రాష్ట్ర బీజేపీలో పూర్తిగా మార్పులు చేర్పులు
రాష్ట్ర బీజేపీ నేతలకు రెండేసి గవర్నర్ పోస్టులు, కేంద్ర మంత్రి పదవులు ?
నేడు జరిగే కేంద్ర కేబినెట్ భేటీనే చివరిది కావొచ్చుననే ఊహాగానాలు
అందుకే సహాయమంత్రులతో సహా అందరికీ పిలుపు
బండి సంజయ్ కొడుకుపై పోక్సోకేసు నేపథ్యంలో కేబినెట్ నుంచి తప్పిస్తారా అన్న చర్చ
ఢిల్లీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు పిలుపు.. అత్యవసరంగా హస్తినకు...
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఈ ప్రశ్నకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. త్వరలోనే కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగనున్నట్టు జాతీయ పార్టీ వర్గాల సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేసి తెలంగాణ గడ్డ మీద కచ్చితంగా కాషాయజెండా ఎగురవేసే దిశగా బీజేపీ హైకమాండ్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మూడునాలుగు నెలలకు ఒకసారి జరిగే పూర్తిస్థాయి కేంద్ర కేబినెట్ భేటీ–కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ (స్వతంత్ర మంత్రులు, సహాయ మంత్రులతో సహా) గురువారం జరగనుంది. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులుచేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం 72 మందితో కేబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కు సంబంధించి ఇదే చివరి సమావేశం కావొచ్చునని కూడా రాజకీయంగా ఊహాగానాలు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పుచేర్పులలో తెలంగాణకు పెద్దపీట వేసే అవకాశాలున్నాయి. పైగా తెలంగాణలో పార్టీ వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా జాతీయ నాయకత్వం తన చేతుల్లోకి తీసుకోనుంది. ఢిల్లీ నుంచే వ్యవహారాలు నడిచేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు పార్టీ నాయకుల సమాచారం.
2029 ఎన్నికల నేపథ్యంలో... తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటి లక్ష్యసాధనకు ఇప్పటి నుంచే సిద్ధం అయ్యేందుకు కొత్త టీమ్‌ను సిద్ధం చేసుకోవాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలకు రెండు గవర్నర్ పదవులతోపాటు కేంద్ర కేబినెట్ మార్పుచేర్పులలో రెండు కేంద్ర మంత్రి పదవులు లభించే అవకాశాలున్నాయని తెలిసింది.
మంత్రి పదవులు దక్కని వారికి జాతీయ కార్యవర్గం, కమిటీల్లో అవకాశం, పలువురికి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల డైరెక్టర్ పోస్టులు, ఆయా కేంద్ర బోర్డులలో సభ్యులు, ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కొచ్చొనని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోశ్‌కు ప్రతిపాదనలు చేరినట్టు సమాచారం.
పార్టీకి సంబంధించిన అన్ని కమిటీల్లో యువతను ప్రాధాన్యం కల్పించి చురుకుగా, ప్రభావవంతంగా కార్యక్రమాలు చేపట్టే దిశలో ముందుకు సాగాలని భావిస్తున్నట్టు తెలిసింది. బండి భగీరథ్‌పై పోక్సోకేసు నమోదుతో బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి తప్పిస్తారా అన్న దానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ రకమైన ప్రచారం పార్టీపై, నేతలపై ఏ మేరకు ప్రతికూల ప్రభావం చూపుతుందనే దానిపై పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చకు కూడా ప్రాధాన్యం ఏర్పడింది.
రాంచందర్‌రావుకు ఢిల్లీ పిలుపు
జాతీయస్థాయిలో చోటుచేసుకోనున్న పరిణామాలకు సూచనగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఢిల్లీ నుంచి పిలుపురాగా, బుధవారం అత్యవసరంగా ఆయన హస్తినకు వెళ్లారు. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, భగీరథ్‌పై వచ్చిన ఆరోపణలు, ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అనంతరం రాష్ట్రంలో, పార్టీలో చోటుచేసుకున్న మార్పుచేర్పులు, దాని ప్రభావం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకంగా, పార్టీపరంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలపై రాంచందర్‌రావు నివేదికలు సమరి్పంచినట్టుగా తెలిసింది. దీనికి అనుగుణంగా జాతీయ నాయకత్వం కూడా తగిన చర్యలు చేపట్టొచ్చని తెలుస్తోంది.


