
ప్రణాళికను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో మంత్రి తుమ్మల, వర్సిటీ వీసీ రాజిరెడ్డి, సీఎస్ రామకృష్ణారావు
పండ్ల తోటల సాగు లక్ష్యమిదీ..
2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం పెంపు కూడా..
తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక–2035 రూపకల్పన
ప్రణాళికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదేళ్లలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు సాగులోకి వచ్చేలా చూడాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అలాగే 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని నిర్ణయించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక–2035’ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. వచ్చే పదేళ్లలో అనుసరించాల్సిన అభివృద్ధి ప్రణాళికను రూపొందించడంపట్ల విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ డి. రాజి రెడ్డి, డాక్టర్ ఎ. భగవాన్, డాక్టర్ జి.పి. సునందిని సీఎం అభినందించారు.
రూపాయి పెట్టుబడికి రూ. 4 లాభంగా...
వచ్చే ఐదేళ్లలో రూ.921.40 కోట్లను సాగు పెట్టుబడిగా యూ నివర్సిటీ ఈ ప్రణాళికలో పేర్కొంది. అలాగే రూ. 942.50 కోట్లను బిందుసేద్యం కోసం పెట్టుబడిగా కేటాయించాలని నిర్దేశించింది. తద్వారా రూపాయి పెట్టుబడికి 4 రూపాయల లాభం పొందే అవకాశం ఉందని ప్రణాళిక పేర్కొంది. తా ము రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత పంటల విస్తీర్ణంలో అమలు చేయడం వల్ల ఏటా రూ. 1,341 కోట్ల మేర ఉత్పత్తి విలువను సాధించవచ్చని అంచనా వేసింది. జామ, బొప్పాయి, అరటి, సపోటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, ఖర్జూరం అంజీర్, నేరేడు, ఉసిరి, సీతాఫలం మొదలైన పండ్ల పంటలను 1.32 లక్షల ఎకరాల్లో 2030 వరకు ఎంపిక చేసిన జిల్లాల్లో సాగు చేయవచ్చని పేర్కొంది.
అలాగే 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయలను పండించేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఎంపిక చేసిన జిల్లాల్లో టమాటా, వంగ, క్యారెట్, క్యాబేజ్, దోస, కాలిఫ్లవర్, ముల్లంగి, ఉల్లి, ఆలుగడ్డ, ఆకుకూరలు, బీర, సొర, మిరప, బెండ, కాకర, చిక్కుడు పంటల విస్తీర్ణం పెంచడానికి కృషి చేయాలని పేర్కొంది. ఆఫ్ సీజన్ కూరగాయలు పెంపకంపై విశ్వవిద్యాలయం తయారు చేసిన ప్రణాళిక అమలు పరచాలని, సంవత్సరం పొడుగునా కూరగాయల లభ్య తకు, వివిధ వ్యవధుల్లో కూరగాయల సాగు, షేడ్ నెట్లో, రక్షిత వసతులలో కూరగాయలు పెంచడం వంటి పద్ధ తులను అవలంబించాలని ఈ ప్రణాళిక స్పష్టం చేసింది.