శాంతి భద్రతలపై అలసత్వం సహించను | CM Revanth Reddy at a meeting of police officials | Sakshi
Sakshi News home page

శాంతి భద్రతలపై అలసత్వం సహించను

May 21 2026 4:11 AM | Updated on May 21 2026 4:12 AM

CM Revanth Reddy at a meeting of police officials

కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసుశాఖ సిద్ధం కావాలి  

మెరిట్‌ ఆధారంగానే పోస్టింగులు.. ఫ్లెక్సీలపై ఇక నుంచి కఠిన చర్యలు  

పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: శాంతి భద్రతల విషయంలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పావిలియన్‌లో పోలీసుశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర భద్రతా సలహాదారు శివధర్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌తోపాటు పోలీసు కమిషనర్లు, ఐజీ ర్యాంక్‌ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పోలీసు శాఖలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని స్పష్టం చేశారు. మెరిట్‌ ఆధారంగానే పోస్టింగులు ఇవ్వాలని అన్నారు. ఎస్‌ఐ నుంచి నాన్‌ కేడర్‌ ఎస్పీ ర్యాంక్‌ అధికారి వరకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత రెండేళ్లపాటు ఇతర విభాగాల్లో పనిచేసేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని డీజీపీకి సూచించారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయం మెరుగుపడాలని, జిల్లా హెడ్‌క్వార్టర్‌ దాటితే తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని తేల్చి చెప్పారు. 

అన్ని స్టేషన్లలో క్యూఆర్‌ కోడ్‌  
అన్ని పోలీసు స్టేషన్లలో క్యూ ఆర్‌ కోడ్‌ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆహార కల్తీపై ప్రత్యేక చట్టాన్ని రూపొందించి నిబంధనలను కఠినతరం చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. 

ఇక నుంచి క్రైమ్‌ రివ్యూలు తప్పనిసరిగా నిర్వహించాలని, ఎస్పీలు జిల్లా పర్యటనలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఏం జరుగుతుందో ఐజీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పోలీసు శాఖలో ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని చెప్పారు. నైట్‌ పెట్రోలింగ్‌ను బలోపే­తం చేయాలని, రౌడీషీట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నా­రు. కాలం చెల్లిన ఆయుధాలను పక్కన పెట్టి ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని, డ్రోన్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. 

డ్రగ్స్‌ బాధితుల కోసం ప్రత్యేక డీ–అడిక్షన్‌ సెంటర్లు  
డ్రగ్స్, గంజాయిపై కఠినచర్యలు కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డ్రగ్స్‌ బాధితుల కోసం ప్రత్యేక డీ–అడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్‌ క్రైమ్‌ ని­యంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయా­లని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫోరెన్సిక్‌ సెంటర్లు, డే­టా సెంటర్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నా­రు. 

స్కిల్స్‌ యూనివర్సిటీలో సైబర్‌ క్రైమ్‌పై పోలీసు విభాగం కోసం ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. విజిలెన్స్‌ విభాగాన్ని పటిష్టం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన తర్వాత కా­కుండా, అగి్నప్రమాదాలు జరగకుండా ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

మున్సిపల్‌ శాఖ, హైడ్రాతో సమన్వయం చేసుకొని ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌పై జూన్‌ 15లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు. మ్యాన్‌హోల్స్‌ నిర్వహణపై పోలీసు, ట్రాఫిక్‌ పోలీసులు, హై­డ్రా, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీ­లు కడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఫ్లెక్సీలను నియంత్రించాల్సిందేనని, పోలీసు కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement