కాంగి‘రేసు’ మల్లగుల్లాలు! | Congress Party Serious Jubilee Hills Assembly by-election | Sakshi
Sakshi News home page

కాంగి‘రేసు’ మల్లగుల్లాలు!

Sep 8 2025 10:35 AM | Updated on Sep 8 2025 10:35 AM

Congress Party Serious Jubilee Hills Assembly by-election

బీసీ కార్డు ప్రయోగానికి సిద్ధం

తలనొప్పిగా మారిన స్థానిక కుమ్ములాటలు 

ప్రత్యర్థుల ఊహకందకుండా వ్యూహాత్మక అడుగులు

సాక్షి, హైదరబాద్‌: అధికార కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక అభ్యర్థిత్వం ఖరారుపై మల్లగుల్లాలు పడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఉపఎన్నిక కావడంతో సీరియస్‌గా తీసుకొని ప్రతి అడుగూ ఆచితూచి వేస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కంటే ముందుగానే గెలుపు మార్గాలను సుగమం చేసుకునేందుకు ముగ్గురు మంత్రులు, 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లను రంగంలోకి దింపి అభివృద్ధి మంత్రం జపిస్తోంది. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను గమనిస్తూ వారి ఊహలకు అందని విధంగా పావులు కదుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదేస్థానంలో పోటీ చేసి ఓటమి పాలైన భారత క్రికెట్‌ జట్టు మాజీ కెపె్టన్‌ అజారుద్దీన్‌న్‌ తిరిగి బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబర్చారు. అయితే మైనారిటీ అభ్యరి్థని బరిలోకి దింపితే హిందూత్వ ఎజెండాతో బీజేపీ బలపడే ప్రమాదం ఉందని భావించి టికెట్‌ రేసు నుంచి ఆయనను తప్పించి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసింది.

మైనారిటీయేతర అభ్యర్థిని బరిలో నిలిపేందుకు సిద్ధమైంది. ఇటీవల హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‘స్థానిక’అభ్యరి్థత్వాన్ని పరిశీలిస్తామని ప్రకటించి పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు. అయితే తాజాగా పారీ్టలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు, కొత్త, పాత కేడర్‌ మధ్య ఆధిపత్య  పోరు, అమాత్యుల ముందే అమీతుమీలకు దిగడం వంటి వ్యవహారాలు గుదిబండగా తయారయ్యాయి. టికెట్‌ రేసులో ఉన్న స్థానిక ఆశావహులు కూడా కేవలం మంత్రుల పర్యటన కార్యక్రమాలకే పరిమితమై ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించినట్లు కనిపిస్తోంది. దీంతో అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో స్థానికత అంశంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. 

బీసీ అభ్యర్థిత్వం వైపు మొగ్గు  
కాంగ్రెస్‌ పార్టీ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తాజాగా అసెంబ్లీలో తీసుకున్న బీసీ రిజర్వేషన్‌ పెంపు నిర్ణయం పార్టీకి కలిసి వచ్చి ఉపఎన్నికల్లో లబ్ధి చేకూర్చే విధంగా బీసీ అభ్యరి్థత్వాన్ని పరిశీలిస్తోంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో విజయబావుట ఎగరవేయడమే లక్ష్యంగా గెలుపుగుర్రం అన్వేషణలో పడింది. ఒకవైపు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఏకరవు పెడుతూ అన్నివర్గాల ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు బలమైన బీసీ అభ్యర్థిని బరిలో దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువనేత నవీన్‌ యాదవ్, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యా దవ్, విద్యావేత్త భవానీశంకర్‌ తదితరులు ఆసక్తి కనబర్చుతున్నారు. వారి ఆరి్థక బలాబలాలు, రాజకీయ, కుటుంబ నేపథ్యం, ప్రజల్లో వారిపై గల పలుకుబడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యరి్థత్వాన్ని పరిశీలిస్తోంది.  

అందరికీ అమోదయోగ్యంగా.. 
అందరికీ ఆమోదయోగ్యమైన, బలమైన అభ్యర్థి పేరును పరిశీలించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. నియోజకవర్గంలో గెలుపు, ఓటములకు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు, నివసించే పలు కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు కీలకమే. ఈ ప్రాంతాల ఓటర్లు సైతం ఆమోదించే అభ్యరి్థని రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ అధిష్టానం ఈ ప్రాంతాల్లో పలువురి అభ్యరి్థత్వాలపై సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది.  

  • ఆశల పల్లకిలో... 
     అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన నవయువ నిర్మాణ సంస్థ వ్యవస్థాపక చైర్మన్, యువనేత నవీన్‌ యాదవ్‌ టికెట్‌ తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. అగ్రనేతల నుంచి గ్రీన్‌  సిగ్నల్‌ ఉన్నట్లు ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో రెండుసార్లు పోటీ చేసిన అనుభవం, స్థానిక పరిచయాలు కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నారు. 

  • పార్టీ అధిష్టానం బీసీ అభ్యర్థత్వాన్ని పరిశీలిస్తుండటంతో జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌  టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఐదేళ్లపాటు మేయర్‌గా సమర్థవంతంగా అందించిన సేవలు, నియోజకవర్గంలోని అన్ని వర్గాలతో ఉన్న పరిచయాలు తన అభ్యరి్థత్వం పరిశీలనకు బలం చేకూర్చవచ్చని ఆయన భావిస్తున్నారు. 

  • మాజీ ఎంపీ అంజన్‌  కుమార్‌ యాదవ్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకొని నియోజకవర్గంలో సుడిగాలిలా పర్యటిస్తున్నారు. రెండు పర్యాయాలు సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన నేపథ్యంలో అసెంబ్లీ సెగ్మెంట్‌లోని పరిచయాలు, పదేళ్లపాటు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అభ్యరి్థత్వం పరిశీలనకు కలిసి రావచ్చని ఆయన ఆశలు పెట్టుకున్నారు. 

  • దివంగత నేత పీజేఆర్‌ శిష్యుడు, విద్యావేత్త భవానీశంకర్‌ కాంగ్రెస్‌ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. దశాబ్దాల కాలంగా పారీ్టకి అంకితభావంతో సేవలందిస్తున్నందున స్థానికులకు టికెట్‌ ఇవ్వదల్చుకుంటే తన పేరు పరిశీలించవచ్చని భావిస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో పట్టు, కేబుల్‌ నెట్‌వర్క్, విద్యాసంస్థల కారణంగా పరిచయాలు మరింత కలిసి వచ్చే అంశాలుగా ఆయన భావిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement