డిప్యూటీ సీఎం భట్టితో కలిసి విద్యుత్ శాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
విద్యుత్‌శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
డేటా సెంటర్లు, హైస్పీడ్ కారిడార్ల నేపథ్యంలో సబ్‌స్టేషన్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని ఆదేశం
సాక్షి,హైదరాబాద్: సబ్‌స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యుత్ అధికారులను ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు కింద భూమి అందుబా టులో ఉన్న చోట ఉమ్మడి జిల్లాలో రెండు సబ్‌స్టేషన్ల పక్కన సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాలని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి అధికారులతో శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు ఎంసీహెచ్‌ఆర్డీలో సమీక్షించారు. విద్యుత్ శాఖలో సరఫరా లోపాలు, మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.
ట్రాన్స్‌ఫార్మర్లపై ఓవర్‌లోడ్ పడకుండా చూడాలని ఆదే శించారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడ లు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో డిమాండ్‌కు తగిన విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కం)లో చేరికపై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలు తొలగించాలని అధికారులకు సూచించారు. గ్రీన్‌ఎనర్జీ పాలసీలో భాగంగా ప్రాధాన్య క్రమంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి అనుమతులు వెంటనే ఇవ్వాలని చెప్పారు.
భారీ డేటా సెంటర్లకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని, సోలార్ పవర్‌పై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టే 18 సోలార్ పవర్ ప్లాంట్ల (హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో.. జిల్లాకు రెండు చొప్పున) నిర్మాణానికి నోడల్ అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. సోలార్ స్టవ్‌ల వినియోగంపై కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. సమీక్షలో ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్‌మిట్టల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్‌కో సీఎండీ ఎస్.హరీశ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్.వి.పాటిల్, మూడో డిస్కం సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ పాల్గొన్నారు .


