ హక్కు కోసం సమష్టిగా పోరాడకుండా వ్యక్తిగత రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకోసం పరోక్ష పోరాటాలు చేయడం వలన ప్రయోజనం శూన్యం. కె. రామచంద్రమూర్తి -
రాజకీయ ప్రమేయాలతో మీడియాపై దాడులు
కొరుక్కుపేట (చెన్నై): రాజకీయ ప్రమేయాలే మీడియాపై దాడులకు కారణమవుతున్నాయని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ ఆఫ్ మీడియా ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా లీడ్ పేరుతో మీడియాపై ‘దాడులు– బెదిరింపులు–మీడియాలో నేటి పరిస్థితి’పై జాతీయ సదస్సు ఆదివారం నిర్వహించారు. ఇందులో సాక్షి మీడియా తరఫున రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్, ది హిందూ చైర్మన్ ఎన్.రామ్, ఎడిటర్ ముకుంద్ పద్మనాభన్, టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ అరుణ్‌రామ్, నటి, సామాజిక కార్యకర్త గౌతమి, తమిళనాడు మంత్రి ఎం.పాండియరాజన్, ఎన్డీ టీవీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావిస్ కుమార్, డీఎంకే ఎమ్మెల్యే త్యాగరాజన్, వెటరన్ జర్నలిస్ట్ భాస్కర్లతో పాటు పలు తమిళ మీడియా, ఇతర పత్రికలు, చానళ్ల సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. మీడియాలో రాజకీయాల పాత్ర ఎంతున్నా, ప్రస్తుతం మీడియా, రాజకీయాలు విడిపోయాయన్నారు. తమకు అనుకూలంగా లేకపోతే ఏకంగా ప్రభుత్వాలే దాడులకు దిగడం వేదన కలిగిస్తుందని చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రజలకు, మీడియాకు వివరణ ఇచ్చేందుకు సాహసించడం లేదన్నారు. ఈ సందర్భంగా మీడియాపై సాగుతున్న దాడులపై చర్యలు, మీడియా భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై 5 తీర్మానాలు చేశారు. తీర్మానాలను కేంద్రంతోపాటు దక్షిణ భారతంలోని రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపించనున్నట్లు సదస్సు కోఆర్డినేటర్ సంధ్య రవిశంకర్ తెలిపారు. సదస్సులో జర్నలిజం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మోదీ విస్త‘రణం’
త్రికాలమ్ ఈ రోజు ఉదయం జరగనున్న మంత్రిమండలి పునర్నిర్మాణం బీజేపీకీ, ప్రధాని నరేంద్ర మోదీకీ అత్యంత ప్రధానమైనది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి పూర్తి స్థాయి విస్తరణ ఇది. దీని తర్వాత భాగస్వామ్య పక్షాల ప్రతినిధులను చేర్చుకునేందుకు కొన్ని చేర్పులు ఉండవచ్చు కానీ ఇంత పెద్ద కుదుపు ఉండదు. విస్తరణ తర్వాత రూపొందే కొత్త మంత్రిమండలి పనితీరుపైనే 2019 ఎన్నికలలో ఎన్డీఏ సాధించే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మంత్రుల రాజీనామాల గురించీ, కొత్తగా చేరబోయే మంత్రుల గురించీ రకరకాల వదంతులు వింటున్నాం. ప్రభుత్వం ఎటువంటి ప్రకటనా చేయలేదు. రాజీనామా చేసిన మంత్రులలో ఒకరు అవినీతి ఆరోపణల కారణంగా వైదొలగవలసి వస్తున్నదని అంటున్నారు. అవినీతి మంత్రి పేరు మాత్రం వెల్లడి కాలేదు. ఇటీవల ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మట్లాడుతూ, ‘మాది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు లీకులు ఇవ్వడానికి. మేం మీడియా మిత్రులను ఆశ్చర్యపర్చుతాం. ఒక్క వెంకయ్యనాయుడి విషయంలోనే మీరు ముందుగా చెప్పగలిగారు. కోవింద్ విషయంలో కానీ ఇంకా అనేక ఇతర సందర్భాలలో కానీ మీడియా జోస్యం నిజం కాలేదు. ఇప్పుడు కూడా అంతే’అన్నారు. ఈ సారి ప్రధాని కంటే పార్టీ అధ్యక్షుడు ఎక్కువ క్రియాశీలకంగా ఉండటం విశేషం. మంత్రుల రాజీనామాలను ప్రధాని కార్యాలయం(పీఎంఓ) కాకుండా అమిత్‌షా ఫోన్ చేసి అడుగుతున్నారు. మంత్రివర్గ విస్తరణ సందర్భంలో 54 ఏళ్ళ కిందటి కామరాజ్ తర్వాత ఒక పార్టీ అధ్యక్షుడు అంతటి కీలకమైన భూమిక పోషించడం ఇదే ప్రథమం. మూడేళ్ళుగా తన మంత్రుల పనితీరును ప్రధాని శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు. రెండువారాల పాటు వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీలనూ, జాయింట్ సెక్రటరీలనూ ప్రధాని, పీఎంఓకు చెందిన ముఖ్యమైన అధికారులూ కలుసుకొని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దీనికి తోడు ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకున్నారు. బీజేపీ పక్షాన పనిచేస్తున్న సోషల్ మీడియా యంత్రాంగం ద్వారా సమాచారం సేకరించారు. మూడు వ్యవస్థల నుంచి అందిన సమాచారాన్ని కాచి వడబోసే బాధ్యతను అమిత్‌షాకి అప్పగించారు. ఆయనకు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు సహకరించారు. ఇది కాకుండా మథురలోని బృందావన్‌లో జరుగుతున్న మూడు రోజుల ఆర్ఎస్ఎస్ సమన్వయ సమితి సమావేశాలలో పాల్గొన్న అమిత్‌షా సంఘ్ ప్రముఖుల అభిప్రాయాలు సేకరించారు. విస్తరణ గురించి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్‌తో అమిత్‌షా సవివరంగా చర్చించారు. చివరికి నరేంద్ర మోదీతో శనివారం రాత్రి సమాలోచనలు జరిపి తుది జాబితా రూపొందించారు. నిరుడు జులైలో విస్తరణ జరిగినప్పుడు ఇంత విస్తృత సమాలోచనలు లేవు. అప్పుడు 19 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ప్రకాశ్ జావదేకర్‌ను సహాయ మంత్రి హోదా నుంచి కేబినెట్ హోదాకు పెంచారు. ఐదుగురు సహాయ మంత్రులకు ఉద్వాసన చెప్పారు. చడీచప్పుడు లేకుండా జరిగిపోయింది. ఈ సారి రెండురోజులుగా వివిధ నాయకులతో అమిత్‌షా చర్చిస్తున్నారు. తలలేని ముఖ్యమైన శాఖలు వెంకయ్యనాయుడు రాజీనామా, మనోహర్ పారీకర్ రక్షణశాఖను వదిలేసి గోవా ముఖ్యమంత్రిగా వెళ్ళిపోవడంతో పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖలూ, రక్షణ శాఖా ఇతర మంత్రులకు అదనపు శాఖలుగా చేరాయి. కీలకమైన ఈ శాఖలకు సమర్థులైన మంత్రులను నియమించవలసిన అవసరం ఉన్నది. ఈ సారి మార్పులు చేర్పులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు నిర్ణయించుకున్నారు. ఒకటి, అవినీతి మరక అంటిన వారికి ఉద్వాసన చెప్పడం. రెండు, ప్రధాని అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తున్న కార్యక్రమాలను (ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలు) ఉద్యమసదృశంగా నడిపించ లేనివారిని గుర్తించి తొలగించడం. మూడు, మంత్రులు చూపుతున్న చొరవనూ, వారి సృజనాత్మకతనూ, వారు సాధిస్తున్న ఫలితాలనూ అధ్యయనం చేసి మూల్యాంకన చేయడం. నాలుగు, 2019 లోపు శాసనసభ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని తొలగించినట్టు రూఢి కాని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నిప్పు లేకుండా పొగ రాదని భావిస్తే ఈ ఆరోపణలలో ఎంతో కొంత నిజం ఉంటుందని అనుకోవాలి. ఇది మోదీ ప్రభుత్వానికి అప్రదిష్ట. ప్రస్తుతానికి రహస్యంగా ఉంచినప్పటికీ కాలక్రమేణా వివరాలు వెలుగులోకి రావచ్చు. మంత్రి పేరు వెల్లడి కావచ్చు. రాజీనామా చేసిన వారిలో రాజీవ్‌ప్రతాప్ రూడీ, కల్రాజ్ మిశ్రా, దత్తాత్రేయలు మూడు ముఖ్యమైన శాఖలు నిర్వహిస్తున్నారు. రూడీది స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖ. మిశ్రాది మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ శాఖ. దత్తన్నది కార్మికశాఖ. యువతకు మెలకువలు నేర్పించి, వారి చేత చిన్న వ్యాపారాలో, పరిశ్రమలో పెట్టించి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేయవలసింది ఈ శాఖలే. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తానంటూ మోదీ 2014 ఎన్నికల ప్రచారంలో ఊదరకొట్టారు. ఉద్యోగాల కోసం యువతరం మూడేళ్ళుగా ఎదురు చూస్తోంది. కనీసం స్కిల్స్ నేర్పించి ఉపాధి కల్పించే ప్రయత్నమైనా జరిగిందా అంటే అదీ లేదు. ‘నయా ఇండియా’నినాదంతో యుద్ధ ప్రాతిపదికపైన జరగవలసిన పనులు నత్తనడక నడుస్తుంటే వచ్చే ఎన్నికలలో ఎన్డీఏ యువతీయువకుల ఆగ్రహం చవి చూడవలసి వస్తుం ది. ఈ మూడు శాఖల నిర్వహణ ఆశించిన విధంగా లేకపోవడంతో ముగ్గురు మంత్రులచేతా రాజీనామా చేయించారు. కల్రాజ్మిశ్రాకి 77 ఏళ్ళు. వయసు పైనపడింది కనుక బాధ్యతల నుంచి తప్పించవలసిందిగా తానే ప్రధానిని కోరినట్టు మిశ్రా చెప్పారు. ‘బేటీ బచావ్, బేటీ పఢావ్’కూడా ప్రధాని ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న కార్యక్రమాలలో ఒకటి. ఈ కార్యక్రమం కుంటినడక మేనకాగాంధీ శాఖ మార్పిడికి గల కారణాలలో ఒకటి. ‘స్వచ్ఛభారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’కూడా మోదీ అట్టహాసంగా ప్రకటించిన కార్యక్రమాలు. ఇటువంటి ‘ఫ్లాగ్షిప్’కార్యక్రమాల విజయంపైనే ఎన్డీఏ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాటిని తిరిగి ఎవరికి అప్పజెప్పాలనేది కీలకమైన అంశం. అందుకే సుదీర్ఘ సమాలోచన. నయా కామరాజ్ నాడార్ అమిత్‌షా తొమ్మిదిమంది మంత్రులు రాజీనామా చేశారని కొన్ని చానళ్ళూ, ఏడుగురే చేశారని మరికొన్ని చానళ్ళూ చెబుతున్నాయి. శుక్రవారంనాడు రాజీనామా చేసిన మంత్రుల జాబితాలో ఉమాభారతి, నిర్మలాసీతారామన్ పేర్లు ఉన్నాయి. శనివారంనాడు మోహన్భాగవత్తో అమిత్‌షా సమావేశం ఫలితంగా ఉమాభారతి రాజీనామాను ఆమోదించకపోవచ్చునని అభిజ్ఞవర్గాల భోగట్టా. అట్లాగే నిర్మలాసీతారామన్‌కు సమర్థురాలైన మంత్రిగా పేరుంది. కాకపోతే మాట పెళుసు. ఆమెకు ఉద్వాసన చెప్పే ప్రసక్తి లేదు. పైగా ఆమెకు తమిళనాడులో బీజేపీ వ్యవహారాలను పర్యవేక్షించే అదనపు బాధ్యత అప్పగించవచ్చు. ఈ మధ్య జరిగిన వరుస రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేస్తానని చెప్పిన రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుకు సమర్థుడిగా, నిజాయతీపరుడిగా మంచి పేరుంది. ఆయనకు రక్షణ శాఖను అప్పగించవచ్చు. నితిన్‌గడ్కరీ, పీయూష్ గోయెల్ వంటి కొందరు మంత్రులు దీక్షాదక్షతలతో పని చేస్తున్నారని ప్రధాని కార్యాలయం గుర్తించింది. గడ్కరీకి ఉపరితల రవాణా, జలరవాణాతో పాటు రైల్వే శాఖ కూడా అప్పగించే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. రైల్వే బదులు పౌర విమానయాన శాఖ అప్పగించినా ఆశ్చర్యం లేదు. ఆయన సామర్థ్యంపై ఆర్ఎస్ఎస్ అధినేతకు అపార విశ్వాసం. మోదీని గడ్కరీ శనివారం రాత్రి కలుసుకున్నారు. ఏమి నిర్ణయించారో తెలియదు. కర్ణాటకలో వచ్చే సంవత్సరం ఏప్రిల్–మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రం నుంచి ఇప్పటికే అనంతకుమార్ (బ్రాహ్మణ), సదానందగౌడ (వొక్కలిగ), రమేశ్ జిగజిగడి (దళిత్) మోదీ కేబినెట్లో ఉన్నారు. అనంతకుమార్ హెగ్డే (బ్రాహ్మణ)కు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ యేడాది చివరలో జరగనున్నాయి. ఆ రాష్ట్రం నుంచి అనురాగ్ ఠాకూర్‌ను మంత్రిమండలిలోకి తీసుకోవాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్టులేదు. తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యేనా? తెలుగు రాష్ట్రాల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. విశాఖ లోక్‌సభ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కుటుంబ సమేతంగా విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళారు. తుది జాబితాలో ఆయన పేరు ఉన్నట్టు లేదు. చివరి క్షణంలో ఏమైనా మార్పులు జరిగితే ఆయనకు పదవి దక్కవచ్చు. రెండు రోజులుగా రామ్‌మాధవ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆయన కొలంబోలో తన ఆధ్వర్యంలోని ‘ఇండియా ఫౌండేషన్’నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్’లో నిమగ్నమై ఉన్నారు. తెలంగాణలో బండారు దత్తాత్రేయ స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది అస్పష్టం. కిషన్‌రెడ్డి, మురళీధరరావు పేర్లు చర్చకు వచ్చాయి. కిషన్‌రెడ్డి అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకుడు. మురళీధరరావు శనివారం రాత్రి వరకూ బెంగళూరులోనే ఉన్నారు. రాజస్థాన్‌లో నీటి పారుదల వ్యవహారాలలో ముఖ్యమంత్రి వసుంధరరాజేకు సలహాదారుడిగా పనిచేస్తున్న వెదిరె శ్రీరామ్ పేరు బుల్లితెర మీదికి వచ్చింది. బీజేపీ అందుబాటులో రెండు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. వెంకయ్యనాయుడు ఖాళీ చేసిన రాజస్థాన్ స్థానం, కేంద్రమంత్రి అనిల్ దవే అకాల మరణం కారణంగా మధ్యప్రదేశ్‌లో ఖాళీ అయిన స్థానం. ముగ్గురు తెలంగాణ నాయకులలో ఎవరికి అవకాశం ఇచ్చినా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలి. ఎవ్వరికీ అవకాశం రాకపోయినా ఆశ్చర్యం లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఇప్పుడు అవకాశం లేనట్టు కనిపిస్తోంది. జేడీ(యూ) ఇటీవలే ఎన్డీఏ తీర్థం పుచ్చుకున్నా మోదీ ఇవ్వజూపుతున్న ఒక కేబినెట్ మంత్రి పదవి, మరో సహాయ మంత్రి పదవి ఆ పార్టీకి ఆమోదయోగ్యం కాదు. తమిళనాడు రాజకీయం రసకందాయంలో పడింది. ఏఐఏడిఎంకె భవిష్యత్తు అగమ్యగోచరం. పన్నీర్‌సెల్వం, పళనిస్వామి భుజాలు కలిపినప్పటికీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి దినకరన్ సిద్ధంగా ఉన్నాడు. ఈ అయోమయ స్థితిలో ఏఐఏడిఎంకెని భాగస్వామ్యపక్షంగా చేర్చుకోవడమా, తమిళ కథ ఒక కొలిక్కి వచ్చే వరకూ వేచి చూడటమా అన్న సందిగ్థంలో బీజేపీ నాయకత్వం కొట్టుమిట్టాడుతోంది. మొత్తం మీద జేడీ(యూ), ఏఐఏడిఎంకెలకు ఇప్పటికైతే అవకాశం రాకపోవచ్చు. తుది జాబితాలో ఈ పేర్లు ఉంటాయని అంచనా: శివప్రతాప్ శుక్లా (ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు), అశ్వనీకుమార్ చౌబే (బస్తర్–చత్తీస్‌గఢ్), వీరేంద్రకుమార్ (మధ్యప్రదేశ్), అనంత్‌కుమార్ హెగ్డే (కర్ణాటక), ఆర్కె సింగ్ (బిహార్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి),హర్ప్రీత్సింగ్పూరీ (ఐఎఫ్ఎస్ అధికారి, దౌత్య ఉద్యోగి), గజేంద్రసింగ్ శెఖావత్ (రాజస్థాన్),సత్యపాల్‌సింగ్ (యూపీ) అల్ఫోన్స్ కన్ననంతకన్ (కేరళ, ఐఏఎస్). కేవలం కులాల, ప్రాంతాల లెక్కలు కాకుండా సామరŠాథ్యనికీ, ప్రతిభకూ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తున్నది. ఇది మంచి సంప్రదాయం. ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను సాధించే మంత్రిమండలి అవసరం. ఆ దశగా అడుగువేస్తున్నందుకు అభినందించాలి. కె. రామచంద్రమూర్తి -
దేవుడా... దెయ్యమా?!
త్రికాలమ్ గోప్యతను ప్రాథమిక హక్కుగానూ, రాజ్యాంగంలోని 21వ అధికరణలో అంతర్భాగంగానూ నిర్ధారిస్తూ తొమ్మిదిమంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా అద్భుతమైన తీర్పు ఇచ్చే క్రమంలో వర్త మాన రాజకీయ, సామాజిక వ్యవస్థకు వర్తించే ఒకానొక ముఖ్యమైన అంశం మెరుపులా మెరిసింది. న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ అమెరికా చరిత్ర నుంచి ఒక ఉదంతం ఉటంకించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యవస్థాపకులలో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్‌ను ఒక మహిళ వీధిలో పట్టుకొని ‘మాకు ఎటువంటి ప్రభుత్వం ఇచ్చావయ్యా?’ అని ప్రశ్నిం చిందట. దానికి ఆయన ‘ఒక గణతంత్ర ప్రభుత్వాన్ని ఇచ్చాం. మీరు నిలబెట్టు కుంటే అది ఉంటుంది (A Republic, if you can keep it),’ అని సమాధానం చెప్పారట. అమెరికా పౌరులు అనేక త్యాగాలు చేసి వారి రిపబ్లిక్‌ను కాపాడు కున్నారు. అరవై అయిదు సంవత్సరాల క్రితం రాజ్యాంగ నిర్మాతలు ఇండియాకు రిపబ్లిక్ వ్యవస్థను ప్రసాదించారు. రిపబ్లిక్‌ను మనం రక్షించుకోగలమా? అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన చారిత్రక తీర్పును ఆలకించినప్పుడు భారత రిపబ్లిక్కు «ఢోకా లేదనిపిస్తుంది. మర్నాడు పంచకూలాలో సీబీఐ కోర్టు న్యాయ మూర్తి జగదీప్‌సింగ్ సాహసోపేతంగా తీర్పు ఇచ్చిన తర్వాత హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలలో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తినష్టం గమనించినప్పుడు గణతంత్ర భారతం మనుగడపైన భయ సందేహాలు కలుగుతాయి. అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో, వివేకంతో రూపొందించి ప్రసాదించిన రాజ్యాంగ విలు వలను పరిరక్షించుకోవడం జాతి ప్రాథమిక కర్తవ్యం. అందరికీ సమన్యాయం జరగాలంటే, అర్భకులకూ, అధికారం లేనివారికీ అందరితోపాటు సమాన హక్కులు ఉండాలంటే రిపబ్లిక్ వ్యవస్థను పరిరక్షించుకోవడం అత్యవసరం. అరాచకం, అల్లకల్లోలం ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలోనూ, అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనూ పరిమితమైన ప్రభుత్వం, అపరిమితమైన పరిపాలన ( limited government, unlimited governance) సమకూర్చుతా మని హామీ ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపైన ఇంతవరకూ అవినీతి ఆరోపణలు రాకపోవడాన్ని అభినందించవచ్చు. ప్రభుత్వ యంత్రాంగం పని తీరు మెరుగైందని కానీ రాష్ట్రాలలో పరిపాలన సజావుగా సాగుతున్నదని కానీ సాధికారికంగా చెప్పడం కష్టం. ముఖ్యంగా హరియాణాలో బీజేపీ ప్రభుత్వ నిర్వాకం చూసిన తర్వాత అక్కడ పరిపాలన ఎంత లోపభూయిష్టంగా ఉన్నదో లోకానికి తెలిసిన అనంతరం రాష్ట్రాలలో పరిపాలన మెరుగైనదని బీజేపీ నేతలు సైతం ధైర్యంగా చెప్పజాలరు. డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రాంరహీమ్ సింగ్ మహిళపైన అత్యాచారం చేసినట్టు సీబీఐ కోర్టు ధ్రువీకరించిన అనంతరం జరిగిన హింసాకాండలో ఒక్క సిర్సాలోని పంచకూలాలోనే 28 మంది (ఎక్కువ మంది డేరా విధేయులే) మరణించడం హరియాణా ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనం. మొత్తం మీద 32 మంది మరణించారు. 250 మందికిపైగా గాయపడి నారు. 1984లో ఇందిరాగాంధి హత్యానంతరం ఉత్తర భారతంలో కనబడిన భయానక వాతావరణమే శుక్రవారం సాయంత్రం అగుపించింది. న్యాయ వ్యవస్థ, మీడియా, ఇంటెలిజెన్స్ వర్గాలు చేసిన స్పష్టమైన హెచ్చరికలను హరి యాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పెడచెవిన పెట్టారు. ఖట్టర్ అసమర్థత డేరా ఆశ్రమంలో 1.5 లక్షల మంది చేరడాన్ని అనుమతించారు. 144వ సెక్షన్ కింద అయిదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదంటూ నిషేధాజ్ఞలు పంచకూలాలో కూడా విధించినప్పటికీ ఆశ్రమానికి ఈ ఉత్తర్వులు వర్తించ వంటూ రాష్ట్ర విద్యామంత్రి రాంవిలాస్‌శర్మ ప్రకటించారు. శర్మ రాంరహీమ్ భక్తుడు. ఖట్టర్, ఆయన సహచరులు కూడా అంతే. ఎన్నికలు పూర్తయిన తర్వాత మొత్తం 47 మంది బీజేపీ శాసనసభ్యులలో 19 మంది డేరా బాబా దగ్గరకు వెళ్ళి కృతజ్ఞత ప్రకటించుకొని వచ్చారు. 2002 సెప్టెంబర్ 25న నాటి ప్రధాని వాజ పేయికి ఒక అజ్ఞాత మహిళ రాసిన ఉత్తరంలో గుర్మీత్ రాజకీయ నేతలకు ఎంత సన్నిహితంగా ఉన్నాడో, అతనికి అధికారమదం ఎంతగా తలకెక్కిందో వివరించింది. తనపైన అత్యాచారం చేశాడనీ, ఆ విషయం బయటికి పొక్కితే చంపి వేయగలననీ, తాను ఏమి చేసినా చట్టానికి చిక్కబోననీ, ముఖ్యమంత్రులూ, మంత్రులూ తనకు పరమ విధేయులనీ గుర్మీత్ చెప్పుకున్నట్టు ఆ మహిళ వివరించింది. తన అనుచరులలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్టు సీబీఐ కోర్టు తేల్చింది. హరియాణా కోర్టు సూమోటోగా ఈ కేసును స్వీకరించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2007లో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. సిర్సా ఆశ్రమంలో 15 మంది సాధ్వీలను విచారిస్తే ఇద్దరు తమపైన బాబా అత్యా చారం చేశాడని ఆరోపించారు. అత్యాచారం వివరాలను బయటపెట్టిన జర్న లిస్టును హత్య చే యించాడనే అభియోగం కూడా బాబాపైన ఉన్నది. ఆరు ఉత్త రాది రాష్ట్రాలలో విస్తృతంగానూ, ఇతర రాష్ట్రాలలో పలచగానూ బాబా భక్తు లున్నారు. ప్రపంచం మొత్తం మీద ఆరుకోట్ల మంది భక్తులు కానీ అభిమానులు కానీ బాబాకు ఉన్నట్టు అంచనా. అందుకే మొదట కాంగ్రెస్, తర్వాత బీజేపీ, అకాలీదళ్ బాబా అనుగ్రహం కోసం అంగలార్చాయి. గాలి ఉన్న ఎన్నికలలో బాబా ఫలితాలను ప్రభావితం చేయలేడు. ఆయన మద్దతు ఇచ్చే పార్టీకి అను కూలంగా గాలి ఉంటే దాని జోరు పెంచగలడు. ఉదాహరణకు పంజాబ్‌లో 2007లోనూ, 2012లోనూ డేరాబాబా కాంగ్రెస్‌కి మద్దతు ప్రకటించారు. 2007లో కాంగ్రెస్ గెలిచింది కానీ 2012లో ఓడిపోయింది. 2014లో దేశమం తటా బీజేపీకి అండగా నిలిచాడు. కానీ పంజాబ్‌లో కాంగ్రెస్ విజయం సాధిం చింది. హరియాణాలో బీజేపీ గెలుపొందింది. బాబాను ప్రసన్నం చేసుకుంటే ఖాయంగా గెలుస్తామన్న నమ్మకం లేకపోయినా పది ఓట్లకోసం కక్కుర్తిపడి విలు వలతో రాజీపడే రాజకీయ నాయకులు బాబా సేవ చేస్తూనే ఉన్నారు. ఇటీవల బాబాపై నిర్మించిన చిత్రం (ఎంఎస్‌జీ–2)కు హరియాణా ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించింది. వందల కోట్ల విలువ చేసే ఆస్తులున్న డేరా సచ్చా సౌదాను ఒక ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)గా రిజిస్టర్ చేశారు. 2016లో జాట్ల ఆందోళన సమయంలో ఘోరంగా విఫలమైన తర్వాత అయినా ఖట్టర్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసింది. హైకోర్టు అభిశంసన కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించినా పంజాబ్–హరియాణా హైకోర్టు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా మొట్టికాయలు వేసింది. ‘బాబాకు రాజకీయంగా లొంగి పోయింది’ అంటూ అభిశంసించింది. కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ‘ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం’ అంటే ‘హరియాణా భారతదేశంలో లేదా? ప్రధాని కేవలం బీజేపీ ప్రధాని కాదు. దేశానికి ప్రధాని’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. సిక్కు మతం ఆవిర్భవించింది ఐదువందల సంవత్సరాల క్రితమే. ఇది ఇంకా పరిణామ క్రమంలో ఉన్నది. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. తెల్ల తలపాగా ధరించే నిరంకారీలు కొంతకాలం రాజకీయాలనూ, సమాజాన్నీ ప్రభావితం చేశారు. నిరంకారీలు జరిపిన కాల్పులలో 16 మంది అనుచరులు మరణించడంతో భింద్రన్‌వాలేకు పలుకుబడి పెరిగింది. నిరంకారీ అధినేత గురుబచన్సింగ్ను భింద్రన్‌వాలే అనుచరులు హత్య చేశారు. జైల్‌సింగ్ సృష్టించిన భస్మాసురుడు భింద్రన్‌వాలే ఊహకు మించిన సంక్షోభం సృష్టించాడు. అకల్తఖ్త్పైకి సైన్యాన్ని పంపించి అతన్నీ, అతని అనుచరులనూ చంపే వరకూ పరిస్థితులు విషమించాయి. ఇందుకు ఇందిరాగాంధీ తన ప్రాణాలతో మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. భనియారా బాబా, ఫ్రీజర్ (అశుతోశ్) బాబా, అసీ రాం బాబా వగైరాలు పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో పుట్టుకు రావడానికి సామాజిక, మతపరమైన కారణాలు ఉన్నాయి. తమ బాబా మరణించడనే విశ్వాసంతో 2014లో మరణించిన అశుతోశ్‌ను ఫ్రిజరేటర్లో పెట్టి అంత్య క్రియలు జరిపించకుండా ఆయన శిష్యులు శవాన్ని ఉంచారు. బాబా భక్తుల నేపథ్యం ఏమిటి? సంక్షేమ కార్యక్రమాల అమలులో, ఆర్థిక, సాంఘిక అసమానతలను తగ్గించ డంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమౌతున్నాయి. బాధితులు తమ బాధలూ, కష్టాలూ విస్మరించేందుకు నవలోకాన్ని కలగంటున్నారు. ఏదో ఒక అద్భుతం తమ బాబా అలౌకిక శక్తుల ద్వారా జరుగుతుందనీ, తాము కోరుకుంటున్న సంపద అంతా తమ ఒడిలో పడుతుందనీ భ్రమిస్తారు. కొత్త క్రీస్తు పుట్టు కొస్తాడనీ, పునరుత్థాన సమయంలో ఆకాశం విచ్చుకొని ఫ్రిజిరేటర్లూ, ఎలక్ట్రానిక్ సామాగ్రి అన్నీ భూమిపైన పడతాయనీ మతం, మూఢభక్తి కలబోసిన ఉన్మ త్తతకు లోనైన భక్తులు భావిస్తారన్నది పీటర్ మారిస్ వార్స్లీ అనే ప్రఖ్యాత బ్రిటిష్ సామాజిక శాస్త్రవేత్త ప్రవచించిన సిద్ధాంతం. గుర్మీత్ రాంరహీమ్‌సింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని భక్తులను ఆకట్టుకు న్నాడు. బాబా చేసే సాహస కృత్యాలూ, అద్భుతాలూ అన్నీ ఆయన నిర్మించే సినిమాలలో పంచరంగులలో కనిపిస్తాయి. సైంటిఫిక్ ఫిక్షన్‌ను మించిన అభూ తకల్పనలు (ఫాంటసీ) వారి చిత్రాలలో ఉంటాయి. భారీస్థాయిలో రక్తదాన శిబిరాలను నిర్వహించి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. సెక్స్వర్కర్లకి సామూహిక వివాహాలు చేసి వారికి సమాజంలో గౌరవ స్థానం ప్రసాదించాడు. ఒక్కొక్క జంటకు రూ 1.5 లక్షలు సహాయంగా అందిస్తాడు. వితంతువుల వివాహం జరిపిస్తాడు. హిజ్రాలకు న్యాయపరమైన హోదా కల్పించాలని కోరుతూ డేరా సచ్చా సౌదా 2014లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సంస్థ సంస్కరణలు తెస్తోంది. సత్యసాయి సేవా ట్రస్టు మాదిరే ఆస్పత్రులు నిర్వ హిస్తోంది. డేరా సచ్చా సౌదా ఆశ్రమాలలో ఒకరకమైన సమాంతర ప్రభుత్వం నడుస్తున్నది. విరాళాలు వసూలు చేసి పేదవారి కోసం ఖర్చు చేస్తున్నారు. బాబా భక్తులలో అత్యధికులు ఓబీసీలూ, సిక్కు దళితులూ. సత్యసాయిబాబా, సద్గు రులూ, స్వామినారాయణ వంటి పీఠాధిపతులూ, మఠాధిపతులూ సంపన్ను లనూ, మధ్యతరగతి ప్రజలనూ ఆకర్షించారు. ఈ తరహా భక్తులకు ప్రభుత్వంలో పలుకుబడి ఉంటుంది. పరిపాలనలో భాగస్వామ్యం ఉంటుంది. డేరాబాబా భక్తులు అందరూ నిమ్నకులాలకీ, దిగువవర్గాలకీ చెందినవారు. వీరికి తమ బాబాపైన ఎటువంటి భక్తివిశ్వాసాలు ఉంటాయంటే వారు పోలీసులనీ, చట్టాలనీ లెక్కచేయరు. బాబా ఆదేశిస్తే ఏదైనా చేస్తారు. వారికి ఆశ్రమమే సర్వస్వం. బాబానే కొత్త దేవుడు. ఈ దేవుడికి మానవులకు ఉండే బలహీనతలు ఉంటాయంటే వారు నమ్మరు. అందుకే అత్యాచారం కేసులో సీబీఐ కోర్టు తీర్పును ఆమోదించరు. ఈ ఉదంతంలో హరియాణా ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తించి తగిన చర్య తీసుకోవడంతో పాటు రాష్ట్రంలో పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో ప్రధాని గుర్తించాలి. మొన్న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సుపరిపాలన గురించి చేసిన ప్రస్తావనను మనసుకు పట్టించుకొని పేద, బడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగ నిర్మాతలు ఆశిం చిన శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజాబాహుళ్యంలో వ్యాప్తి చేయడానికి ప్రభుత్వం అహరహం శ్రమించాలి. మూఢ నమ్మకాలనూ, మూఢాచారాలనూ ప్రజల జీవితాల నుంచి పారదోలడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. -కె. రామచంద్రమూర్తి -
విలువలే గెలవాలి!
త్రికాలమ్ నంద్యాల శాసనసభ స్థానం కోసం జరుగుతున్న హోరాహోరీ పోరాటంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే నైతిక విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్న శిల్పా చక్రపాణిరెడ్డికి జగన్మోహన్రెడ్డి అనూహ్యమైన పరీక్ష పెట్టారు. తెలుగుదేశం పార్టీ టికెట్టు పైన గెలుచుకున్న శాసనమండలి స్థానానికి రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి ఆహ్వానిస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి మాదిరి నీతిలేని రాజకీయం చేయలేనని స్పష్టం చేశారు. చేతిలో ఉన్న మండలి స్థానం వదులుకోవడానికి ధైర్యం కావాలి. బాగా ఆలోచించుకున్న తర్వాత మండలి స్థానానికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరడానికే చక్రపాణిరెడ్డి నిర్ణయించుకున్నారు. గురువారంనాడు నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో తన రాజీనామా లేఖను జగన్మోహన్రెడ్డికి సమర్పించారు చక్రపాణిరెడ్డి. స్పీకర్ ఫార్మాట్లో శాసనమండలి అధ్యక్షుడిని ఉద్దేశించి రాసిన రాజీనామా లేఖను అనంతరం మండలి అధ్యక్షుడి కార్యాలయానికి పంపించారు. అరుణాచలప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ దేశ వ్యాపితంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం భ్రష్టుపడుతున్న తీరు చూసినవారికి వైఎస్ఆర్సీపీ పాటించిన నైతికత ఆనందం కలిగించి తీరుతుంది. ఈ పార్టీ స్థాపించినప్పటి నుంచీ చట్టసభలలో సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకోవాలనే నియమాన్ని పట్టింపుతో అమలు చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన శాసనసభ్యులంతా రాజీనామాలు చేసి ఉపఎన్నికలలో గెలిచారు. ఢిల్లీలో, అమరావతిలో, హైదరాబాద్‌లో అధికారంలో ఉన్న పార్టీలు పాటించని నైతిక విలువలనూ, ప్రదర్శించని రాజ్యాంగ నిబద్ధతనూ యువనాయకుడు జగన్మోహన్రెడ్డి పాటించినందుకు అభినందించి తీరాలి. నంద్యాల రణక్షేత్రంలో చక్రపాణిరెడ్డి బాసట చాలా ముఖ్యమైనది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి విజయం సాధించాలంటే అతని సోదరుడు చక్రపాణిరెడ్డి సహకారం ప్రధానం. నంద్యాల విజయం వైఎస్ఆర్సీపీకీ, జగన్మోహన్రెడ్డికీ చాలా అవసరం. చావోరేవో తేల్చుకోవలసిన సందర్భం. శాసనమండలి స్థానం వదులుకోవడానికి చక్రపాణిరెడ్డి అంగీకరించకపోతే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం లేదు. నంద్యాలలో విజయావకాశాలు ఆ మేరకు దెబ్బతినేవి. ఇది తెలిసి కూడా సీటు వదులుకోవాలని జగన్మోహన్రెడ్డి షరతు విధించడం విశేషం. ఒక విధంగా నంద్యాల ఉప ఎన్నికలో విజయం కన్నా నైతికత, రాజ్యాంగ స్ఫూర్తి పాటించడమే తనకు ముఖ్యమని జగన్ చాటి చెప్పినట్టు అయింది. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులలో ఈ అంశం చర్చనీయాంశం కాకపోవచ్చు. పత్రికలూ, వార్తా చానళ్ళూ ప్రాముఖ్యం ఇవ్వకపోవచ్చు. జాతీయ స్థాయిలో చానళ్ళ, పత్రికల దృష్టి వేరే అంశాలపైన ఉండవచ్చు. స్థానిక మీడియా సంగతి సరేసరి. తగినంత ప్రచారం లభించకపోయినప్పటికీ ఇది అన్ని రాజ కీయ పార్టీలూ గమనించవలసిన పరిణామం. విలువలు పాటించే విషయంలో అధికార పార్టీకీ, ప్రతిపక్షానికీ ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తారో లేదో మరి. ఇది కారుమబ్బుల్లో తళుక్కున కనిపించిన కాంతిరేఖ. గెలుపే ప్రధానం చంద్రబాబు ఎన్నికల వ్యూహ రచనలో దిట్ట. మూడు దశాబ్దాలకు పైగా అనేక ఎన్నికలలో పోరాడిన అనుభవం ఆయనది. ముఖ్యమంత్రికి గెలుపే ప్రధానం. ఏ విధంగా గెలిచామన్నది అప్రధానం. లక్ష్యం ముఖ్యం. మార్గం కాదు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా విజయం సాధిం చేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. నైతిక విలువలతో పనిలేదు. రాజకీయ విలువలకు పాతర వేసినా పర్వాలేదు. గెలవాలి. తిమ్మిని బమ్మిని చేసైనా సరే, ఆరు నూరైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే విజయం సాధించి తీరాలి. ఉపఎన్నికలో ఒక సీటు గెలిచినా ఓడినా ప్రభుత్వ సుస్థిరతకు భంగం లేదు. చట్టసభలలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఉపఎన్నిక జరుగుతున్న ఒక్క స్థానం గెలుచుకోవడంపైనే తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్టు సర్వశక్తులూ వొడ్డి పోరాడటం చంద్రబాబు స్వభావం. ప్రత్యర్థులతో పోల్చుకొని ప్రతిరోజూ బేరీజు వేసుకోవడం, ప్రతి పోటీలో తనదే పైచేయి కావాలనుకోవడం, విజయం కోసం అన్ని రకాల నియమాలనూ ఉల్లంఘించి, అడ్డదారులు తొక్కడం ఆయనకు అలవాటు. ఇప్పుడు నంద్యాలలోనూ అదే చూస్తున్నాం. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత చంద్రబాబు ప్రణాళికలో నంద్యాల అత్యధిక ప్రాముఖ్యం సంతరించుకున్నది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి సమర్థుడూ, స్థానికంగా విశేషమైన ప్రాబల్యం కలిగిన వ్యక్తీ కావడంతో చంద్రబాబు పని మరింత కష్టభూయిష్టౖమైపోయింది. భూమా నాగిరెడ్డి భార్య శోభ 2014 ఎన్నికల ప్రచారంలో కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన కారణంగా సానుభూతి పవనాలు వీచినప్పటికీ టీడీపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి కంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగిరెడ్డి (శోభ భర్త)కి స్వల్ప మెజారిటీ (3,604 ఓట్లు) లభించింది. నాగిరెడ్డికి 82,194 (46.97 శాతం) ఓట్లు రాగా, మోహన్‌రెడ్డికి 78,590 ( 44.91శాతం) ఓట్లు వచ్చాయి. ఎన్నికలైన తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందిన శాసనసభ్యులను తెలుగుదేశంలోకి చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం చేశారు. ప్రతిపక్ష సభ్యులను వేధించారు. బెదిరించారు. ప్రలోభపెట్టారు. వారి బలహీనతలు తెలుసుకొని వారితో ఆడుకున్నారు. నాగిరెడ్డిపైన పోలీసులను ప్రయోగించారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టించారు. రౌడీషీట్ తెరిపించారు. పద్నాలుగు రోజులు జైల్లో పెట్టించారు. చతుర్విధ ఉపాయాలు ప్రయోగించి ఆయన చేత తప్పు చేయించారు. పార్టీ ఫిరాయించే వరకూ ఆయనను వేధిస్తూనే ఉన్నారు. ఒక వైపు పోలీసు కేసులతో వేధించడం, మరో వైపు మంత్రి పదవి చూపించి ఊరించడం. ఆ విధంగా నాగిరెడ్డి సహా 21 మంది వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుల చేత పార్టీ ఫిరాయింపజేశారు. వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా శాసనసభ స్థానానికి రాజీనామా చేయలేదు. నాగిరెడ్డి వ్రతం చెడినా ఫలం దక్కలేదు. మంత్రి పదవి అందని ద్రాక్షే అయింది. మానసికంగా కుంగిపోయారు. మండలి ఎన్నికలలో తన అభీష్ఠానికి భిన్నంగా పని చేయాలని నాగిరెడ్డిపైన ఒత్తిడి పెరిగింది. చంద్రబాబు అమరావతికి పిలిపించుకొని నాగిరెడ్డిని మందలించారు. అపరాధభావంతో, అవమానభారంతో భూమా గుండెపోటు వచ్చి మరణించారు. ఆ క్షణం నుంచీ నంద్యాల స్థానం ఎట్లా నిలబెట్టుకోవాలో చంద్రబాబు ఆలోచిస్తున్నారు. నువ్వా–నేనా? భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రివర్గంలోకి నలుగురు ఫిరాయింపుదారులను చంద్రబాబు తీసుకున్నారు. భూమా కుమార్తె అఖిలప్రియ వారిలో ఒకరు. నంద్యాల స్థానం తమ కుటుంబానికే చెందాలని అఖిలప్రియ కోరుకోవడం సహజం. ఆ స్థానం గెలుచుకునేందుకు టీడీపీ టికెట్టు తనకే దక్కాలని 2014లో స్వల్ప తేడాతో ఎన్నికలలో ఓడిపోయిన శిల్పామోహన్‌రెడ్డి ఆశించడం ధర్మం. ఎవరినీ వదులుకోలేని డోలాయమాన స్థితిలో చంద్రబాబుని చూసిన శిల్పా మోహన్‌రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా వైఎస్ఆర్సీపీకీ బలమైన అభ్యర్థి లభించారు. పెరుగుతున్న జగన్మోహన్రెడ్డి ప్రాబల్యంతో మోహన్‌రెడ్డి సొంత బలం తోడైతే విజయం సాధ్యం. ఎట్లాగైనా నంద్యాల స్థానం నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో చంద్రబాబు తనకు తెలిసిన విద్య ప్రదర్శించడం ప్రారంభించారు. మూడేళ్ళలో నంద్యాల ప్రజలకు కనిపిం చని చంద్రబాబు తరచూ తమ మధ్యకు రావడం, అడగని వరాలు గుప్పించడం, అన్ని వర్గాల ప్రజలతో చనువు ప్రదర్శించడం ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. నంద్యాలలో వైశ్యులు గణనీయంగా ఉన్నారు కనుక వారికి అవసరమైన భవనం కట్టిస్తానని వాగ్దానం చేశారు. అడిగినవారికీ, అడగనివారికీ రకరకాల పథకాలు మంజూరు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే అన్ని వర్గాలకీ అన్ని రకాల వాగ్దానాలు చేశారు. నంద్యాల పట్టణంలో ముస్లింలు 70 వేల పైచిలుకు ఉంటారు. వారిని ప్రసన్నం చేసుకోవాలంటూ మాజీ మంత్రి ఫారుఖ్‌ని పట్టుకోవాలి. 2014 ఎన్నికల సమయంలో నంద్యాల టిక్కెట్టు ఆశించిన ఫారుఖ్‌కి చంద్రబాబు ఇంటర్వ్యూ దొరకటం కష్టమైంది. అప్పటి నుంచి ముఖ్యమంత్రికీ, పార్టీకీ దూరంగా ఉంటున్న మాజీ మంత్రిని పిలిపించుకొని ఆయనకు శాసనమండలి సభ్యత్వమే కాకుండా శాసనమండలి అధ్యక్ష పదవి కూడా ఇస్తానంటూ వాగ్దానం చేసి ఆయనను రంగంలో దింపారు. చక్రపాణి పదవీ విరమణ అనంతరం మండలి అధ్యక్ష స్థానం ఖాళీగా ఉంది. ఇదే అధ్యక్ష పదవి చక్రపాణిరెడ్డికి చంద్రబాబు ఇవ్వజూపారు. అది మోహన్‌రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరక మందు ముచ్చట. చక్రపాణిరెడ్డి టీడీపీలో కొనసాగినప్పటికీ అన్నకి వ్యతిరేకంగా ఎంత శక్తిమంతంగా పని చేయగలరనే విషయంపై తెలుగుదేశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పైగా, నంద్యాలలో గెలవాలంటే చక్రపాణిరెడ్డి మద్దతు కంటే ఫారుఖ్ మద్దతు అవసరమని భావించిన చంద్రబాబు ఫారుఖ్‌ని మండలి అధ్యక్ష పదవి చూపించి సుముఖం చేసుకున్నారు. చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారన్న విశ్వాసం లేకపోయినప్పటికీ ఫారుఖ్ యాంత్రికంగా తెలుగుదేశం అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి తరఫున ముస్లిం సమాజంలో ప్రచారం చేస్తున్నారు. ముస్లింలలో వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల ఆరాధనాభావం ఉన్నది. నాలుగు శాతం రిజర్వేషన్లు ఇప్పించింది వైఎస్ఆర్ అనే విషయం ముస్లింలు తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. చంద్రబాబు చేస్తున్న హడావుడి చూసి నంద్యాల ప్రజలు నివ్వెరపోతున్నారు. ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంది. అది ఎంతమేరకు ఉన్నదనే విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. సాధారణ పరిస్థితులలో, 174 స్థానాలతో కలిపి నంద్యాల స్థానానికి కూడా ఎన్నిక జరిగి ఉంటే వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం. ఫిరాయించిన ఇతర ఇరవై మంది ఎంఎల్ఏలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు జరిగి, వాటితో పాటుగా నంద్యాల ఉప ఎన్నిక కూడా జరిగి ఉన్నట్లయితే వైఎస్ఆర్సీపీకి విజయావకాశాలు స్పష్టంగానే ఉండేవి. కానీ ఒక్క నంద్యాలలోనే ఎన్నికలు జరగడం, ప్రభుత్వ యంత్రాంగాన్నీ, టీడీపీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయితో చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో దింపడంతో పోటీ నువ్వా–నేనా అన్నట్టు సాగుతోంది. ఏ రోజు చూసినా నంద్యాలలో అరడజను మందికి తక్కువ కాకుండా మంత్రులు మకాం వేసి ఉంటున్నారు. శాసనసభ్యులు సరేసరి. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి టీడీపీ ఏర్పాట్లు చేసుకున్నది. వైఎస్ఆర్సీపీ చేతిలో అధికారం లేదు. నిధులు లేవు. అయినప్పటికీ చక్రపాణిరెడ్డి చేరికతో వైఎస్ఆర్సీపీ పట్ల సానుకూలత పెరిగింది. తొమ్మిదో తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ నంద్యాలలోనే ఉంటానంటూ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు ఎలక్షన్ వాచ్ ఆధ్వర్యంలో నంద్యాలలో పర్యటించబోతున్నారు. ఒక సార్వత్రిక ఎన్నికకు ఉండే ప్రాముఖ్యం నంద్యాల ఉప ఎన్నిక సంతరించుకోవడం విశేషం. నంద్యాల ఎన్నిక రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ విజయానికి నాంది పలుకుతుందేమో చూడాలి. ఫలితం ఏ విధంగా ఉన్నప్పటికీ ఇది చారిత్రక ఉపఎన్నిక కాబోతున్నది. రాజకీయ విలువలకూ, నైతికతకూ ప్రజలు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఈ ఎన్నికలో నిర్ధారణ అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
‘ఏకీకృత’ సమాఖ్య దిశగా...
త్రికాలమ్ పార్లమెంటులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి జేగంట మోగించి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమలుకు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి చరిత్ర పుటలలో పీవీ నరసింహారావు శాశ్వత స్థానం సంపాదిం చుకున్న విధంగానే మోదీ విజయం సైతం చరిత్రాత్మకం. ఈ సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి పార్లమెంటు సెంట్రల్హాల్లో ప్రత్యేక సమావేశంలో మోదీ చేసిన ప్రసంగంలో సంయమనం ప్రదర్శించారు. జీఎస్టీ స్వప్నం సాకారం కావడంలో ఇతర ప్రధానుల, ఆర్థిక మంత్రుల, ముఖ్యమంత్రుల సహకారం ఉందంటూ వారికి అభివాదాలు చెప్పారు. శనివారం సాయంత్రం చార్డర్డ్ అకౌంటెంట్ల (సీఏ) సభలో ప్రసంగించిన ప్పుడు మాత్రం మోదీ యథావిధిగా విశ్వరూపం ప్రదర్శించారు. ప్రచారార్భ టిలో మోదీని మించిన ప్రధాని లేరు. ప్రతి కార్యక్రమాన్నీ ఘనవిజయంగా అభివర్ణించడం, ప్రతి విజయాన్నీ మరో విజయానికి సోపానంగా పరిగణించడం ఆయన ప్రత్యేకత. తాను తీసుకున్న నిర్ణయాన్ని బలంగా సమర్థించడం, తన సంకల్పాన్ని హృదయాలకు హత్తుకునే విధంగా వివరించి మెప్పించడం, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం మోదీ వ్యక్తిత్వంలోని విశేషాలు. సీఏల సభలో మోదీ జీఎస్టీ వల్ల కలిగే సత్ఫలితాలను వల్లించడమే కాకుండా పెద్ద నోట్ల రద్దును గొప్ప సాహసోపేతమైన చర్యగా, నల్లధనంపైన సర్జికల్ స్ట్రయిక్ గా అభివర్ణించారు. పెద్దనోట్ల నిర్ణయం ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ, జీఎస్టీ అమలు ఎట్లా ఉండబోతున్నప్పటికీ ఈ రెండు విధానాలనూ ఎవ్వరూ ప్రశ్నించలేని విధంగా ప్రజలకు చెప్పి ఒప్పించే ప్రతిభ ప్రధాని సొంతం. జీఎస్టీ గురించి ప్రధాని ఏమి చెప్పారు? ఇది నల్లధనాన్ని రూపుమాపు తుంది. కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఆర్థిక పురోగతిని కొత్త పుంతలు తొక్కిస్తుంది. పన్ను ఉగ్రవాదాన్ని అంతం చేస్తుంది. పన్ను ఎగవేతదారుల భరతం పడుతుంది. పన్నుల వ్యవస్థను సరళీకృతం చేస్తుంది. ఏకీకృతం చేస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తుంది. ఉపయోగాలు చెబుతూ హెచ్చరికలు కూడా చేశారు. మూడు లక్షల సంస్థల జాతకాలను ప్రభుత్వ శాఖలు పరిశీలిస్తున్నాయని చెప్పారు. అన్నీ సంభవమే జీఎస్టీ సక్రమంగా అమలైతే ప్రధాని చెప్పినవన్నీ సగటు ప్రజలకు అనుభవంలోకి వస్తాయి. అమలులో సమస్యలు ఖాయంగా ఉంటాయని ప్రవీణులు చెబుతు న్నారు. ఇప్పుడు అమలు జరుగుతున్న జీఎస్టీ ముందుగా అనుకున్న జీఎస్టీ కంటే బలహీనమైనదనీ, కనుక స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఒకటి లేదా ఒక టిన్నర శాతం పెరుగుతుందంటూ పాలకపక్షం చేస్తున్న వాదనలో పసలేదనీ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేవ్రాయ్ స్పష్టం చేస్తున్నారు. ఆయన మోదీ ప్రభుత్వాన్ని బలపరిచే మేధావి. ఈ విషయంలో మాత్రం తీవ్రంగా విభేది స్తున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా జీఎస్టీని అమలు చేయడం అవసరం. అమలు ప్రారంభించిన అనంతరమే దానిలోని లాభనష్టాలూ, సాధకబాధకాలూ, లోటు పాట్లూ తెలిసివస్తాయి. సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించుకోవచ్చు, విధా నంలో సర్దుబాట్లు చేసుకోవచ్చు. జీఎస్టీలో మార్పులు చేయడానికి రాజ్యాంగ సవరణ అక్కరలేదు. జీఎస్టీ మండలికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఈ మండలిలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఉంటారు. జీఎస్టీని రూపొందించే క్రమంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం సంభవించింది. రాజకీయంగా ఎంత కీచులాడుకున్నప్పటికీ ఆర్థికంగా దాదాపు అన్ని రాష్ట్రాల మధ్యా ఏకాభిప్రాయం కుదిరింది. ఆర్థిక సంస్కరణల విషయంలో యూపీఏకీ, ఎన్డీయేకీ పెద్దగా అభిప్రాయభేదాలు లేవనేది స్పష్టమే. కానీ 2000లో వ్యాట్‌కు సంబంధించి సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు ఒక కొలిక్కి రాక పోవడానికి ప్రధాన కారణం రాష్ట్రాలు తమ ఆదాయాలను తగ్గించుకోవడానికి ఇష్టపడకపోవడమే. పన్నులు విధించేందుకు తమకున్న అధికారాన్ని వదులు కోలేకపోవడం. పన్ను విధానంలో రాష్ట్రాల మధ్య విభేదాలూ, ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడటం. ఈ వాతావరణానికి పూర్తి భిన్నంగా జీఎస్టీ ప్రయాణం సామరస్యంగా సాగింది. దాదాపు అన్ని పక్షాలూ జీఎస్టీ ఆవశ్యకతను గుర్తించాయి. 2000లో నాటి ఎన్డీయే సారథి వాజపేయి చొరవతో ముగ్గురు ఆర్థిక వేత్తల–సి రంగరాజన్, ఐజి పటేల్, బిమల్ జలాన్–తో ఒక ఆర్థిక సలహా సంఘాన్ని నియమించడంతో జీఎస్టీకి నాందీప్రస్తావన జరిగింది. ఏకీకృత పన్ను విధానం సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మార్క్సిస్టు పార్టీ నాయకుడు, పశ్చిమబెంగాల్ వామపక్ష సంఘటన ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి అశిమ్దాస్ గుప్తా నాయకత్వంలో ఒక కమిటీని నియమించారు. 2003లో నియమించిన విజయ్ కేల్కర్ కమిటీ జీఎస్టీని రూపొందించాలని సిఫార్సు చేసింది. కమిటీ అధ్యక్ష పదవికి అశిమ్దాస్గుప్తా తర్వాత కేరళ ఆర్థికమంత్రి కెఎం మణి నియుక్తులైనారు. అనంతరం కాలంలో బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు స్వీకరించారు. లక్ష్యశుద్ధి ప్రశంసనీయం విభిన్న దృక్పథాలు ఉన్న వేర్వేరు పక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ జీఎస్టీ కమిటీ పని సజావుగా సాగడం, లక్ష్యశుద్ధితో కమిటీ వ్యవహరించడం చెప్పుకోదగిన అంశం. పదవిలో ఉన్నప్పుడు బలపరి చిన విధానాన్ని పదవిలో లేనప్పుడు వ్యతిరేకించడం రాజకీయ పక్షాలకు అలవా టైన కపట రాజకీయ వ్యవస్థలో ఇంతటి సామరస్యం వెల్లివిరియడం శుభపరిణామం. యూపీఏ, ఎన్డీయేల ఆర్థిక సంస్కరణలను వ్యతిరేకించే వామపక్షాలు సైతం జీఎస్టీ విషయంలో కలసిరావడం మంచి మలుపు. ఇది ఇప్పుడిప్పుడే అబ్బుతున్న సుగుణం. 2011లో మన్మోహన్సింగ్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ సద్భావం లేదు. బీజేపీ అడ్డుపడింది. వామపక్షాలూ వ్యతిరేకించాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ససేమిరా అన్నారు. 2013లో యూపీఏ చేసిన ప్రయత్నానికి కూడా మోదీ గండి కొట్టారు. అందుకే జీఎస్టీని సొంతం చేసుకొని, అంతా తన నిర్వాకమే అన్నట్టు మోదీ ప్రచారం చేసుకోవడంతో కినిసిన కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక సాకు చూపించి అర్ధరాత్రి సభకు గైర్హాజరైంది. పండిట్ నెహ్రూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ప్పడు చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని తలపిస్తూ అదే స్థాయిలో జీఎస్టీ ప్రారంభ సంరంభం చేయడాన్ని కాంగ్రెస్ పెద్దలు ఆమోదించలేకపోయారు. ఇందులో మోదీ ప్రచారయావ ఉండవచ్చును కానీ కాంగ్రెస్ వైఖరి సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతోంది. అధికార పార్టీలూ, కూటములూ వస్తూపోతూ ఉంటాయి. ప్రభుత్వం కొనసాగుతుంది. విధానాల రూపకల్పన కూడా అంతే. ఉదాహరణకు 1998 మేలో వాజపేయి పాలనలో పోఖ్రాన్లో అణుబాంబు విస్ఫోటనం నిర్వహించాం. ఈ బాంబులు పీవీ హయాంలోనే అబ్దుల్ కలాం పర్యవేక్షణలో తయారైనాయి. క్లింటన్ ఒత్తిడి కారణంగా పీవీ ప్రభుత్వం అణు పరీక్ష నిర్వహించలేకపోయింది. వాజపేయి ప్రధానిగా ప్రమాణం స్వీకరించిన తర్వాత ఆయనను పీవీ కలుసుకొని ‘సామగ్రి అంతా సిద్ధంగా ఉంది. పరీక్ష నిర్వహించడమే తరువాయి’ అని చెప్పారు. అణుపరీక్ష నిర్వహించిన ఖ్యాతి వాజపేయికే వచ్చింది. అదే విధంగా వ్యాట్ రూపకల్పనలో నూటికి తొంభైశాతం పని చేసింది వాజపేయి ప్రభుత్వంలోని ఆర్థికమంత్రి యశ్వంత్‌సిన్హా. కానీ దాన్ని ప్రవేశపెట్టిన ఖ్యాతి మన్మోహన్‌సింగ్‌కు వచ్చింది. అదే విధంగా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఎఫ్ఆర్బిఎం యాక్ట్) రూప కల్పన కృషి అంతా యశ్వంత్సిన్హాదే. ఖ్యాతి యూపీఏ ఆర్థికమంత్రికి దక్కింది. జీఎస్టీ నిర్మాణానికి 17 సంవత్సరాలు పడితే అందులో పది సంవత్సరాలు యూపీఏ అధికారంలో ఉంది. మూడేళ్ళు మోదీవీ, నాలుగేమో వాజపేయివీ. ఈ లోగా రాష్ట్రాలలో అనేక రాజకీయ పక్షాలు అధికారంలోకి వచ్చాయి. ప్రతి పక్షంలోకి పోయాయి. అయినప్పటికీ జీఎస్టీ పని ఆగలేదు. 2015లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ జీఎస్టీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం సాధించారు. 2016లో రాజ్యసభ ఎన్డీయే కూటమికి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ ప్రతి పక్షాలు ప్రతిపాదించిన సవరణలలో కొన్నిటికి సమ్మతించి బిల్లుపైన ఆమోదముద్ర వేయించుకోలిగారు. సమాఖ్య స్ఫూర్తికి కొత్త నిర్వచనం జీఎస్టీ ఆరంభ సభలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ప్రధాని మోదీ చెప్పినట్టు జీఎస్టీ మండలి సమావేశం 18 సార్లు జరిగినప్పటికీ ఒక్క సమావేశంలో కూడా ఏ అంశంపైనా ఓటింగ్ జరగవలసిన పరిస్థితి రాలేదు. సమాఖ్యస్ఫూర్తిని వదులుకోవడానికీ, ఆర్థిక స్వేచ్ఛ విషయంలో కొంచెం రాజీపడటానికీ రాష్ట్రాలు సమ్మతించాయి. ఒక రకంగా సమాఖ్యస్ఫూర్తికి కొత్త నిర్వచనం చెప్పుకున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వీయనిర్ణయాధికారాలపైన పట్టింపు అధికం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తన పన్ను విధానం నిర్ణయించుకుంటుంది. ఆ దేశంలో వ్యాపారం చేయడం సులువు. పన్నులు సరళంగా ఉంటాయి. జీఎస్టీ లేదు. రాష్ట్రాలు ఒప్పుకోవు. ఇండియాలో జీఎస్టీ అమలులో మొదట కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ భవిష్యత్తులో పన్ను రాబడి ద్వారా తమ ఆదాయం పెరుగుతుందనే విషయంలో రాష్ట్రాలకు పూర్తి విశ్వాసం ఉంది. పరోక్ష పన్నులు విధించే ఆస్కారం లేనప్పుడు ఆర్థిక మంత్రుల బడ్జెట్ ప్రసంగాలు జమాఖర్చుల చిట్టాలుగా మారిపోతాయి. రహస్యం అంటూ ఉండదు. అంతా బహిరంగమే. జీఎస్టీ విధానంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగినకొద్దీ పన్నుల స్థాయిని తగ్గించాలని సంకల్పం. ఆచరణలో అది జరుగుతుందో, లేదో చూడవలసిందే. పెరిగిన ఆదాయాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధపడతాయా? కేంద్రం, రాష్ట్రాలు అత్యాశ వదులుకొని ఉంటే పన్నుల స్థాయి ఇంకాస్త తగ్గి ఉండేది. తాత్కాలికంగానైనా ఆదాయం తగ్గించుకోవడానికి ఏ ప్రభుత్వమూ సిద్ధంగా లేదు. దేశభక్తి కారణంగానే ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నామంటూ ప్రధాని చెప్పారు. ఇందులో సాహసం పాలు తక్కువ. నిజంగా సాహసకార్యం చేయాలంటే పన్నుల స్థాయిని 18శాతం మించకుండా చేయవలసింది. దానివల్ల ప్రారంభంలో కొంత ఆదాయం తగ్గినప్పటికీ రానురాను పెరుగుతుంది. జీఎస్టీని చూసి భయపడకుండా స్వాగతించడానికి అవసరమైన ప్రోత్సాహం ప్రజలకు లభించేది. యూరప్ దేశాలలో సగటున 19 శాతానికి మించకుండా పన్నులు ఉన్నాయి. తూర్పు ఆసియా దేశాలలో ఇది 12 శాతమే. సింగపూర్‌లో అయితే అన్ని వస్తువులకూ, సేవలకూ ఒకే పన్ను శాతం. అది చిన్న దేశమైన సింగపూర్‌లో సాధ్యం కానీ, విస్తారమైన, వైవిధ్యభరితమైన భారతదేశంలో సాధ్యం కాదు. నిత్యావసర వస్తువులను పన్నుల వ్యవస్థ నుంచి మినహాయించవలసి ఉంటుంది. కొన్ని వస్తువులపైన 5 శాతం కంటే ఎక్కువ పన్ను వేయకూడదు. కొన్ని వస్తువులకూ, సర్వీసులకూ 12 శాతం లేదా 18 శాతం పన్ను ఫర్వాలేదు. కానీ 28 శాతం, 40 శాతం పన్ను విధించడం మంచిది కాదని మోదీ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం సైతం స్పష్టం చేశారు. కానీ కేంద్రం, రాష్ట్రాలూ సృజనాత్మకంగా ఆలోచించి ధైర్యం చేయవలసిందిపోయి పన్ను స్థాయి యథాతథంగా కొనసాగాలని పట్టుపట్టడం వల్ల ఇన్ని దొంతరల పన్ను విధానం అమలులోకి వచ్చింది. ఆచరణలో జీఎస్టీని మరింత సులభతరం, సరళతరం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతదూరం వచ్చిన తర్వాత జీఎస్టీని వ్యతిరేకించడం అవివేకం. జీఎస్టీని అనుభవం ప్రాతిపదికగా ఉత్తరోత్తరా ఎట్లా సంస్కరించుకోవాలో ఆలోచించాలి. కె. రామచంద్రమూర్తి -
పాత బంధం పనిచేస్తుందా!
త్రికాలమ్ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య రేపు జరగబోయే సంభాషణ రెండు దేశాల ప్రజల భవిష్యత్తునూ, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని ప్రజల జీవితాలనూ, వివిధ దేశాల మధ్య సంబంధాలనూ ప్రభావితం చేయబోతోంది. ట్రంప్ శ్వేత భవనంలో అడుగిడిన అనంతరం మోదీ వాషింగ్టన్ సందర్శించడం ఇదే ప్రథమం. మూడేళ్ళలో మూడు విడతలు అమెరికా సందర్శించిన ప్రధాని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ‘బరాక్, నేనూ మిత్రులం’అంటూ ఆత్మవిశ్వాసంతో మోదీ ప్రకటించే స్థాయికి వారి మధ్య అనుబంధం పెరిగింది . ట్రంప్ అనూహ్యంగా అధ్యక్ష పదవికి ఎన్నికైన వ్యక్తి. మోదీ ఫక్తు రాజకీయవాది. ట్రంప్ వ్యాపార ప్రపంచం నుంచి రెండేళ్ళ క్రితమే రాజకీయరంగంలో అడుగుపెట్టి వివాదాలలో వర్థిల్లుతున్న ఘనుడు. ఆర్థిక, విదేశాంగ విధానాల కొనసాగింపే ఆర్థిక విధానం వలెనే విదేశాంగ విధానం సైతం కొనసాగింపే. 1991లో పీవీ నరసింహారావు–మన్మోహన్సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను వాజపేయి కొనసాగించారు. మన్మోహన్ ప్రధానిగా ఆ విధానాలనే మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు. అదే బాటలో మోదీ కొనసాగుతున్నారు. దివాళా చట్టం, జీఎస్టీ వంటివి యూపీఏ హయాంలో మొదలై ఎన్డీఏ–2 పాలనలో ఒక కొలిక్కి వచ్చినవే. విదేశాంగ విధానం సైతం యూపీఏ–2 నుంచి కొనసాగింపే. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదటి నుంచీ సోవియట్ యూనియన్ వైపే మొగ్గు చూపించారు. 1956లో హంగరీని సోవియట్ యూనియన్ ఆక్రమించిన సందర్భంగా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు గట్టిగా వ్యతిరేకిస్తే ఇండియా మౌనం వహిం చింది. అమెరికా పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేసింది. కశ్మీర్ వివాదంలో పాకిస్తాన్‌ను బలపరిచింది. కొరియా విషయంలో అమెరికాను భారత్ సమర్థించకుండా తటస్థంగా ఉండేది. చైనాను అమెరికా వ్యతిరేకిస్తే మన దేశం చైనాను వెనకేసుకొచ్చేది. భద్రతామండలిలో చైనాకు స్థానం కల్పించాలని పట్టుబట్టిన దేశాలలో భారత్ ముఖ్యమైనది. నెహ్రూ అంతేవాసి కృష్ణమీనన్ అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో, ఇతర వేదికలపైనా అనర్గళంగా ప్రసంగించేవారు. నెహ్రూ, కెన్నడీల మధ్య పరస్పర విశ్వాసం కుదరలేదు. నెహ్రూ అలీనవిధానం అమెరికాకు మింగుడు పడలేదు. నిరుపేద దేశానికి సొంత అభిప్రాయాలూ, స్వతంత్ర విదేశాంగ విధానం ఉండటం అమెరికాకు కానీ ఇతర పాశ్చాత్య దేశాలకు కానీ నచ్చలేదు. చైనా దురాక్రమణ సందర్భంగా నెహ్రూ ఆశించిన సహాయం అమెరికా నుంచి అందలేదు. ఇదే అమిత్ర వైఖరి ఇందిర హయాంలోనూ కొనసాగింది. వియత్నాంలో అమెరికా జోక్యాన్ని మన దేశం గట్టిగా వ్యతిరేకించింది. తూర్పు పాకిస్తాన్ సంక్షోభం వివరించేందుకు ఇందిర వాషింగ్టన్ వెళ్ళినప్పుడు నిక్సన్, కిసింజర్‌లు పొడిపొడిగానే మాట్లాడారు. కించిత్ అవమానకరంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన కిసింజర్ని ఇందిరాగాంధీ తన సౌత్‌బ్లాక్ ఆఫీసులో ఇంటర్వ్యూ ఇవ్వకుండా చాలాసేపు కూర్చోబెట్టి ఉడుక్కునేటట్టు చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. సోవియట్ యూనియన్‌తో 20 ఏళ్ళ స్నేహ ఒడంబడికను కుదుర్చుకోవడంతో మన దేశం సోవియట్ పరిష్వంగంలోకి పూర్తిగా వెళ్ళినట్టయింది. వియత్నాంలో యుద్ధం కారణంగా అమెరికా పాకిస్తాన్‌కు ఆయుధాల సరఫరా నిలిపివేసింది. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం సమయంలో అణ్వస్త్ర సహితమైన అణుశక్తిసహిత విమాన వాహక సప్తమ నౌకాదళాన్ని అమెరికా బంగాళాఖాతంలోకి పంపించి ఇండియాపైన మోహరించింది. ఇందిరాగాంధీ అద్భుతమైన యుద్ధవ్యూహం అమలు చేసి చారిత్రక విజయం సాధించారు. నిక్సన్‌ను ఖంగు తిని పించారు. 1974లో పోఖ్రాన్లో అణు విస్ఫోటనం అమెరికాకు మరింత ఆగ్రహం కలిగించింది. మరుసటి సంవత్సరం ఆత్యయిక పరిస్థితిని ప్రకటించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు అట్టడుగు స్థాయికి చేరాయి. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ హయాంలో సంబంధాలు కొద్దిగా మెరుగైనాయి. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు అమెరికా విదేశాంగ శాఖ అధికారి రాబిన్ రాఫెల్ కశ్మీర్ వివాదంపైన భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడంతో సంబంధాలు మరోసారి దిగజారాయి. బిల్ క్లింటన్ భారత్‌కు సుముఖంగా ఉండేవారు కానీ వాజపేయి నాయకత్వంలో జరిగిన అణుపరీక్ష ఆయనను కలవరపరిచింది. మారిన పరిస్థితుల ప్రభావం దౌత్యపరంగా భారత్ అమెరికాకు దూరంగా ఉన్నప్పటికీ ఆర్థిక సంస్కరణల ఫలితంగా విపణి ఆధారిత ఆర్థిక వ్యవస్థ వేళ్ళూనుకోవడం, అమెరికా కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టడం, భారత విద్యార్థులు వేల సంఖ్యలో అమెరికా యూనివర్శిటీలలో చదువు కోవడం, సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) విస్తరించడంతో రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు విశేషంగా పెరి గాయి. క్లింటన్ ఇండియా సందర్శించారు. హైదరాబాద్‌కూ వచ్చారు. 2008లో మన్మోహన్సింగ్ అసాధారణమైన సంకల్ప బలంతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడంతో సంబంధాలు లోగడ ఎన్నడూ లేనంత స్థాయికి ఎదిగాయి. మన్మోహన్, జార్జి బుష్‌లు మంచి స్నేహితులుగా మారారు. ద్వైపాక్షిక సంబంధాలు ఒక మేలిమలుపు తిరిగింది బుష్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే. బుష్ కూడా హైదరాబాద్ సందర్శించారు. ఒబామా 2010లో ఢిల్లీ వచ్చి పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. స్థూలంగా చెప్పుకోవాలంటే నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకూ అమెరికాతో భారత్ సంబంధాలు ఏ మాత్రం బాగాలేవు. రాజీవ్‌తో కాస్త మెరుగై, మన్మోహన్‌తో సంతృప్తికరమైన స్థాయికి చేరుకున్నాయి. ఒబామాతో సత్సంబంధాలు నెలకొల్పుకున్న మోదీ ట్రంప్‌తో ఎట్లా నెగ్గుకొని వస్తారో చూడాలి. ఒబామా, ట్రంప్‌ల వ్యక్తిత్వాలలో అంతరం ఉంది. వారి నేపథ్యాలు వేరు. మాట్లాడే పద్ధతీ, ఆలోచించే తీరూ వేరు. మితవాద కెరటంపై మోదీ విజయలక్ష్యం చేరుకున్న విధంగానే ట్రంప్ కూడా అన్ని అంచనాలనూ తల్లకిందులు చేసి హిల్లరీని ఓడించి విజయఢంకా మోగించారు. స్వతహాగా రాజకీయవేత్త కారు కనుక ట్రంప్ ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం కష్టం. అ«ధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చైనాపైన దుమ్మెత్తి పోసిన ట్రంప్ శ్వేతభవనంలోకి మారిన తర్వాత చైనాతో స్నేహంకోసం అర్రులు చాచడం చూశాం. ఏప్రిల్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వాషింగ్టన్ వెళ్ళినప్పుడు అత్యంత సాదరంగా స్వాగతం చెప్పడమే కాకుండా తనకూ, జీ జిన్పింగ్కూ మధ్య స్నేహరసాయనిక ప్రక్రియ సంభవించిందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అణ్వస్త్రాలు ప్రయోగిస్తానంటూ అమెరికాను బెదిరిస్తున్న ఉత్తర కొరియాను కట్టడి చేయడానికి చైనాను వినియోగించుకోవాలని ట్రంప్ ఎత్తుగడ. చైనా అందుకు పూర్తిగా సహకరించడం లేదని అసంతృప్తి. ఎవరి ప్రయోజనాలు వారివి ఏ దేశ ప్రయోజనాలు ఆ దేశానికి ఉంటాయి. భారత్‌కు అనుకూలమైన నిర్ణయాలు అమెరికా తీసుకోవాలని మోదీ కోరుకుంటారు. అమెరికా బంటుగా ఇండియా ఉండాలని ట్రంప్ ఆశిస్తారు. ట్రంప్‌ను మోదీ కలుసుకోవడం ఇదే ప్రథమం. ఇద్దరూ మూడుసార్లు ఫోన్లోనే మాట్లాడుకున్నారు. మోదీ పర్యటనకు అమెరికా ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇస్తున్నది. ట్రంప్ వచ్చాక ఒక విదేశీ ప్రముఖుడికి శ్వేతభవనంలో విందు (డిన్నర్) ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇద్దరూ మొత్తం అయిదు గంటలు కలిసి ఉంటారు. ముందు ఇద్దరే మాట్లాడుకుంటారు. తర్వాత రిసెప్షన్. ప్రతినిధి బృందాల చర్చ. అనంతరం ప్రకటనలు చేయడం. తర్వాత డిన్నర్. చర్చలు ఏయే అంశాలపైన జరుగుతాయి? చైనాకు పోటీగా ఇండియాను ముగ్గులో దించాలని అమెరికా ప్రయత్నిస్తుంది. అఫ్ఘానిస్తాన్‌లో భారత్ సైనిక ప్రమేయం పెట్టుకొని ఆ మేరకు తన భారం తగ్గించాలని అగ్రరాజ్యం కోరుకుంటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపైన పోరాటంలో సంపూర్ణ సహకారం అందించాలని అభిలషిస్తుంది. ఐఎస్ నడ్డి విరగకొట్టడం ట్రంప్ లక్ష్యం. అందుకు ఇండియా తోడ్పడాలని ఆయన ఆశిస్తారు. ఉగ్రవాదంపైన సహకరించడానికి ఇండియాకు అభ్యంతరం ఉండదు. చైనాతో శత్రుత్వం ఇప్పటికే ఉంది. కొత్తగా కొనితెచ్చుకోవడం ఇష్టం ఉండదు. ఆఫ్ఘానిస్తాన్‌లో పార్లమెంటు భవనం కట్టించాం. విద్యారంగంలో సహకరిస్తున్నాం. 300 కోట్ల డాలర్ల మేరకు ఆ దేశానికి ఆర్థిక సాయం చేయడానికి ఒప్పుకున్నాం. అంతకు మించి ముందుకు సాగడం, సైనిక ప్రమేయం పెట్టుకోవడం భారత ప్రయోజనాలకు హానికరం. ఇవన్నీ ఆచితూచి నిర్ణయం తీసుకోవలసిన కీలకమైన అంశాలు. అన్నిటికీ మించి అమెరికా పాకిస్తాన్ విషయంలో మరింత స్పష్టమైన వైఖరి అవలంబించాలనీ, ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్‌ను వ్యతిరేకించాలనీ, పాకిస్తాన్‌ను నిలువరించాలనీ ఇండియా కోరుతోంది. ఇండియానూ, పాకిస్తాన్‌నూ ఒకేగాట కట్టబోమనీ, ఆ విధానానికి స్వస్తి చెబుతామనీ అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్ పాకిస్తాన్ పట్ల కరకుగా వ్యవహరించే సూచనలు ఉన్నాయి. పైలట్ లేకుండా నడిచే గార్డియన్ డ్రోన్ విమానాలను ఇండియాకు విక్రయించడానికి ఒబామా అనుమతి ఇవ్వలేదు. దక్షిణాసియాలో బలాబలాలు మారిపోతాయనీ, పాకిస్తాన్ కంటే ఇండియాది పైచేయి అవుతుందనీ ఒబామా సంకోచించారు. కానీ ట్రంప్ 22 గార్డియన్ డ్రోన్ల విక్రయానికి అంగీకరించారు. వీటి విలువ 200 కోట్ల డాలర్లు. నాటో కూటమిలో లేని దేశానికి ఈ డ్రోన్లు విక్రయించడం ఇదే మొదటిసారి. ఈ విమానం 35 గంటల పాటు ఏకధాటిగా ఆకాశంలో ఎగరగలదు. సముద్రాల గస్తీలో నావికాదళానికి ఈ విమానాలు ఉపయోగపడతాయి. అత్యాశ పనికిరాదు అమెరికాను సవాలు చేస్తున్న ఉత్తర కొరియాపైన ఆంక్షలు విధించాలన్న ఐక్యరాజ్య సమితి నిర్ణయాన్ని భారత్ సమర్థించింది. హంగరీ, వియత్నాంపైన అమెరికా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఇండియా దౌత్యనీతిలో కాలక్రమేణా గణనీయమైన మార్పు వచ్చింది. పీవీ హయాంలో ఇజ్రేల్‌ను ఇండియా గుర్తించింది. వచ్చే నెల మోదీ ఇజ్రేల్‌కు వెడుతున్నారు. ఇజ్రేల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీ అవుతారు. అంతగా మారింది భారత విదేశాంగ విధానం. ఇండియాని శత్రుదేశంగా 1948 నుంచి 1984 వరకూ పరిగణించిన అమెరికా ఇప్పుడు ఆప్తమిత్రదేశంగా సంభావిస్తున్నది. అలీన విధానమంటూ, సోషలిస్టు వేదిక అంటూ అమెరికాను వ్యతిరేకించడమే విదేశాంగ విధానంగా వ్యవహరించిన ఇండియా ఇప్పుడు అమెరికాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నది. మారిన పరిస్థితులు రెండు దేశాలనూ దగ్గరికి చేర్చాయి. రెండు చోట్లా ప్రజాస్వామ్య వ్యవస్థలు బలపడటం, మార్కెట్ ఏకానమీ తిరుగులేని విధానంగా చెలామణి కావడంతో భారత్, అమెరికాలు చేరువ కావడానికి మార్గం సుగమం అయింది. దూరదృష్టితో ఈ మార్గాన్ని శాశ్వత రహదారిగా మార్చడానికి అవసరమైన చొరవ, సృజన ఇద్దరు నేతలూ ప్రదర్శిస్తే హెచ్1–బి వీసాల వ్యవహారంలో ట్రంప్ వైఖరి క్రమంగా మారుతుందని భావించవచ్చు. ఇప్పటికైతే ఈ అంశంపైన చర్చకు ఆస్కారం లేదని శ్వేతభవనం అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం మరణశిక్ష విధించిన భారతీయుడు కుల్‌భూషణ్ యాదవ్‌ను విడిచి పెట్టవలసిందిగా పాకిస్తాన్‌పైన ఒత్తిడి తేవాలని నరేంద్రమోదీ ట్రంప్‌ను కోరవచ్చు. ఇచ్చిపుచ్చుకోవడమే దౌత్యం. మనం ఏమి ఇవ్వడానికి అంగీకరిస్తామో అమెరికా నుంచి అంతే ఆశించాలి. అంతకంటే మించి రాబట్టాలనుకోవడం అత్యాశే అవుతుంది. అందుకే మోదీ అమెరికా పర్యటన నుంచి అద్భుతాలు ఆశించకూడదు. కె. రామచంద్రమూర్తి -
జమిలి ఎన్నికలకు జై అందామా?
త్రికాలమ్ ‘ఒక దేశం ఒకే పన్ను విధానం’ లాగానే ‘ఒక దేశం ఒకేసారి ఎన్నికలు’ అనే జమిలి ఎన్నికల నినాదం తెరమీదికి వచ్చింది. ఈ ప్రతిపాదన వల్ల కలిగే లాభనష్టాలను చర్చించి ఒక నిర్ణయానికి రావడం ప్రతి పౌరుడికీ అవసరం. రాష్ట్రపతి, ప్రధాని, ఎన్నికల ప్రధానాధికారులూ, నీతి ఆయోగ్ సభ్యులూ జమిలి ఎన్నికలను సిఫార్సు చేస్తున్నారంటే ఆ ప్రతిపాదనలో కొంత బలం ఉండి తీరాలి. ప్రతిపాదనను ఆమోదించినా, తిరస్కరించినా అధ్యయనం చేయడం అవసరం. నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ బిబేక్ దేబ్రాయ్, ప్రత్యేకాధికారి కిశోర్దేశాయ్ కలిసి ఒక ప్రామాణికమైన అధ్యయన పత్రం వెలువరించారు. జస్టిస్ జీవన్ రెడ్డి నాయకత్వంలోని లా కమిషన్, పార్లమెంటు స్థాయీ సంఘం ఈ ప్రతిపాదనకు అనుకూలంగా వ్యాఖ్యానించాయి. రాష్ట్రపతి, ప్రధాని, ఎన్నికల ప్రధానాధికా రిగా పనిచేసిన ఖురేషీ తదితరులు దీనిని ఆమోదిస్తున్నారు. జమిలి ఎన్నికలను ప్రతిపాదిస్తున్న వారంతా చెప్పే అంశాలు నాలుగు. 1) ప్రతి సంవత్సరం అయిదు లేదా ఏడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరు గుతున్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సరేసరి. దీని వల్ల పాలకులు ఎక్కువ కాలం ఎన్నికల రంధిలోనే ఉంటారు. పరిపాలన పైన దృష్టి తగ్గిపోతోంది. 2) ఎన్నికలు నిర్వహించడం ఖర్చుతో కూడిన పని. ఒకేసారి అయితే ఖర్చులు కలిసివస్తాయి. దుబారాను అరికట్టవచ్చు. 3) ఎన్నికలు జరిగిన ప్రతిసారీ సాయుధ బలగాలనూ, ప్రభుత్వ అధికారులనూ, ఉద్యోగులనూ రంగంలోకి దించాలి. ఈ మేరకు పరిపాలన దెబ్బ తింటుంది. 4) ఎన్నికల సమయంలో కులం, మతం విధిగా చర్చకు వస్తాయి. మత కలహాలూ, కుల వైషమ్యాలూ పెరుగుతాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ కుల మతాలను వినియోగించుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. నిరంతర ఎన్నికలు ఎప్పుడూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయన్నమాట వాస్తవం. 2014లో 16వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఆరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, జమ్మూ–కశ్మీర్ శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. 2015 జనవరి–ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకీ, అదే సంవత్సరం సెప్టెంబర్– నవంబర్‌లో బిహార్ అసెంబ్లీకీ, 2016 ఫిబ్రవరి–మార్చిలో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీలకీ ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల 2017 ఫిబ్రవరి–మార్చిలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీల ఎన్నికలు జరగడం చూశాం. 2014 మార్చి నుంచి 2017 మార్చి వరకూ 19 రాష్టాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలోని మూడో స్థాయికి చెందిన పంచాయతీరాజ్, మునిసిపాలిటీ ఎన్నికలు ఎల్లకాలం జరుగుతున్నట్టే కనిపిస్తాయి. కనుక దేశం యావత్తూ ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలలో మునిగితేలుతున్నట్టే అనిపిస్తున్నది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ నియమావళి అమలులోకి వస్తుంది. దీని వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుంది. లోక్‌సభ ఎన్నికల ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. లోక్‌సభకూ, శాసనసభకూ జమిలిగా ఎన్నికలు జరిగితే మొత్తం ఖర్చును చెరిసగం భరించాలి. ఎన్నికల వ్యయం విప రీతంగా పెరుగుతోంది. 2009లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రూ.1,115 కోట్లు ఖర్చయితే, 2014 ఎన్నికల ఖర్చు రూ. 3,870 కోట్లు. మూడు రెట్ల కంటే అధికం. ‘ఎన్నికలంటే అవినీతి. ఎక్కువసార్లు ఎన్నికలు నిర్వహించడం అంటే ఎక్కువ అవినీతికి అవకాశం ఇవ్వడం’ అన్నది ఖురేషీ విశ్వాసం. కుల,మత ప్రస్తావనలు వచ్చి, అప్రజాస్వామికమైన, అనారోగ్యకరమైన ధోరణులు ప్రబ లేది కూడా ఎన్నికల సమయంలోనే అన్న వాదన కూడా ఆయనదే. రాజకీయ పార్టీలూ, అభ్యర్థులూ పరిమితికి మించి విపరీతంగా ఖర్చు చేస్తున్న సంగతి బహిరంగ రహస్యం. దానిని అరికట్టే సంకల్పం కానీ యంత్రాంగం కానీ లేవు. అయిదేళ్ళ పొడుగునా ఎక్కడో ఒక చోట అకాలంలో ఎన్నికలు జరిపించే విధానానికి వెంటనే స్వస్తి చెప్పాలంటూ ఎన్నికల కమిషన్ 1999లో సమ ర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది. ఎస్ ఆర్ బొమ్మయ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం రాజ్యాంగంలోని 360వ అధికరణను ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించే అన్యాయమైన విధానం బాగా తగ్గిపోయిందనీ, పార్లమెంటుకూ, శాసనసభలకూ ఇదివరకు లేని సుస్థిరత ఇప్పుడు సమకూరిందనీ లా కమిషన్ అభిప్రాయం. అత్యవసర మైన సందర్భంలోనే అసెంబ్లీ ఎన్నికలు విడిగా నిర్వహించాలనీ, జమిలి ఎన్నికలే నియమం కావాలనీ లా కమిషన్ స్పష్టం చేసింది. ఈ విషయంపైన పార్లమెంటరీ స్థాయీ సంఘం అదే అభిప్రాయం వెలిబుచ్చింది. జమిలి ఎన్నికల ప్రక్రియకు విఘాతం జమిలి ఎన్నికలు మన దేశానికి కొత్త కాదు. 1951–52లో తొలి సార్వత్రిక ఎన్ని కల నుంచీ 1967లో నాలుగో లోక్‌సభకు ఎన్నికల వరకూ జమిలిగానే సాగాయి. 1968, 69 సంవత్సరాలలో అస్థిరత చోటు చేసుకుంది. చాలా రాష్ట్రాలలో అసెంబ్లీలు రద్దయినాయి. 1970లో నాలుగో లోక్‌సభనే రద్దు చేసి 1971లో ఎన్నికలు నిర్వహించారు. దాంతో జమిలి ఎన్నికల ప్రక్రియకు పూర్తి విఘాతం కలిగింది. ఆ తర్వాత అయిదో లోక్‌సభ గడువును ఆత్యయిక పరిస్థితిలో రాజ్యాంగంలోని 352 అధికరణను ఉపయోగించుకొని 1977 వరకూ పొడిగిం చారు. 1967 నుంచే కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్‌పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలలో మూడో స్థానానికో, నాలుగో స్థానానికో పడిపోయింది. 1984లో ఇందిరాగాం«ధీ హత్యా నంతర సానుభూతి పవనాలలో లోక్‌సభ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ 1989లో రాజీవ్‌గాంధీ నాయకత్వంలో పోటీ చేసినా చిత్తుగా ఓడి పోయింది. మళ్ళీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థితికి చేరుకోలేదు. 1984లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు సొంతబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయగల సంఖ్యాబలం సాధించింది. అయినప్పటికీ నేష నల్ డెమాక్రాటిక్ అలయెన్స్‌ను కొనసాగించే ఉద్దేశంతో అకాలీదళ్, శివసేన, తెలుగుదేశం పార్టీ వంటి మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీనీ, బహుజన సమాజ్ పార్టీనీ బీజేపీ మట్టి కరిపించిన తర్వాత ప్రధాని జోరుమీదున్నారు. జమిలి ఎన్నికల ప్రస్తావన తరచుగా చేస్తున్నారు. అసలు జమిలి ఎన్నికల విధానం అమలు సాధ్యమేనా? 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఎన్నికలు జరగాలంటే తమిళ నాడు, పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల శాసనసభల గడువు 24 మాసాల ముందే ముగిసిపోతుంది. జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ గడువు 21 మాసాలు తరిగిపోతుంది. మొన్న ఎన్నికలు జరిగిన యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు 2019లో కాకుండా 2024లో జరిపించాలంటే ఆ అసెంబ్లీల గడువును 27 మాసాలకు పెంచవలసి వస్తుంది. కర్ణాటక, గుజరాత్ అసెంబ్లీలకి కూడా 2019లోనే లోక్‌సభతో పాటు ఎన్నికలు నిర్వహించాలంటే ఆ రెండు శాసనసభల గడువు పెంచాలి. గడువు తగ్గిస్తే ప్రతిపక్షం సంతోషిస్తుంది. పెంచితే అధికారపక్షం ఆనందిస్తుంది, ప్రతిపక్షం ఆగ్రహిస్తుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటరీ స్థాయీ సంఘం మరో సూచన చేసింది. ప్రతి ముప్పయ్ మాసాలకూ ఒకసారి ఎన్నికలు పెట్టు కోవచ్చునని సలహా చెప్పింది. 2019 ఏప్రిల్–మేలో ఒకసారీ, 2021 అక్టో బర్–నవంబర్‌లో మరోవిడతా ఎన్నికలన్నమాట. ఈ విధానం అయితే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తేడా పడదు కానీ ఇతర రాష్ట్రాలలోని అసెంబ్లీల గడువు పెరగడం లేదా తరగడం అనివార్యం. 15 మాసాల కంటే ఎక్కువగా తగ్గకుండా, 13 మాసాల కంటే ఎక్కువగా పెరగకుండా మొదటి విడతలో 14 రాష్ట్రాల అసెంబ్లీలకూ, రెండో విడతలో 16 రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు నిర్వహించవచ్చు. ఉప ఎన్నికలను కూడా రెండు విడతలు నిర్వహించాలనీ, ప్రతిసారీ నెలన్నర సమయం కేటాయించాలనీ స్థాయీ సంఘం సూచించింది. ఎన్నికల సంఘం ప్రచురించిన 2015–2025 వ్యూహాత్మక ప్రణాళిక సైతం ఈ విధానానికి దగ్గరలో ఉంది. మంచి, చెడుల విశ్లేషణ జమిలి ఎన్నికల ప్రతిపాదనను వస్తునిష్టంగా పరిశీలించినట్లయితే అనుకూలురు చెప్పే కారణాలను కాదనడం సాధ్యం కాదు. సమస్యలు ఉన్నమాట వాస్తవం. జమిలి ఎన్నికల విధానం అమలు జరిగితే ఇప్పుడున్న సమస్యలు కొంతవరకూ పరిష్కారం కావచ్చు. జమిలి ప్రతిపాదన ప్రాణాంతకమైన పెనుప్రమాదం వైపు దేశాన్ని నెడుతుందా? సమాఖ్య స్ఫూర్తికి భంగం వాటిల్లుతుందా? ఏకీకృత వ్యవస్థకు దారితీస్తుందా? జమిలి ప్రతిపాదన చేయడం వెనుక మోదీ ఆంతర్యం ఏమిటి అనేది మొదటి భయం. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అంటూ జాతీయ స్థాయిలో 2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మోదీ ప్రాంతీయ పార్టీలను నామరూపాలు లేకుండా చేయాలన్న సంకల్పం చెప్పుకున్నారని వినికిడి. ఖురేషీ వెలిబుచ్చిన భయం మోదీ ఎన్నికల ప్రచారంలో నిజమై కూర్చుంటుంది. ఇటీవలి ఎన్నికలలో మోదీ, అమిత్‌షా జోడీ మతాన్ని, కులాన్నీ చాలా తెలివిగా వినియోగించుకొని కుల రాజకీయాలకు అతీతంగా, నవరాజకీయం చేయాలని ప్రయత్నించిన అఖిలేశ్ యాదవ్ మాడు పగుల కొట్టారు. మాయావతి శిబిరం నుంచి దళిత నాయకులను తమ వైపుకు తిప్పు కొని బీఎస్పీని పూర్వపక్షం చేశారు. ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ప్రాంతీయత లోనే ఉంది. జాతీయతావాదం ప్రాంతీయ పార్టీలకు ప్రమాదకరం. జాతీయ వాదాన్నీ, హిందూత్వవాదాన్నీ, కులసమీకరణలనూ వినియోగించుకొని ప్రాంతీయ పార్టీల ఆయువుపట్టు మీద కొట్టాలన్నది మోదీ, షాల వ్యూహం కావచ్చు. ఇది జయప్రదం కావడానికి జమిలి ఎన్నికల విధానం తోడ్పడుతుంది. మోదీ వంటి అద్భుతమైన వాగ్ధాటి కలిగిన వక్త ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహించినప్పుడు ఆయన ప్రభావం ఓటర్లమీద నిశ్చయంగా పడు తుంది. లోక్‌సభకూ, శాసనసభకూ ఒకే సారి ఎన్నికలు జరిగినప్పుడు లోక్‌సభ ఓటు జాతీయ పార్టీకీ, శాసన సభ ఓటు ప్రాంతీయపార్టీకి వేసేటంతటి విచక్షణ శక్తి ఓటర్లకు అంతగా ఉండదు. అసోసియేషన్ ఫర్ డెమాక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఇటీవల వెలువరించిన ఒక నివేదికలో భారత ఓటర్ల మనస్తత్వంపైన అధ్యయన ఫలితాలను పేర్కొన్నది. లోక్‌సభ ఎన్నికలూ, శాసనసభ ఎన్ని కలూ జమిలిగా జరిగితే రెండు ఎన్నికలలోనూ ఒకే పార్టీకి ఓటు వేసే మానసిక ధోరణి పెరుగుతోంది. 1999లో ఈ ధోరణిలో ఓటు చేసినవారు 68 శాతం ఉండగా, 2004 నాటికి అది 71 శాతానికీ, 2009 నాటికి 77 శాతానికీ, 2014 నాటికి 86 శాతానికీ పెరిగింది. ఢిల్లీలో, బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు విడిగా జరిగాయి కనుక బీజేపీ ఓడిపోయింది. లోక్‌సభ ఎన్నికలతోపాటే జరిగి ఉంటే ఓడిపోయేది కాదు. ప్రాంతీయ పార్టీలు లేకుండా, ప్రతిపక్షం లేకుండా ఒకే ఒక రాజకీయ పార్టీ లేదా కూటమి వెలిగిపోవడం సమాఖ్య స్వభావానికి విరుద్ధం. అధికారంలో సుస్థిరంగా ఉన్న ప్రధాని మోదీకీ దేశం అంతటా ఒకే పన్ను విధానం ఉన్నట్టే ఒకే ఎన్నికల విధానం (జమిలి), ఒకే భాష (హిందీ), ఒకే మతం (హిందూ), ఒకే పార్టీ (బీజేపీ) ఉండాలని మనసులో ఉండవచ్చు. భిన్న త్వంలో ఏకత్వాన్నీ, సర్వ మత సమభావననూ, త్రిభాషా సూత్రాన్నీ, రాజMీ య బాహుళ్యాన్నీ (ప్లూరల్ పోలిటీ) ప్రాతిపదికగా చేసుకొని రిపబ్లిక్‌గా మనుగడ సాగిస్తున్న భారతదేశంలో మోదీ మన్ కీబాత్ (మనసులో మాట) నిజం కావడం అంత తేలికకాదు. సమాఖ్య స్వభావం వంటబట్టించుకున్న ప్రజలు ఏకీకృత వ్యవస్థను ఆమోదించరు. కె. రామచంద్రమూర్తి -
కనిపించని కుట్రలు
త్రికాలమ్ గోరటి వెంకన్న పాటలోని ‘కనిపించని కుట్రలు’ పల్లెల్లోనే కాదు రాజధాని నగరాలలోనూ చాలాకాలంగా జరుగుతున్నాయి. మౌనంగా నేరాన్ని అనుమతించడం, ఆమోదించడం లేదా ప్రోత్సహించడం పెద్ద నేరం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేతల చేతలను జాగ్రత్తగా గమనించాలి. మాటలకూ, చేతలకూ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే నాయకులను ప్రతిఘటించాలి. రాజ్యాంగ భిక్ష కారణంగా ఉన్నత పదవులలో కుదురుకున్నవారు దాన్నే తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినప్పుడు ప్రశ్నించకపోవడం, నిరోధించకపోవడం రాజ్యాంగానికి ద్రోహం చేసినట్టు. ప్రజాస్వామ్యానికి పాడె కట్టినట్టు. చెట్టు ఎక్కి మొదలు నరుక్కున్నట్టు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ప్రతిపక్ష శాసనసభ్యులను పదవులతోనో, ఇతర వాగ్దానాలతోనో ఆకర్షించి కండువాలు కప్పుతున్న పార్టీ అధ్యక్షులను మందలించవలసినవారు మందలించకపోవడం, ప్రశ్నించవలసినవారు ప్రశ్నించకపోవడం, ప్రతిఘటించవలసినవారు ప్రతిఘటించకపోవడం ఆత్మహత్యాసదృశం. ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ రేపు ప్రతిపక్షంలో ఉండవచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి చేస్తున్న నేరం రేపు మరో ముఖ్యమంత్రి చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వెబ్సైట్లో మార్చి 31న నమోదు చేసిన తాజా సమాచారం ప్రకారం ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీలో 66 మంది శాసనసభ్యులు ఉన్నారు. అందులో ఫిరాయించినవారు 21 మంది. నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి హఠాన్మరణం తర్వాత మిగిలినవారు 20 మంది. వారంతా ఈ రోజు కూడా చట్టరీత్యా వైఎస్ఆర్సీపీ సభ్యులే. మంత్రులుగా ప్రమాణం చేసిన ఆ నలుగురు సైతం వైఎస్ఆర్సీపీ సభ్యులుగానే మంత్రివర్గంలో ఉన్నారు. సాంకేతికంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయకత్వంలోని మంత్రివర్గం టీడీపీ, బీజేపీ, నలుగురు వైఎస్ఆర్సీపీ సభ్యులతో కూడిన సంకీర్ణం. రాజ్యాంగాన్ని ఇంత బాహాటంగా, ఇంత నిస్సిగ్గుగా భ్రష్టుపట్టిస్తుంటే పెద్దలెవ్వరూ వారించకపోవడం దురదృష్టం. రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినవారు కానీ అవినీతినీ, అక్రమాలనూ ఎత్తిచూపించి అధిక్షేపించవలసిన పత్రికలు కానీ, వార్తాచానళ్ళు కానీ, జోక్యం చేసుకోవలసిన న్యాయవ్యవస్థ కానీ మౌనంగా ఉండటం నిశ్శబ్ద కుట్ర కాక ఏమౌతుంది? ఫిరాయింపుల నిరోధక చట్టం వైఫల్యం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఫిరాయింపులను నిరోధించలేకపోతున్నది. అధికారపార్టీతో సభాపతులు కుమ్మక్కుకావడంతో చట్టం తెల్లబోతున్నది. ఫిరాయింపుదారులకు ముఖ్యమంత్రులు ఎటువంటి ప్రలోభాలు చూపించారో అందరికీ తెలుసు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బాధిత పక్షం పెట్టుకున్న అర్జీపైన చర్య తీసుకోకుండా మాసాల తరబడి మౌనంగా ఉంటున్న సభాపతుల నిర్వాకం తెలుసు. విశేషాధికారాలను సభాపతులు దుర్వినియోగం చేస్తున్నారని తెలిసినా నిరోధించడానికి అవసరమైన అధికారంలేదని న్యాయవ్యవస్థ భావించి మౌనంగా ఉంటున్నది. నిత్యజీవన సమరంలో ఊపిరాడక పెనుగులాడుతున్న పౌరులకు నాయకుల బారినుంచి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవడానికి అవసరమైన తీరిక కానీ, శక్తి కానీ లేదు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నిస్తే పోలీసులు ఉక్కుపాదం మోపుతారు. రాజీవ్‌గాంధీ, వాజపేయి ప్రభుత్వాలు చేసిన గొప్ప సంస్కరణ అపçహాస్యం అవుతోంది. టెన్త్ షెడ్యూల్ కాగితాలకే పరిమితం. 70 సంవత్సరాల స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య పాలన అనంతరం రాజ్యాంగ పథాధికారులే రాజ్యాంగాన్ని కుళ్ళబొడుస్తుంటే ప్రజలు నిస్సహా యంగా ప్రేక్షకపాత్ర పోషించవలసిరావడం విలువల పతనానికి సంకేతం. చట్టసభల అధిపతుల నిర్ణయాలనూ, నిర్ణయరాహిత్యాన్నీ న్యాయవ్యవస్థ ప్రశ్నించవచ్చునని 1991లోనే నాటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య ‘కిహోటో హోలాహన్ వర్సెస్ జచిల్సు’ కేసులో స్పష్టం చేశారు. ఫిరాయింపుదార్లపై చర్య తీసుకోవడం విషయంలో శాసనసభ స్పీకర్ కానీ శాసనమండలి అధ్యక్షుడు కానీ క్వాసై జుడీషియల్ ట్రిబ్యూనల్ అధిపతిగా వ్యవహరించాలని జస్టిస్ వెంకటాచలయ్య తన చరిత్రాత్మకమైన తీర్పులో చెప్పారు. రాజ్యాంగనైతికత ఏదీ? రాజ్యాంగం ప్రసాదించిన పదవులలో ఉన్నవారు రాజ్యాంగ నైతికతను విస్మరించరాదంటూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ గ్రీస్ చరిత్రకారుడు గ్రోతేను ఉటంకించారు. రాజ్యాంగ నైతికతను రాజ్యాంగం పట్ల అపరిమితమైన విధేయత కలిగి ఉండటంగా, రాజ్యాంగాధికారాన్ని శిరసావహించడంగా గ్రోతే నిర్వచించారు. రాజ్యాంగం అన్నది న్యాయసూత్రాలతో కూడిన అస్థిపంజరం. దానికి కండ, నెత్తురు ప్రసాదించి చైతన్యవంతం చేసేది రాజ్యాంగ నైతికత అని అంబేడ్కర్ వివరిస్తూ అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ ఉదాహరణ చెప్పారు. వాషింగ్టన్ నాటి అమెరికా సమాజంలో కేవలం ఒక నాయకుడు, అధ్యక్షుడు మాత్రమే కాదు. దైవసమానుడు. ఆయన పోటీ చేస్తే పదిసార్లు ఏకగ్రీవంగా గెలుపొందగలడు. అంతటి ప్రజాదరణ ఉండేది. కానీ రెండోసారి అధ్యక్ష పదవిని స్వీకరించమంటే నిరాకరిస్తూ, ‘మనం ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం వెనుక లక్ష్యాన్ని మీరు విస్మరిస్తున్నారు. వంశ పారంపర్యంగా వచ్చే రాచరికాన్ని, వంశ పారంపర్య పాలకులను, నియంతను మనం వద్దనుకున్నాం. ఇంగ్లండ్ రాజుతో సంబంధాలు తెంచుకొని ఇక్కడికి వచ్చి స్వాతంత్య్రం ప్రకటించుకున్న తర్వాత కూడా మీరు నన్నే ఆరాధించి రెండోసారి నేనే అధ్యక్షుడుగా ఉండాలని కోరుతున్నారంటే మీ సూత్రాలు ఏమైపోయినాయి? (My dear people, you have forgotten the purpose for which we made this Constitution. We made this Constitution because we did not want a hereditary monarchy and we did not want a hereditary ruler or a dictator. If after abandoning and swerving away from the allegiance of the English king, you come to this country and stick to worship me year after year and term after term, what happens to your principles?).. వాషింగ్టన్ అతి బలవంతం మీద రెండోసారి అధ్యక్షుడుగా ఉండటానికి ఒప్పుకున్నారు. మూడోసారి అడిగితే ఆగ్రహించి ససేమిరా అన్నారు. మన రాజ్యాంగ సూత్రాలు సైతం ఇంచుమించుగా అమెరికా రాజ్యాంగాన్ని పోలినవే. జరుగుతున్నది ఈ సూత్రాలకు పూర్తి విరుద్ధంగానే. మంత్రి పదవిని లంచంతో పోల్చవచ్చా? వ్యక్తులతో నిమిత్తం లేదు. వ్యవస్థ ప్రధానం. ఫిరాయింపుల నిరోధక చట్టం విఫలమైన మాట వాస్తవం. ఫిరాయించడంలో, ఫిరాయింపులను ప్రోత్సహించడంలో అవినీతి ఉంది కనుక అవినీతి నిరోధక చట్టంతో ఈ జాడ్యాన్ని అరికట్టవచ్చునా? ఇది రాజనీతిజ్ఞులూ, న్యాయకోవిదులూ, మేధావులూ, సామాజిక కార్యకర్తలూ, ప్రజాస్వామ్యప్రియులూ ఆలోచించవలసిన ప్రశ్న. లంచం ఇవ్వడం నేరం. పుచ్చుకోవడం నేరం అని అవినీతి నిరోధక చట్టం 7వ సెక్షన్ (It bars public servants from taking gratification other than legal remuneration), 8వ సెక్షన్ (Taking gratification, in order, by corrupt or illegal means, to influence public servant)స్పష్టం చేస్తున్నాయి. పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులూ, చట్టసభల సభ్యులూ. ప్రభుత్వ ఉద్యోగిని లంచం తీసుకోవడానికి ఒప్పించడం కూడా నేరమే అంటోంది ఈ చట్టంలోని 9వ సెక్షన్ (Taking gratification, for exercise of personal influence with public servant). పార్టీ ఫిరాయించినవారికి పదవి ఇస్తామంటూ ఎర చూపడం, పదవి ఇవ్వడం లంచం ఇవ్వడంగా పరిగణించవచ్చునా అన్నది అనుమానం. అందుకే ఇది ధర్మాగ్రహం నుంచి పుట్టుకొచ్చిన ఒకానొక ప్రతిపాదనపైన చర్చ అని విన్నవించుకోవడం. అవినీతి నిరోధక చట్టంలో gratification అనే మాట ఉంది. అంటే సంతృప్తిపరచడం. డబ్బు కానీ తత్సమానమైన తృప్తినిచ్చేది ఏదైనా వస్తువు కానీ పదవి కానీ హోదా కానీ లంచంగానే భావించాలి (The word gratification is not restricted to pecuniary gratifications or to gratifications estimable in money). ప్రతిపక్షం నుంచి ఫిరాయిస్తే పదవులు ఇస్తామంటూ అధికారపక్షం వాగ్దానం చేయడం ‘గ్రాటిఫికేషన్’ కిందికే వస్తుందని అనుకోవచ్చు. పార్టీ అధ్యక్షుడు పబ్లిక్ సర్వెంట్ కాదు. కానీ ముఖ్యమంత్రీ, మంత్రులూ, ఎంఎల్ఏలూ పబ్లిక్ సర్వెంట్లే. పదవ షెడ్యూలు కింద నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. మొత్తం సభ్యులలో మూడింట రెండువంతుల మంది గంపగుత్తగా పార్టీ మారాలనుకుంటే అది పార్టీ చీలిక అవుతుంది. ఫిరాయింపు కాదు. కానీ అంతకంటే తక్కువమంది మారితే ఫిరాయింపు అవుతుందని సభాపతికీ, ముఖ్యమంత్రికీ, ఫిరాయించినవారికీ తెలుసు. వీరిలో ఎవ్వరికీ చట్ట భీతి లేదు. అటువంటివారి చేత మంత్రులుగా ప్రమాణం చేయించిన గవర్నర్ కూడా తప్పు చేసినట్టే లెక్క. వారు ఫిరాయింపుదారులని గవర్నర్‌కీ తెలుసు. వారి రాజీనామా లేఖలు చూసిన తర్వాతనే ప్రమాణం చేయించానంటూ ఆయన సమర్థించుకుంటున్నారు. కానీ అది చెల్లదు. ఆ రాజీనామాలను స్పీకర్ ఆమోదించిన తర్వాత చేయిస్తే గవర్నర్‌ను తప్పుపట్టడానికి అవకాశం లేదు. రాజీనామాలను స్పీకర్ ఆమోదించలేదనీ, ఆమోదించే ఉద్దేశం కూడా లేదనీ అందరికీ తెలుసు. తెలంగాణ స్పీకర్‌కి కిందటి నవంబరులోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశించిన సుప్రీంకోర్టు ఆ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని నిర్ణయించింది. ఫిరాయింపుదారుల ఉత్తుత్తి రాజీనామాలను ఆమోదించకుండా, అనర్హత వేటు వేయాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకుడు సమర్పించిన పిటిషన్‌పైన చర్య తీసుకోకుండా ఒక నేరం జరగడానికి మౌన సహకారం అందించిన సభాపతికి సైతం నేరంలో భాగస్వామ్యం ఉంటుంది. ప్రమాణం పవిత్రత ఏదీ? రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానంటూ గవర్నర్, రాజ్యాంగం ప్రకారం పనిచేస్తానంటూ ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానంటూ ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయించి అనర్హత వేటుకు గురికావలసిన ఎంఎల్ఏ చేత మంత్రిగా ప్రమాణం చేయించమని గవర్నర్‌ను ఎట్లా కోరతారు? గవర్నర్ ఎట్లా ప్రమాణం చేయిస్తారు? రాజ్యాంగానికి విధేయంగా ఉంటానంటూ ప్రమాణం చేసిన ఎంఎల్ఏ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కి వ్యతిరేకంగా మంత్రిగా ప్రమాణం చేస్తూ ఆ హోదాలో రాజ్యాంగానికి విధేయంగా ఉంటానంటూ ఎట్లా చెబుతారు? స్వవచోఘాతం, ఆత్మవంచన, పరవంచన. అవినీతి నిరోధక చట్టం ప్రకారం అందరూ నేరం చేసినట్టే లెక్క. కానీ గవర్నర్‌నూ, రాష్ట్రపతినీ ఎవ్వరూ ప్రాసిక్యూట్ చేయరాదని సంవిధానం స్పష్టం చేస్తున్నది. 360, 360(1) అధికరణలు వారికి రక్షణ కల్పిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రికీ, స్పీకర్‌కూ, మంత్రులుగా చేరిన ఫిరాయింపుదారులకూ ఎటువంటి రక్షణా లేదు. వారిని ప్రాసిక్యూట్ చేయవలసిందిగా ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే న్యాయమూర్తి ఎట్లా స్పందిస్తారో చూడాలి. పార్టీ ఫిరాయించడం అవినీతి పని. అవినీతికి పాల్పడినవారినీ, అందుకు ప్రోత్సహించినవారినీ, మౌన సహకారం అందించినవారినీ ఉపేక్షిస్తే సంవిధానం శక్తిహీనమై ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోతుంది. సభాపతికి దఖలు పరచిన విశేషాధికారాలను కుదించి, కాలపరిమితి విధించి, ఫలానా గడువులోగా ఫిరాయింపుదారులపైన అనర్హత వేటు వేయాలంటూ నిర్దేశించాలి. గడువు ముగియగానే వారు అనర్హులు కావాలి. ఈ మేరకు మరో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా చట్టంలో ఉన్న లొసుగును అధిగమించడం ఒక్కటే మార్గం. ఫిరాయింపుదారులపైన అనర్హత వేటు వేసే అధికారం న్యాయవ్యవస్థకో, ఎన్నికల సంఘానికో ఇవ్వడం కంటే సభాపతినే నిబంధనల మార్పుతో నియంత్రిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి సమర్పించిన వినతిపత్రం ఆధారంగా రాష్ట్రపతి ప్రధానితో సమాలోచన జరిపి సుప్రీంకోర్టు అభిప్రాయం కోరడం ద్వారా సవరణ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. చేయరాని పనులన్నీ చేసి, అవినీతిని అందలం ఎక్కించిన తర్వాత ఫిరాయింపులపైన జాతీయ స్థాయి చర్చ జరగడం మంచిదేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారంనాడు వ్యాఖ్యానించడం కపట రాజకీయానికి పరాకాష్ఠ. కె. రామచంద్రమూర్తి -
కులాల కురుక్షేత్రం యూపీ
త్రికాలమ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో బ్యా(ఓ)టింగ్ మొదలయింది. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ జరిగిన శనివారంనాడే ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ మీరట్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 11న ప్రథమ ఘట్టం ఓటింగ్ జరగబోయే పశ్చిమోత్తరప్రదేశ్లో బీజేపీ బలమైన శక్తి. ఆగ్రా నుంచి మథుర వరకూ, ఘజియాబాద్ నుంచి మీరట్, ముజఫర్‌నగర్ వరకూ ఆ పార్టీకి జనాదరణ విశేషంగా ఉంది. చరణ్‌సింగ్ కుమారుడు అజిత్‌సింగ్ నాయ కత్వంలోని రాష్ట్రీయలోక్‌దళ్ (ఆరెల్డీ) అభ్యర్థులు లేకపోతే జాట్, క్షత్రియ ఓట్లలో అధికభాగం బీజేపీకే పడేవి. 2014లో ఆరెల్డీని వదిలి వెళ్ళిన జాట్లు ఆ పార్టీకి తిరిగి వస్తున్నారు. వడ్డీ సహితంగా రైతుల రుణాలు సంపూర్ణంగా మాఫ్ చేస్తామని పరివర్తన సభలో నరేంద్రమోదీ ప్రకటించారు. తమ పార్టీ స్కాంకు వ్యతిరేకంగా పోరాటం నిరవధికంగా సాగిస్తుందని చెబుతూ, ఇంగ్లీషు మాట స్కాంలోని అక్షరాలలో ‘ఎస్’ అంటే సమాజ్‌వాదీ అనీ, ‘సి’ అంటే కాంగ్రెస్ అనీ, ‘ఏ’ అంటే అఖిలేశ్ అనీ ‘ఎం’ అంటే మాయావతి అనీ అభివర్ణించారు. పశ్చిమంలోనే కాదు మొత్తం ఉత్తరప్రదేశ్‌లో మోదీకి జనాకర్షణశక్తి ఏ మాత్రం తగ్గలేదు. 2014లో మొత్తం 80 స్థానాలలో 71 స్థానాలు గెలుచుకున్నప్పటి ప్రాబల్యం చెక్కుచెదరలేదు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొంత ఉన్నప్పటికీ మోదీకి ప్రతికూలంగా మారలేదు. ప్రస్తుతానికి అత్యంత జనప్రియనేత మోదీనే. ఈ విశ్వాసం మితిమీరితే అల సత్వం పెరిగి బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉంది. యూపీలో సాగుతున్న సం‘కుల’ సమరంలో ప్రధాన పార్టీలన్నీ కులాల లెక్కల ప్రకారమే అభ్యర్థులను నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లోనూ జరుగుతున్న తంతు ఇదే. ముఖ్యంగా యూపీలో ఎన్నికలంటే కులాలు, మతాల మధ్య కుమ్ములాటే. ఏ రెండు ప్రధాన కులాలు లేక వర్గాలు ఒక్కటైనా గెలుపు ఖాయం. రాష్ట్ర జనాభాలో 19 శాతం ఉన్న ముస్లింలు, 20.5 శాతం ఉన్న దళితులూ, 40 శాతానికి పైగా ఉన్న ఓబీసీలూ, 12 శాతం ఉన్న బ్రాహ్మణులూ పార్టీల జయాపజయాలను నిర్ణయించే కీలక స్థితిలో ఉన్నారు. 2012లో యాదవులూ, ముస్లింలూ ఒక్క తాటిపైకి వచ్చి సమాజ్‌వాదీ పార్టీకి మొత్తం 403 స్థానాలలో 224 స్థానాలు సాధించిపెట్టారు. తిరిగి అదే సమీకరణ సాధించడం కోసమే ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భుజం కలిపారు. ముస్లిం ఓట్లు చీలకుండా ఉండాలంటే సమా జ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు అత్యవసరమని భావించి అందుకు అనుగుణంగా పావులు కదిపిన రణకౌశలం యువ ముఖ్యమంత్రిది. ఇందుకోసం తండ్రి ములాయంసింగ్ యాదవ్‌నీ, బాబాయ్ శివపాల్ యాద వ్నూ ఎదిరించి పోరాడిన రాజకీయ చతురుడు. వ్యూహం ఫలిస్తుందో లేదో తెలియదు కానీ అఖిలేశ్ చేసింది మంచి ప్రయత్నం. రెండోసారి గెలిచి యూపీలో చరిత్ర సృష్టించాలంటే ఇది ఒక్కటే మార్గం. కాంగ్రెస్‌తో పొత్తు వద్దేవద్దంటున్న నేతాజీ ములాయం మాటకు అఖిలేశ్ కట్టుబడి ఉన్నట్లయితే నిస్సందేహంగా మాయావతికి విజయం చేకూరేది. కాంగ్రెస్–ఎస్పీ కూటమి బీజేపీని నిలువ రించే అవకాశం ఉన్నదని ముస్లింలు భావిస్తున్నారు కనుక ఎస్పీతోనే వారు కొన సాగుతున్నట్టు కనిపిస్తున్నారు. మాయావతి వ్యూహం దళిత ఓట్లకు ముస్లిం ఓట్లు తోడయితే అయిదోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని లెక్కలేసుకున్న మాయావతి ముస్లిం అభ్యర్థులను 97 నియోజక వర్గా లలో నిలబెట్టారు. ముస్లింలు ఎటువైపు మొగ్గు చూపితే విజయం అటువైపే. ముస్లింలు మూకుమ్మడిగా ఓట్లు వేయరనీ, బీజేపీ అభ్యర్థిని ఏ పార్టీ అభ్యర్థి ఓడించగలరని స్థానిక ముస్లింలు భావిస్తారో ఆ అభ్యర్థికే వారు ఓటు వేస్తారనీ రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ముజఫర్‌నగర్, సహ్రాన్‌పూర్ మత కల హాలు ముస్లింలపై ప్రభావం చూపించాయి. ముస్లిం అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ముస్లిం అభ్యర్థులు కాకపోయినా బీజేపీని ఓడించే శక్తి కలిగిన వారికి ఓటు వేస్తారు పార్టీతో నిమిత్తం లేకుండా. ఉదాహరణకు మీరట్ జిల్లా సర్దానా నియోజకవర్గంలో నేను గతవారం పర్యటించినప్పుడు బీఎస్పీ అభ్యర్థి ఇమ్రాన్ ఖురేషీతో మాట్లాడాను. అక్కడ బీజేపీ అభ్యర్థి సందీప్ సోమ్. ముజఫర్‌నగర్ మతకలహాల కేసులో నిందితుడు. ఎస్పీ, ఆరెల్డీ అభ్యర్థులు ఉన్నప్పటికీ ఒకే ఒక ముస్లిం అభ్యర్థి ఇమ్రాన్. ముస్లింలూ, దళితులూ కలిసి ఆయనను గెలిపించే అవకాశం ఉంది. అలీగఢ్‌లో ముస్లింలూ, యాదవులూ కలిసి ఎస్పీ అభ్యర్థిని విజయపథంలో నడిపిస్తారు. తమ పార్టీ విభిన్నమైనదనీ, విలక్షణమైనదనీ బీజేపీ నాయకులు చెప్పుకుం టారు. కాంగ్రెస్ నెహ్రూ–గాంధీ కుటుంబానికి విధేయమైన పార్టీ. ఎస్పీ ములా యంసింగ్ పరివారానికి పెద్దపీట వేస్తుంది. మాయావతి నియంతలాగా బీఎస్ పీని నడుపుతారు. కానీ తమది కార్యకర్తల ప్రతిభాపాటవాలను గుర్తించి వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించే పార్టీ అని ఇంతవరకూ బీజేపీ నేతలు చెప్పు కొచ్చారు. కాలక్రమంలో కాంగ్రెస్ పార్టీ అవలక్షణాలు బీజేపీకి అంటుకున్నాయి. సోదరీసోదరులకూ, పిల్లలకూ టిక్కట్లు ఇవ్వాలంటూ ఇబ్బంది పెట్టవద్దని నరేంద్రమోదీ ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సహచరులకు విజ్ఞప్తి చేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రధాని మనోగతానికి భిన్నంగా చాలా మంది వరిష్ఠ నేతల బంధుమిత్రులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చారు. బాబ్రీని కూల్చిన ప్పుడు యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న కల్యాణ్‌సింగ్ ఇప్పుడు స్వయంగా గవర్నర్. ఆయన కుమారుడు పార్లమెంటు సభ్యుడు. కల్యాణ్‌సింగ్ మనవడికి పార్టీ టిక్కెట్టు ఇచ్చారు. దేశీయాంగమంత్రి రాజనాథ్సింగ్ కొడుకు పంకజ్‌కు పార్టీ టిక్కెట్టు ఇవ్వడం కోసం నాయిడాలో ప్రస్తుతం ఎంఎల్ఏగా ఉన్న విమలా బాతమ్కు మొండిచేయి చూపించారు. రాజనాథ్సింగ్ బంధువు నారాయణ్ సింగ్ రాణేకు ఉత్తరాఖండ్‌లో పార్టీ టిక్కెట్టు లభించింది. లలిత్ టాండన్ కుమా రుడు గోపాల్ టాండన్, బ్రహ్మదత్ ద్వివేదీ తనయుడు సునీల్‌దత్ ద్వివేదీ, బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ కుమారుడు ప్రతీక్శరణ్ సింగ్ తదితరులు మోదీ అభి మతానికి విరుద్ధంగా టిక్కెట్లు సంపాదించుకున్నారు. పక్కనే ఉత్తరాఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ కుమారుడు సౌరభ్, మరో మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరీ కుమార్తె రీటా పార్టీ అభ్యర్థులు. ఇది ఒక్కటే కాదు. సోషలిస్టు విధానాలను తూర్పారబట్టే బీజేపీ ఎన్నికలు లేని సమయంలో సబ్సి డీలకూ, రుణాల రద్దుకు వ్యతిరేకం అంటూ చాటుకుంటుంది. ఎన్నికల ప్రణాళి కలలో మాత్రం రైతు రుణాలు మాఫ్ చేస్తామంటూ గెలుపు మంత్రం వల్లిస్తుంది. ఆర్థిక విధానాలలో సైతం బీజేపీ విశిష్టత మిగలలేదు. అమిత్‌షా కసరత్తు అమిత్ షా అమితమైన తెలివితేటల వల్ల పార్టీ రెండిందాల చెడిన రేవడి చందంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కులాల చిత్రికబట్టి చక్రం తిప్పాలని ఆయన ఆకాంక్ష. ఆర్ఎస్ఎస్, బీజేపీలలో మొదట అగ్రవర్ణాల ఆధిక్యం ఉండేది. అడ్వాణీ రథయాత్ర సాగినప్పుడు యాదవేతర బీసీలు ఆ పార్టీని ఆదరించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, తదితర అగ్రకులాలవారు జనాభాలో దాదాపు 25 శాతం. బాబ్రీమసీదు పతనం తర్వాత బీజేపీ క్రమంగా అగ్రవర్ణాలకు దూర మైంది. బీసీలు కూడా పునరాలోచనలో పడ్డారు. అగ్రవర్ణాలు తమను అంటి పెట్టుకునే ఉంటాయన్న భరోసాతో అమిత్ షా యాదవేతర బీసీలనూ, జాతవే తర దళితులనూ దువ్వసాగారు. ఓబీసీలవైపు మొగ్గు పెరిగి అగ్రవర్ణాలు ఆగ్ర హించే పరిస్థితి వచ్చింది. ఓబీసీల మనసులను గెలుచుకునే లక్ష్యంతోనే ఆ వర్గానికి చెందిన ఫుల్పూర్ లోక్‌సభ సభ్యుడు కేశవ్ ప్రసాద్ మౌర్యను పార్టీ యూపీ శాఖ అధ్యక్షుడిగా నియమించారు. తూర్పు యూపీలో అగ్రవర్ణాలకు జెల్లకొట్టి బీసీలకు జైకొట్టడంతో అగ్రవర్ణ నాయకులు కొందరు పార్టీ నుంచి వైదొలిగారు. అస్సాంలో అరువు తెచ్చుకున్న నాయకులతో ఎన్నికలలో గెలిచినట్టే యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ అదే వ్యూహంతో విజయం సాధించాలని ప్రయత్నం. గత ఐదేళ్ళలో బీజేపీలో చేరినవారికి పెద్దపీట వెయ్యడం పార్టీ విధే యులకు మనస్తాపం కలిగించింది. దాదాపు 140 స్థానాలు ఫిరాయింపుదారు లకే కేటాయించడం విశేషం. ఇక బీజేపీ ప్రత్యేకత ఎక్కడ మిగిలింది? ఓబీసీల మద్దతు లభిస్తుందో లేదో తెలియదు కానీ అగ్రవర్ణాల అండదండలు మాత్రం బీజేపీకి మునపటివలె ఉండకపోవచ్చునని పరిశీలకులు అంటున్నారు. తేలని బీజేపీ సీఎం అభ్యర్థి ఎస్పీ, బీఎస్పీలలో ఏ పార్టీ విజయం సాధించినా ముఖ్యమంత్రి ఎవరో తెలుసు. బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. మౌర్య ముఖ్య మంత్రి అవుతారని ఇప్పుడు ప్రకటిస్తే అగ్రవర్ణాలకు చెందిన నాయకులూ, కార్యకర్తలూ చురుగ్గా పనిచేయరని భయం. మోదీని చూసి ఓటు వేయాలని బీజేపీ ప్రజలను కోరుతోంది. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదనే ఆగ్రహంతో గోరఖ్‌పూర్ పార్లమెంట్ సభ్యుడు మహంత్ యోగి ఆదిత్యనాథ్ తిరుగుబాటు చేసి పశ్చిమోత్తరప్రదేశ్లో పోటీ అభ్యర్థులను నిలిపారు. బీజేపీకి తిరుగుబాట్ల బెడద ఉంది. ఎస్పీకి ములాయం, శివపాల్ యాదవ్‌ల అలక వల్ల ఎంతోకొంత నష్టం జరుగుతుంది. మాయావతికి అసమ్మతి సెగ లేదు. ఆమె ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. బూత్ స్థాయి వరకూ కమిటీలను నియమించి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకొని ఉంటే గెలుపు ఆ కూటమిదే. 2019లో ఉపప్రధాని పదవి ఇస్తామనీ, పొత్తుకు అంగీకరించాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కబురు పెడితే మాయావతి ససేమిరా అన్నట్టు భోగట్టా. లక్నోలోనూ, ఆగ్రాలోనూ అఖిలేశ్, రాహుల్ ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు మంచి స్పందన కనిపించింది. ‘ఖాట్ పే చర్చా’, రైతులను పలకరించే యాత్ర విఫలమైన తర్వాత యూపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయరాదని రాహుల్‌గాంధీ తీసుకున్న సముచితమైన నిర్ణయం కారణంగా ఎస్పీతో పొత్తు సాధ్యమైంది. అఖిలేశ్‌తో మైత్రి ఫలితంగానేlఅతనికోసం వచ్చిన పెద్ద జనసమూహాలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రాహుల్‌కి దక్కింది. ఒంటరి పోరాటమైతే 2012లో వచ్చిన 28 సీట్లను నిలబెట్టుకోవడమే కాంగ్రెస్‌కు కష్టమయ్యేది. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కూడా 47 స్థానాలు మాత్రమే దక్కాయి. కానీ 2014 సార్వ త్రిక ఎన్నికలలో మోదీ ప్రభంజనం కారణంగా బీజేపీ స్థాయి అమాంతంగా పెరిగింది. అయిదేళ్ళ కిందట బీఎస్పీ 80 స్థానాలు కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తర్వాత రెండేళ్ళలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాదనీ, అప్పుడు యూపీ నుంచి 50 స్థానాలైనా గెలుచుకుంటే సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానమంత్రి కావచ్చుననే ఉద్దేశంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ కుమారుడు అఖిలేశ్‌ను గద్దె మీద కూర్చోబెట్టారు. ఏకులా వచ్చిన కొడుకు మేకు అవుతాడని ములాయం ఊహించి ఉండరు. 2014లో మోదీ పిడుగులాగా వచ్చి నెత్తిమీద పడతారని మాత్రం ఎవరు ఊహించారు? యూపీలో జరుగుతున్నది త్రిముఖ పోటీ. ఏ పార్టీ గెలుస్తుందో ఇప్పుడే చెప్పడం ఎవ్వరి తరం కాదు. ఎవరికి ఓటేసేదీ చెప్పమని అడిగితే గ్రామీణులు సైతం గుంభనంగా న వ్వుతారే కానీ మనసూ, నోరూ విప్పరు. అతిపెద్ద పక్షంగా ఏదో ఒక పార్టీ లేదా కూటమి వస్తుందన్న ఊహాగానాలు సైతం పూర్వపక్షం కావచ్చు. దేశప్రజలు ఎన్నికలలో స్పష్టమైన తీర్పు ఇవ్వడం అలవాటు చేసు కున్నారు. అదే ఆనవాయితీ పంజాబ్, గోవా, యూపీ, ఉత్తరాఖండ్‌లలోనూ కొన సాగుతుందని అంచనా. - కె. రామచంద్రమూర్తి -
ఇలాంటి ప్రభుత్వాలొస్తాయని రావిశాస్త్రి ఊహించలేదు
-
ఇలాంటి ప్రభుత్వాలొస్తాయని రావిశాస్త్రి ఊహించలేదు
సాక్షి, విశాఖపట్నం: ఉన్నదున్నట్టు, నిఖార్సుగా నిర్భయంగా రావిశాస్త్రిలా రాసే రచయితలు నేటి సమాజం, సాహితీ లోకం, పత్రికలు, టీవీల్లోనూ లేరని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. నేడు రావిశాస్త్రిలాంటి రచయితలుంటే అణువిద్యుత్ కేంద్రాలు ఏర్పాటయ్యేవి కావని, గోమాంసం తిన్నారని ముస్లింలను హత్య చేసే వికారపు ఘటనలపై స్పందించే వారన్నారు. ఆయన హయాంలో ఇలాంటివి లేవని, ఇలాంటి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయని, ఇలాంటి భావజాలం దేశంలో బలంగా వ్యాప్తిస్తుందని అప్పట్లో ఆయన ఊహించి ఉండరని చెప్పారు. శనివారం సాయంత్రం విశాఖ పౌరగ్రంథాలయంలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి 95వ జయంతి సందర్భంగా రావిశాస్త్ర్రి లిటరరీ ట్రస్టు ఆవిర్భావం, అవార్డు ప్రదానోత్సవ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో బోలెడంత ఘర్షణ జరుగుతున్నా పత్రికల్లో దానికి అద్దం పట్టేలా రాసేవారూ లేరని, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ రాసే అవకాశం లేదని పేర్కొన్నారు. షేక్స్పియర్ అంతటి గొప్ప రచయితలు మనకు లేకపోవచ్చు గాని తెలుగుసాహిత్యంలో అంతటి దిగ్గజాలున్నారన్నారు. నేటి తరం రచయితలు, సాహితీవేత్తలు రావిశాస్త్రిని స్ఫూర్తిని తీసుకోవాలని కోరారు. సాహిత్యంలోనూ, రాజకీయాల్లోనూ, సమాజంలోనూ గొప్ప సేవ చేసిన వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకునే సంప్రదాయం తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నీలం సంజీవరెడ్డి, చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, టంగుటూరి ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాథం వంటి మహనీయుల గురించి వారి కుటుంబాలు గాని, సమాజం గాని స్నేహితులు గాని తలచుకునే అవకాశం లేదన్నారు.అపర చాణక్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించిన ఎనిమిదేళ్ల వరకు ఆయన సంతాప సభ జరగలేదని గుర్తు చేశారు. మొదటి సంతాప సభను తానే నిర్వహించానని, ఆ సభకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హాజరయ్యారని చెప్పారు. పీవీతో తనకు బంధుత్వం లేకపోయినా సాన్నిహిత్యం ఉందన్నారు. ఆయన కుమారులకు సంతాప సభలు నిర్వహించే శక్తి, సామర్థ్యాలున్నా వారికా సంకల్పం లేదన్నారు. విశ్వనాథ సత్యనారాయణ జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ప్రయత్నాలు జరగలేదన్నారు. రావిశాస్త్రి గురించి అలాంటి ప్రయత్నాలు జరిగినందుకు, ఆయన పేరిట లిటరరీ ట్రస్టు ఏర్పాటు, అవార్డులివ్వడం వంటివి చేయడం అభినందనీయమని చెప్పారు. ఇలాగే తెలుగు భాషకు సేవచేసిన వారికి పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. ఒక భాషపై అధికారం సంపాదించిన వారికి ఇంకో భాషపై పట్టు సాధంచడం పెద్ద కష్టం కాదని పేర్కొన్నారు. రామతీర్థకు రావిశాస్త్రి అవార్డు ప్రదానం తొలుత రావిశాస్త్రి లిటరరీ ట్రస్టును రామచంద్రమూర్తి ప్రారంభించారు. అనంతరం రచయిత, కవి రామతీర్థకు రావిశాస్త్రి పేరిట నెలకొల్పిన తొలి అవార్డును ప్రదానం చేశారు. అనంతరం రావిసారాలు వ్యాస సంపుటిని, ఆంగ్లంలో రచించిన ’రాకంటూర్ రాచకొండ’ పొట్టి పిట్టకధల సంపుటిని ఆవిష్కరించారు. వేడుకగా జరిగిన ఈ సాíß తీ కార్యక్రమంలో ప్రజాకవి వంగపండు ప్రసాదరావు, ఆచార్య చందు సుబ్బారావు, రావిశాస్త్రి కుమారులు ప్రసాద్, ఉమాకుమారశాస్త్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎల్.ఆర్.స్వామి, రచయితలు జగద్ధాత్రి, శిబానంద కల్యాణ రామారావు, జయశీలరావు, డీవీ సూర్యారావు, పేరి రవికుమార్, మంగు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జై జవాన్ సరే, కిసాన్ సంగతేమిటి?
త్రికాలమ్ కొన్ని దృశ్యాలు ఎన్నటికీ మరపురావు. కొన్ని నినాదాలు దశాబ్దాలు దాటినా చెవులో మార్మోగుతూనే ఉంటాయి. తాష్కెంట్లో లాల్బహద్దూర్ శాస్త్రి శవ పేటికను సోవియట్ యూనియన్ ప్రధాని కోసిగిన్, పాకిస్తాన్ అధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ మోసుకొని నడుస్తున్న సన్నివేశం ఆ తరంవారిని కలచి వేస్తూనే ఉంటుంది. పాకిస్తాన్‌తో జరిగిన సరిహద్దు పోరాటం సందర్భంగా యుద్ధానికి జాతిని సమాయత్తం చేస్తూ నాటి ప్రధాని లాల్ బహద్దూర్ ప్రచారం చేసిన నినాదం ‘జై జవాన్, జై కిసాన్’ను 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ శక్తిమంతంగా వినియోగించుకున్నారు. శాస్త్రి 'జై జవాన్, జై కిసాన్'నినాదాన్ని యూపీఏ ప్రభుత్వం 'మర్ జవాన్, మర్ కిసాన్'గా ఆచరణలో మార్చివేసిందంటూ ఎద్దేవా చేశారు. సరిహద్దులో పాకి స్తాన్ కాల్పుల్లో మన జవాన్లు చనిపోతున్నా, గ్రామాలలో వ్యవసాయం గిట్టు బాటు కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా యూపీఏ సర్కార్‌కు చీమ కుట్టినట్టయినా లేదంటూ నిప్పులు చెరిగారు. అప్రతిహతంగా జరిగిన ప్రచార యాత్ర ఫలితంగా నరేంద్రమోదీ ప్రధాని పీఠం అలంకరించారు. అటు వంటిమోదీ హయాంలో సైతం సరిహద్దులో పాకిస్తాన్ సైనికులు కాల్పులు జర పడం, భారత జవాన్లు మరణించడం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్రమోదీ గ్రహించి ఉంటారు. కానీ జవాన్లకు మాత్రం పెద్ద ఉపకా రమే చేశారు. ఒకే ర్యాంకు మాజీ సైనికులకు ఒకే స్థాయి పింఛను (ఒన్ ర్యాంక్, ఒన్ పెన్షన్-ఓఆర్ఓపీ) కావాలంటూ నాలుగు దశాబ్దాలకు పైగా జవాన్లు పోరా టం చేస్తున్నారు. ఈ పథకాన్ని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే అమలుచేస్తానంటూ మోదీ ఎన్నికల వాగ్దానం చేశారు. మొన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి మాట్లాడినప్పుడు ఓఆర్ఓపీ ఖరారైనట్టేనంటూ ప్రకటించారు. వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. అయినా సరే, అప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఆందోళన చేస్తు న్న మాజీ సైనికులు పోరాటానికి స్వస్తి చెప్పలేదు. ఓఆర్ఓపీని ఆమోదిస్తున్న ట్టు రక్షణమంత్రి మనోహర్ పారికర్ ప్రకటించడంతో సుదీర్ఘ వివాదానికి తెరప డింది. ఈ చారిత్రక నిర్ణయం ఫలితంగా మాజీ సైనికులకు పింఛను, భద్రత పెరగడంతోపాటు ప్రస్తుతం సైన్యంలో ఉన్న జవాన్ల ఆత్మస్థయిర్యం పెరుగుతుంది. సైనికుల జీతాల సవరణకు నియమించిన మూడవ పే క మిషన్ నివేదిక ఆధారంగా ఓఆర్ఓపీ పథకాన్ని 1973లో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటి వరకూ సైనికులకు ఉద్యోగ విరమణ సమయంలో వస్తున్న జీతంలో 75 శాతం పింఛనుగా చెల్లించేవారు. దాన్ని 50 శాతానికి తగ్గించారు. మాజీ సైని కుల పింఛన్లలో వ్యత్యాసాలు పెంచే అన్యాయమైన విధానం ఇంతకాలం కొన సాగుతూ ఉంది. పదిహేను సంవత్సరాల కిందట ఒక ర్యాంకులో పదవీ విర మణ చేసిన అధికారి కంటే నిరుడు అదే ర్యాంకులో అంతేకాలం సర్వీసు చేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారికి ఎక్కువ పింఛను వస్తుంది. సైనికుల సగటు వయసు 30 సంవత్సరాల ప్రాంతంలో ఉండే విధంగా సైనికులలో 85 శాతం మందిని 35 నుంచి 37 సంవత్సరాల వయసులోనే ఉద్యోగం నుంచి విరమింప జేస్తారు. 40 నుంచి 54 ఏళ్లలోపు రిటైరయ్యేవారి శాతం 12 లేదా 13 ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 60 ఏళ్ల వరకూ ఉద్యోగం చేస్తారు. వారి ఉద్యోగ కాలంలో మూడు లేదా నాలుగు వేతన సవరణ సంఘాల సిఫార్సులు అమలు జరుగుతాయి. జవాన్ల ఉద్యోగ కాలంలో ఒకటి లేదా రెండు వేతన సంఘాలకు మించి ఉండవు. సైనికుల జీతంలో పింఛను శాతాన్ని 75 నుంచి 50 శాతానికి తగ్గించిన ప్రభుత్వం కాలక్రమేణా ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో పింఛను శాతాన్ని 33 నుంచి 50కి పెంచింది. కోటి ఓట్లు నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఓఆర్ఓపీ పథకం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికల సమయంలో మాజీ సైనికులను నిర్లక్ష్యం చేయ డం నష్టదాయకమని రెండు ప్రధాన పార్టీలకూ తెలుసు. మాజీ సైనికులు దాదాపు పాతిక లక్షల మంది ఉంటే, యుద్ధంలో మరణించిన సైనికుల భార్య లూ, భర్తల ఉద్యోగ విరమణ తర్వాత వితంతువులైనవారూ ఆరు లక్షల మంది ఉంటారని అంచనా. మొత్తం మాజీ సైనికుల కుటుంబాలలో కోటిమంది దాకా ఓటర్లు ఉంటారు. ఈ ఓటర్లను ఆకట్టుకోవడానికైనా ఓఆర్ఓపీ అమలు చేస్తా మంటూ రెండు పార్టీలూ వాగ్దానం చేసి ఉంటాయి. నరేంద్రమోదీ అధికారం లోకి వచ్చిన తర్వాత మాజీ సైనికులు పదమూడు మాసాలు వేచి చూశారు. పత కాలను వాపసు ఇవ్వడం, రక్షణ మంత్రి సమావేశాలను బహిష్కరించడం వంటి నిరసన ప్రదర్శనలు చేశారు. అప్పటికీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసు కోకపోవడంతో మాజీ సైనికులు తమ డిమాండ్ల సాధనకోసం ప్రత్యక్ష పోరాటం ప్రారంభించారు. రిలే నిరాహార దీక్షలు సాగించారు. ఇద్దరు మాజీ సైనికాధికారులు నిరవధిక నిరాహార దీక్ష మొదలు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పుతోంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ముంచుకొస్తున్న దశలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్‌తో 1965నాటి సరిహద్దు పోరాటం ముగిసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారంనాడు మాజీ జవాన్లకు పారికర్ శుభవార్త వినిపించారు. ఓఆర్ఓపీ పథకం అమలు చేయాలంటే అదనంగా 8,000 కోట్ల పైచిలుకు ఖర్చు అవుతుందనీ, ఇది ఏటా పెరుగుతూ పోతుందనీ రక్షణ మంత్రి వివరిం చారు. ఈ నిర్ణయం 2014 జూలై ఒకటి నుంచి అమలులోకి వస్తుందనీ, అప్పటి నుంచీ రావలసిన బకాయిలను నాలుగు అర్ధసంవత్సరం వాయిదాలలో చెల్లి స్తామనీ, వితంతువులకు మాత్రం ఒకే విడతలో పూర్తి మొత్తం ఇస్తామనీ పారికర్ చెప్పారు. 2013 నాటి వేతనాలను ప్రాతిపదికగా తీసుకొని సగటు వేతనాన్ని నిర్ణయించి పింఛను ఖరారు చేస్తారు. ర్యాంకూ, సర్వీసూ (పని చేసిన సంవత్సరాలూ) సమానంగా ఉంటూ ఉద్యోగ విరమణ చేసినవారందరికీ ఒకే రకమైన పింఛను నిర్ణయిస్తారు, ఉద్యోగ విరమణ తేదీతో నిమిత్తం లేకుండా. పింఛను బకాయీల మొత్తం చెల్లించాలంటే పది నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా. పెద్ద భారాన్నే ఎన్డీఏ ప్రభుత్వం నెత్తికి ఎత్తుకుంది. ఓఆర్ఓపీ పథకాన్ని ఆమోదించడంతో పాటు తక్కిన డిమాండ్లను కూడా అంగీకరించాలంటూ ఉద్యమ నాయకులు పట్టుబట్టారు. రక్షణ మం త్రితో సమాలోచనల తర్వాత స్వచ్ఛంద ఉద్యోగ విరమణపైన స్పష్టత వచ్చింది. ఇతర అంశాలపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా ఒక న్యాయమూర్తి నాయకత్వంలో ఏకసభ్య సంఘం ద్వారా ఆరు మాసాలు అధ్యయనం జరిపిస్తా మనీ, ఆ సంఘం సిఫార్సుల ప్రాతిపదికపైన అంతిమ నిర్ణయం తీసుకుంటా మని రక్షణమంత్రి చెప్పడం తమకు ఆశాభంగం కలిగించినట్టు మాజీ సైనికుల ఉద్యమ నాయకుడు మేజర్ జనరల్ (రిటైర్డ్) సత్బీర్ సింగ్ ప్రకటించారు. మోదీ చేసిన ఉపకారం చిన్న సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయినప్పటికీ దశాబ్దాలుగా కొరుకు డుపడని ప్రధానమైన సమస్యను పరిష్కరించడంలో విజయం సాధించడాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సగర్వంగా చాటుకోవడం సహజం. పారికర్ నిరాడంబరం గా ప్రకటన చేసినప్పటికీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పూర్తి స్థాయిలో ప్రధాని మోదీని అభినందించారు. మొత్తం ఖ్యాతి ఎన్డీఏ సర్కార్‌కు ఎక్కడ పోతుందో నని మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తెరమీదికి వచ్చారు. ఓఆర్ఓపీ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నీరుగార్చిందంటూ విమర్శించారు. పదేళ్ల యూపీఏ పాల నలో మాజీ సైనికుల పింఛన్ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు మూడుసార్లు పింఛన్లను పెంచామనీ, 2014 ఫిబ్రవరిలో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన అనామతు బడ్జెట్లో ఓఆర్ ఓపీ పథకంకోసం 500 కోట్ల రూపాయలు కేటాయించారనీ, అవసరమైతే కేటాయింపులు పెంచుతా మని కూడా చెప్పారనీ ఆంటోనీ గుర్తు చేశారు. 2014-15 నుంచి ఓఆర్ఓపీని అమలు చేయాలని యూపీఏ కృతనిశ్చయంతో ఉన్నదని కూడా అన్నారు. ఆ అవకాశం ప్రజలు యూపీఏకి ఇవ్వలేదు. అవకాశం ఇచ్చిన పదేళ్లలో ప్రవేశ పెట్టిన పది బడ్జెట్లలో ఓఆర్ఓపీ పథకం కోసం నిధులు కేటాయించలేదు. పైగా 2008లో ఆరవ వేతన సంఘం ఓఆర్ఓపీ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదంటూ కుండబద్దలు కొట్టింది. ఓఆర్ఓపీ అమలులో కొంత కీర్తిని దక్కించు కోవాలని కాంగ్రెస్ తాపత్రయ పడినా వాస్తవాలు సహకరించే విధంగా లేవు. ఓఆర్ఓపీ పథకాన్ని అమలు చేయాలన్న ప్రయత్నం యూపీఏ నిజాయితీగా చేసి ఉంటే అందుకోసం అనామతు కేటాయింపులు 500 కోట్ల రూపాయలతో సరిపుచ్చేది కాదంటూ అమిత్ షా తప్పుపట్టారు. ఆ మాటకు వస్తే 2015-16 బడ్జెట్ ప్రతిపాదనలలో ఎన్డీఏ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేటాయించింది కూడా వెయ్యి కోట్ల రూపాయలే. పూర్తి బడ్జెట్లో ప్రత్యేకించిన వెయ్యి కోట్లకూ, ఇప్పుడు రక్షణ మంత్రి అంచనా వేస్తున్న 8,300 కోట్లకూ మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. వాస్తవం ఏమంటే ఇటీవలి వరకూ ఆర్థిక మంత్రి కానీ, రక్షణ మంత్రి కానీ, రక్షణశాఖ కార్యదర్శి కానీ ఓఆర్ఓపీ పథకం అమలు చేయవలసి వస్తే వాస్తవం గా ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయలేదు. ఆ పని మోదీ ప్రధాని అయిన కొన్ని మాసాల తర్వాతే ప్రారంభమైంది. పింఛన్లను సంవత్సరానికి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి సవరించాలన్న మాజీ సైనికుల కోర్కెను ప్రభుత్వం మన్నించలేదు. ఏటా సవరించడం ప్రపంచంలో ఎక్కడా లేదని అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. ఐదేళ్లకు ఒకసారి సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్య జటిలమైనది కనుక కొంత జాప్యం జరిగినప్పటికీ మాజీ సైనికులకు మేలు చేయాలన్న సంకల్పం నెరవేరింది. చాలాకాలంగా మాజీ జవాన్లనూ, మాజీ సైనికాధికారులనూ వేధిస్తున్న సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించి నందుకు నరేంద్రమోదీనీ, మనోహర్ పారికర్నీ, ఎన్డీఏ ప్రభుత్వాన్నీ బేషర తుగా అభినందించాలి. జవాన్ల పింఛన్ల సమస్య పరిష్కరించారు, సంతోషం. మరి కిసాన్ల మాటే మిటి? విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే కాకుండా పంజాబ్, హరియా ణా వంటి హరిత విప్లవం సాధించిన సంపన్న రాష్ట్రాలలో సైతం రైతులు అప్పు ల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయాన్ని గిట్టుబా టు వ్యాసంగం చేయడంపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి సమగ్ర వ్యవ సాయ విధానాన్ని రూపొందించకపోతే మోదీ విజయం పాక్షికమే అవుతుంది. - కె.రామచంద్రమూర్తి -
జువైనల్‌హోం నుంచి బాలుడు పరార్
సైదాబాద్(హైదరాబాద్): రాష్ట్ర బాలుర సంస్కరణల, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సైదాబాద్‌లో కొనసాగుతున్న బాలుర పరిశీలన గృహం నుంచి ఓ బాలుడు తప్పించుకున్నాడు. ఈ సంఘటన గత ఆదివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం బూర్లపాడుకు చెందిన ఓ బాలుడు(16) ఘర్షణలో పాల్గొన్నందుకు గాను అక్కడి పోలీసులు సైదాబాద్ జువైనల్‌హోంకు అప్పగించారు. కాగా, గత నెల 30న పరిశీలన గృహం బాలురు భోజనం చేయడానికి గాను ఆవరణలోకి వచ్చారు. ఆ సమయంలో అదను చూసుకుని సదరు బాలుడు అక్కడి గోడ దూకి పరారయ్యాడు. దీనిపై పరిశీలన గృహం సూపరింటెండెంట్ రామచంద్రమూర్తి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర బాలుర సంస్కరణల, సంక్షేమశాఖ విచారణ చేపట్టింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు.