రాజుకు కాగ్నాటివ్‌ బిహేవియర్‌ థెరపీ | Sakshi
Sakshi News home page

రాజుకు కాగ్నాటివ్‌ బిహేవియర్‌ థెరపీ

Published Sat, Dec 17 2022 9:48 AM

Cognitive Behavior Therapy For Raju - Sakshi

కామారెడ్డి టౌన్‌: గుట్టపైకెళ్లి ప్రమాదవశాత్తు బండరాళ్ల కింద ఇరుక్కుపోయి సురక్షితంగా బయటపడిన రాజు పూర్తిగా కోలుకున్నాడని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజు మానసిక ఆరోగ్యం మెరుగుపరచడానికి శుక్రవారం కౌన్సెలింగ్‌తోపాటు కాగ్నాటివ్‌ బిహేవియర్‌ థెరపీని మానసిక వైద్య నిపుణులు, జిల్లా మెంటల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి.రమణ  అందించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు వన్యప్రాణుల వేటకు వెళ్లి మాచారెడ్డి మండలం సింగరాయిపల్లి అడవిలోని ఓ గుట్టపైనున్న బండరాళ్ల కింద మంగళవారం ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే.

రెండ్రోజులు నరకయాతన అనుభవించాడు. సహాయక బృందం బండరాళ్లను పగులగొట్టి రాజును సురక్షితంగా బయటకు తీసి గురువారం కామారెడ్డి జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించింది. ఈ సందర్భంగా రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ కొన్నిగంటలపాటు తలకిందులుగా ఉండటం, రాళ్లు బరుసుగా ఉండటంతో కాళ్లు, చేతులు రాపిడికి గురై గాయాలయ్యాయని చెప్పాడు. తొడభాగంలో కాస్త పెద్ద గాయమైందని, ఒళ్లునొప్పులతో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నాడు.

రాజును శనివారం డిస్‌చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. జీవితంలో తీవ్రమైన బాధ కలిగించిన ఘటనలు, ప్రతికూల పరిస్థితుల(రేప్, పెద్ద ప్రమాదం, అగ్నిప్రమాదం)ను ఎదుర్కొన్నవారు మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని, ఆ భయంకరమైన జ్ఞాపకాల నుంచి బయటకురాలేక చాలామంది మానసికంగా కుంగిపోతుంటారని వైద్యులు తెలిపారు. సాధారణ వైద్యంతోపాటు కాగ్నాటివ్‌ బిహేవియర్‌ థెరపీ ద్వారా ఇలాంటివారిని సాధారణస్థితికి తీసుకురావచ్చన్నారు. రాజుతోపాటు కుటుంబసభ్యులకు కూడా కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రాం సామాజిక కార్యకర్త డాక్టర్‌ విరాహుల్‌ కుమార్, డ్యూటీ డాక్టర్‌ కాళిదాసు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement