
గోదావరి తీర గ్రామాల్లో రంగుల రాళ్ల సేకరణ
ఇంట్లో ఉంటే శుభసూచకమని విశ్వాసం
కోరుట్ల: ఎక్కడైనా... ఎవరైనా గోదావరి తీరానికి వెళ్లడం సర్వసాధారణమే.. కానీ అక్కడి తీర గ్రామాల ప్రజల దృష్టి వేరేగా ఉంటుంది. ఇసుక తిన్నెల్లో దొరికే గంగరాళ్లను సేకరిస్తారు. పూజ గదుల్లో భద్రపరుస్తారు. ఇంట్లో అవి ఉంటే శుభప్రదమని విశ్వసిస్తారు. గోదావరి తీరానికి మొక్కులు, శుభకార్యాల కోసం వెళ్లిన ప్రతీ ఒక్కరు రంగురంగుల గంగరాళ్లపై దృష్టి పెడతారంటే అతిశయోక్తి కాదు.
జగిత్యాల జిల్లాలో ఇబ్రహీంపట్నం నుంచి ధర్మపురి మండలం రాయపట్నం వరకు సుమారు 90 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో సుమారు 28 గ్రామాల వరకు ఉన్నాయి. ఈ గ్రామాల్లోనే కాదు.. చుట్టుపక్కల ఉన్న పట్టణ ప్రాంతాల్లోనూ గంగరాళ్ల సెంటిమెంట్ ఉంటుంది.
శుభకార్యాలతో ముడిపడి..
నీటితోనే మనిషి మనుగడ.. జలం జాడలున్న చోటే జనం అవాసాలు ఏర్పాటు చేసుకోవడం సాధారణం. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చే గోదావరి నది.. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల వెంబడి ప్రవహిస్తుంది. ఈ ప్రాంతవాసులు గోదావరి గంగ అని పిలుచుకుంటారు.
ప్రతీ శుభకార్యానికి గోదావరి నదికి వెళ్లి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి వారి సంప్రదాయం. పుట్టువెంట్రుకలు, గర్భిణులకు గంగ తెప్పలు, పౌర్ణమి పుణ్యస్నానాలు, గంగ మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా.. పితృదేవతలకు పిండాలు పెట్టడం, ఎవరైనా చనిపోతే.. ఆ వెంటనే గంగస్నానాలు చేయడం వంటి కార్యక్రమాలను గోదావరి తీరంలోనే చేస్తుంటారు. ఈ క్రమంలో గోదావరి (గంగ)తో ఇక్కడి ప్రాంతవాసుల జీవనశైలి, ఆచార వ్యవహారాలతో విడదీయరాని బంధం ఉంది.
గంగరాళ్ల సెంటిమెంట్
గంగ తీరంలో శుభకార్యాల కోసం బంధు మిత్రులతో కలిసి వెళ్లిన వారు పుణ్యస్నానాలు ముగించుకుని ఇక్కడి ఇసుకలో దొరికే రంగు రంగుల గంగరాళ్ల కోసం వెతకడం కనిపిస్తుంది. వీటిని పెద్దవాళ్లు శుభసూచకంగా భావిస్తే.. చిన్నపిల్లలు ఆట వస్తువులుగా.. గంగరాళ్లను సేకరిస్తారు. గంగ నీటి ప్రవాహంలో వందలాది కిలోమీటర్ల దూరం కొట్టుకువచ్చిన ఈ రాళ్లు.. విభిన్నమైన ఆకృతుల్లో, రంగుల్లో ఉంటాయి. దీంతో వీటిని ఇష్టంగా ఇంటికి తీసుకెళ్తారు.
ఇలా తీసుకువచ్చిన గంగరాళ్లను వ్యాపారులు తమకు శుభాలు కలగాలని కౌంటర్ టేబుల్‌పై పేపర్‌వెయిట్‌గా ఉపయోగిస్తారు. చిన్నగా ఉండి లింగాకారంలో ఉండే రంగురాళ్లను శివునికి ప్రతీకగా పూజ గదుల్లో ఉంచుతారు. మరికొంతమంది గంగరాళ్లను దేవుడి గది ముందు ఉంచుతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగినపుడు అదే రాయిపై కొబ్బరికాయలు కొట్టి దేవుళ్లకు అభిషేకం చేస్తుంటారు. మరికొంతమంది ఈ రంగురాళ్లను నీళ్లజాడీలో ఉంచి అలంకరణ కోసం వాడతారు. ఇలా ఈ ప్రాంత జనంలో గంగరాళ్ల సెంటిమెంట్ అనాదిగా కొనసాగుతోంది.
బెల్లం రంగు రాళ్లు ఇష్టం
గంగరాళ్లు అంటే నాకు చాలా ఇష్టం. వాటిలో బెల్లం రంగులో ఉండే రాళ్లు బాగుంటాయి. ఎప్పుడు గోదావరి తీరానికి వెళ్లినా అలాంటి రాళ్లను వెతికి తెచ్చుకుంటాను. ను న్నటి పెద్ద గంగరాయి దొరికితే.. దాన్ని పూజ గదిలో ఉంచుకుంటాం. ఇంట్లో శుభకార్యాలు, దేవునికి పూజలు చేసే సమయాల్లో కొబ్బరి కాయలు కొట్టడానికి వాడతాం.
– కంటాల అనితదేవి, కోరుట్ల
వ్యాపారం బావుండాలని..
వ్యాపారులు గంగరాళ్లను కౌంటర్ టేబుల్‌పై పెట్టుకుంటారు. దీన్ని ఒకవైపు పేపర్‌వెయిట్‌గా.. మరోవైపు వ్యాపారాల్లో లాభాలు తెచ్చే శుభసూచకంగా వినియోగి స్తారు. మా పిల్లలు గంగకు వెళ్లినప్పుడు ఆసక్తిగా ఇసుకలో రంగురాళ్లను వెతికి తెచ్చుకుని ఆటపాటల్లో వినియోగిస్తారు. – చిద్రాల వినోద్, వ్యాపారి, కోరుట్ల