నాకూ మినహాయింపొద్దు | CM Revanth Reddy Key Comments In TPCC PAC Meeting | Sakshi
Sakshi News home page

నాకూ మినహాయింపొద్దు

May 30 2026 4:51 AM | Updated on May 30 2026 4:51 AM

CM Revanth Reddy Key Comments In TPCC PAC Meeting

టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఎస్‌ఐఆర్‌పై ఓ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించండి: సీఎం రేవంత్‌రెడ్డి

క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో కలిసి పనిచేస్తా 

టీపీసీసీ పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి

పార్టీ కోసం మంత్రులు, ఎంపీలు అంతా పని చేయాల్సిందే... వచ్చే ఎన్నికల్లో కోటికిపైగా ఓట్లు వస్తేనే 100 సీట్లు వస్తాయి.. 

‘సర్‌’లో ఒక్క ఓటూ పోకుండా చూడాలి 

కొందరు ఎమ్మెల్యేలు జమీందార్లుగా మారారంటూ ఫైర్‌... తమ వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయనివ్వడం లేదని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: ‘పార్టీ కోసం అందరూ పనిచేయాల్సిందే. కార్పొరేషన్‌ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతో సహా. నాకు కూడా మినహాయింపు ఇవ్వొద్దు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌)పై అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నియమించిన ఇన్‌చార్జీలతో సమన్వయంతో పనిచేయాలి. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో మమేకం కావాలి. నా అసెంబ్లీ నియోజకవర్గాన్ని వేరే వారికి అప్పగించండి. నాకు ఏదైనా ఇతర అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వండి. నేనే వెళ్తా. ఆ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతా. వారితో కలిసి ఎస్‌ఐఆర్‌ విషయంలో పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు 45 లక్షల పార్టీ సభ్యత్వం చేర్పించామని, పార్టీ సభ్యులు ఒక్కొక్కరు ఇంకో ఓటు వేయించడంతో పార్టీ అధికారంలోకి వచి్చందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలవాలని, ఇందుకోసం కనీసం కోటి ఓట్లు రావాల్సి ఉంటుందని అన్నారు. అలా రావాలంటే పార్టీకి సంబంధించిన ఒక్క ఓటు కూడా ఎస్‌ఐఆర్‌ ద్వారా పోకుండా ఉండాలని, ఇందుకు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా ఉన్న నేతలు, మంత్రులతో సహా అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం ఇందిరాభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు.  

ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకోవద్దు 
    ‘ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఈ కార్యక్రమంపై పార్టీ పక్షాన అవగాహన పెంచుకోవాలి. ఎస్‌ఐఆర్‌ కారణంగా వలసదారుల ఓట్లకు ఇబ్బంది రావచ్చు. వారి ఓట్లు పోకుండా చూడాలి. లంబాడీ, ఆదివాసీ, మైనార్టీ, దళిత, మహిళా ఓట్ల విషయంలో సమస్యలు రావచ్చు. ఈ సమస్యల పరిష్కారమెలా అన్న దానిపై బూత్‌స్థాయి కార్యకర్తలకు అవగాహన కల్పించాలి. గతంలో పార్టీ డిజిటల్‌ సభ్యత్వం చేర్పించిన వారికి ఈ విషయంలో కీలక బాధ్యతలు అప్పగించాలి.

ఎస్‌ఐఆర్‌ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించాలి. అసెంబ్లీ ఇన్‌చార్జులు తప్పనిసరిగా నియోజకవర్గాల్లో ఉండాల్సిందే. వారు సరిగా పనిచేస్తేనే ఓట్లు పోకుండా ఉంటాయి. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్‌లోని నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలి. హైదరాబాద్‌ నగర పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలి. మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో క్లస్టర్‌ వారీ సమావేశాలు నిర్వహించాలి..’ అని సీఎం సూచించారు. కొందరు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సోషల్‌ మీడియాలో శిక్షణ ఇవ్వాలి 
     ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ కేడర్‌ పూర్తిగా సోషల్‌ మీడియా వారియర్లుగా మారిపోయి పనిచేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సోషల్‌ మీడియాలో వీక్‌ అయ్యాం. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందార్లు అయ్యారు. సోషల్‌ మీడియాలో తమ వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయనివ్వడం లేదు.

