
విద్యా విధానం ఖరారుకు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
సరికొత్త విద్యా విధానాన్ని తీసుకొద్దాం
ఈ విధానం వచ్చే 25 ఏళ్ల వరకు దిశా నిర్దేశం చేసేలా ఉండాలి
తెలంగాణ విద్యా విధానం ఖరారు కమిటీ సమావేశంలో సీఎం రేవంత్
భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో బోధన సాగాలి
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కల్పించాలి
నిరుపేదలకు మేలు జరగాలి.. అందరికీ సమాన అవకాశాలు ఉండాలి
మేధావులు, విద్యావేత్తలు ఈ మేరకు సలహాలివ్వాలన్న ముఖ్యమంత్రి
మౌలిక వసతులపై ఖర్చుకు ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా విధానంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. సరికొత్త తెలంగాణ విద్యా విధానం తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన అని వెల్లడించారు. ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉన్న వారిలో జ్ఞానం కొరవడిందని, జ్ఞానం ఉన్న వారికి భాషలో పట్టు లేదని అన్నారు. ఈ రెండూ ఉన్న వారిలో నైపుణ్యం ఉండటం లేదని చెప్పారు. దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, ఆ స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగవ్వడం లేదని చెప్పారు. ఈ కారణంగా ఉద్యోగాలను సొంతం చేసుకోవడంలో యువత వెనుకబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో విద్యా బోధన సాగాలని, వచ్చే 25 ఏళ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించనున్న ‘తెలంగాణ రైజింగ్–2047’లో తెలంగాణ విద్యా విధానానికి చోటు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు నేతృత్వంలో రాష్ట్ర విద్యా విధానం ఖరారుకు ఏర్పాటు చేసిన కమిటీతో బుధవారం సీఎం భేటీ అయ్యారు. విద్యావేత్తలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించారు.
అన్ని స్థాయిల్లో ప్రక్షాళన
‘విద్యా రంగం అభివృద్ధికి ఇప్పటివరకు జరిగిన కృషిపై ఏమాత్రం సంతృప్తి లేదు. ఈ రంగానికి భారీఎత్తున నిధులు కేటాయిస్తున్నా ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీతో ప్రారంభిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ప్రారంభమవుతున్నాయి. నర్సరీకి ప్రైవేటు పాఠశాలల్లో చేరిన వారు తిరిగి ప్రభుత్వ పాఠశాలల వైపు చూడటం లేదు.
విద్యార్థుల రాకపోకలకు వీలుగా ఉంటుందని, తగిన శ్రద్ధ చూపుతారనే కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకూ ప్రక్షాళన అవసరం. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ విద్యా విధానం రూపకల్పనలో ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు.
అత్యుత్తమ డాక్యుమెంట్ రూపొందించాలి
‘ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక, నైపుణ్య విద్యలుగా విభజించుకోవాలి. విద్యావేత్తలు తమ అభిరుచులకు అనుగుణంగా సబ్ కమిటీలుగా ఏర్పడి అత్యుత్తమ డాక్యుమెంట్ రూపొందించాలి. రాష్ట్రంలోని నిరుపేదలకు మేలు జరిగేలా కొత్త విద్యా విధానం ఉండేందుకు మేధావులు సలహాలివ్వాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల పేరిట విద్యార్థులను చిన్నతనం నుంచే వేరు చేస్తున్నాం. దానిని రూపుమాపి అంతా ఒకటే అనే భావన కలిగించాలి. విద్యాలయాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఆశించిన స్థాయిలో తెలంగాణ విద్యా విధానం అమలయ్యేందుకు వివిధ ఫౌండేషన్లు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలి..’ అని సీఎం చెప్పారు.
నిధులు ఎంతైనా వెనుకాడం
‘ప్రభుత్వం కూడా ఈ దిశగా కృషి చేస్తోంది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా టీచర్లు ఉండాలన్న లక్ష్యంతోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాం. బదిలీలు, పదోన్నతులు కల్పించాం. యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. దేశంలో ఐటీఐలు ప్రారంభించినప్పుడు ఉన్న డీజిల్ ఇంజిన్ మెకానిక్, ఫిట్టర్ వంటి సంప్రదాయ కోర్సులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మేము అధికారంలోకి వచ్చాక ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సులను తెచ్చాం.
సరికొత్త విద్యా విధానం ఏర్పాటుకు ఎంత నిధులైనా వెనుకాడబోం. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి, మౌలిక వసతులు, ప్రమాణాల మెరుగుకు ఖర్చు చేయాలని నిర్ణయించాం. విద్యపై చేసే వ్యయాన్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నాం. విద్యా విధానంలో సిలబస్ రూపకల్పన, వనరుల సమీకరణ, విధానం అమలుపై స్పష్టత అవసరం..’ అని రేవంత్ అన్నారు.
విద్యార్థి కేంద్రంగా బోధన ఉండాలి
‘విద్యా విధానం కమిటీ చైర్మన్ కె.కేశవరావు మాట్లాడుతూ..విద్యాలయాల్లో విద్యార్థి కేంద్రంగా, నాణ్యతకు పెద్ద పీట వేసేలా బోధన ఉండాలన్నారు. ఏకీకృత బోధన విధానం వల్లే తెలంగాణ విద్యారంగంలో మార్పు సాధ్యమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి చెప్పారు. ధనిక, పేద తారతమ్యం లేని, కులమతాల ప్రస్తావన లేని విద్యాలయాల ఏర్పాటు అవసరమన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని, ప్రతి తరగతికీ గది, ఉపాధ్యాయుడు ఉండాలని మరో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సూచించారు.
ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐవీ సుబ్బారావు, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ శాంతాసిన్హా, విద్యావేత్తలు మోహన్ గురుస్వామి, సీఐఐ శేఖర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, అక్షర వనం మాధవరెడ్డి, ఫ్రొపెసర్ గంగాధర్, విశ్రాంత ఐఏఎస్‌లు మిన్నీ మాథ్యూ, రంజీవ్ ఆచార్య, తదితరులు నూతన విద్యా విధానంపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, ఉన్నతాధికారులు జయేశ్ రంజన్, దేవసేన, కృష్ణ ఆదిత్య, నవీన్ నికొలస్ తదితరులు పాల్గొన్నారు.