 ప్రభుత్వ పథకాలు ప్రజలకు రీచ్‌ కావడం లేదు. ఎమ్మెల్యేలు పాల్గొన్న కార్యక్రమాలు, ఎంపీలు కొబ్బరికాయలు కొట్టిన కార్యక్రమాలే సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. పార్టీ కోసం ఎలాంటి ప్రచారం జరగడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సోషల్‌ మీడియాలో శిక్షణ ఇవ్వాలి. నేతలు ఈ తీరును సరిచేసుకోవాలి.  

నెలలో మూడు రోజులు పార్టీకి.. 
    నేతలు కార్యకర్తల వద్దకు వెళితేనే, కార్యకర్తలు బూత్‌స్థాయిలో ఓటరు వద్దకు వెళ్తారన్న విషయాన్ని గమనించాలి. జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు కూడా కార్యకర్తల వద్దకు వెళ్లి కలవాలి. నేను కూడా 10 రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్లి పార్టీ కార్యకర్తలను కలుస్తా. నెలలో మూడు రోజులు పార్టీకి కేటాయిస్తా. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లందరూ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి..’ అని సీఎం చెప్పారు.  

కార్యకర్తల్లో నిరుత్సాహం 
    పలువురు మంత్రులు, పార్టీ నేతలు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌తో పాటు పార్టీ నిర్మాణంపై పలు సూచనలు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి మాట్లాడుతూ నామినేటెడ్‌ పోస్టుల నియామకంలో ఆచితూచి వ్యవహరించాలని, పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించాలని, సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని చెప్పారు. దీంతో సీఎం జోక్యం చేసుకుని ఉన్న పదవులను వీలున్నంత పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 

మంత్రుల తీరుతో నష్టం: మాజీ ఎంపీ వీహెచ్‌ 
    మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సలహాదారు వి.హన్మంతరావు మాట్లాడుతూ..కొందరు మంత్రుల వ్యవహారశైలితో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. ‘పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారున్నారు. కోట్లు ఖర్చుపెట్టుకుని ఆస్తులు అమ్ముకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన వారిని పట్టించుకోరా? మీరు నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు కనీసం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇన్‌చార్జులకు సమాచారం కూడా ఇవ్వరా?..’ అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఎంఐఎం నేతలతో ఎక్కువగా అంటకాగవద్దని, అలా చేస్తే హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎలా బలోపేతమవుతుందని ప్రశ్నించినట్టు సమాచారం.

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ర్‌గౌడ్‌లు పలు సూచనలు చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజహరుద్దీన్, వివేక్‌ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీతో పాటు జెట్టి కుసుమకుమార్, జి.చిన్నారెడ్డి, రాములు నాయక్, టి. రామ్మోహన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, జె.గీతారెడ్డి, ఎస్‌.సంపత్‌కుమార్, ఈరవత్రి అనిల్, ఎర్రబెల్లి స్వర్ణ, మిద్దెల జితేందర్, జక్కిడి శివచరణ్‌రెడ్డి, యడవెల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 

మంత్రులు వారంలో ఒకరోజు పార్టీకి కేటాయించాలి  
    ప్రతి వారంలో ఒక రోజు మంత్రులు ప్రభుత్వ పనులకు సెలవు పెట్టి పార్టీ పనులపై దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులకు నియోజకవర్గాల బాధ్యతలు కేటాయించనున్నారు. సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ప్రభుత్వ సలహాదారులు వీహెచ్, షబ్బీర్‌ అలీ, పార్టీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్‌రావులు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement