అంతా మీ ఆశీర్వాదమే! | CM Revanth Reddy Comments at Telangana Womens | Sakshi
Sakshi News home page

అంతా మీ ఆశీర్వాదమే!

May 26 2026 12:57 AM | Updated on May 26 2026 12:57 AM

CM Revanth Reddy Comments at Telangana Womens

ఇందిరమ్మ చీరల డిజైన్‌ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి సీతక్క, సెర్ప్‌ సీఈఓ దివ్య తదితరులు

తెలంగాణ ఆడబిడ్డలతోనే మా ప్రభుత్వం ఏర్పడింది 

ఇదే ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చే శక్తి మహిళలకు ఉంది

మహిళా వారోత్సవాల ప్రారంభంలో సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్ర మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలనేది ప్రభుత్వ సంకల్పం 

మారుమూల గ్రామాల్లోని మహిళలు కూడా ఆర్థికంగా నిలబడాలి 

మహిళల ఆధ్వర్యంలో రైస్‌ మిల్లులు, సూపర్‌ బజార్లు 

మహిళా సంఘాలు వడ్లు కొనుగోలు చేసి బియ్యం ప్రభుత్వానికి ఇచ్చేలా చర్యలు 

2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి 

8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన 

మహిళా సంఘాలకు ఇచ్చే ఇందిరమ్మ చీరల డిజైన్ల విడుదల 

మంత్రి సీతక్కకు, ఎమ్మెల్యే రాగమయికి చీరలు బహూకరణ 

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మహిళా సమాఖ్యలతో ముఖాముఖి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తమ ప్రభుత్వం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మళ్లీ ఈ సర్కార్‌ను అధికారంలోకి తీసుకువచ్చే శక్తి మహిళలకు ఉందని అన్నారు. రాష్ట్ర మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని, మారుమూల గ్రామాల్లోని మహిళలు కూడా ఆర్థికంగా నిలబడాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని అన్నారు. ‘మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబం నిలబడుతుంది.. కుటుంబం నిలబడితే గ్రామం బలపడుతుంది, గ్రామం బలపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడు రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. ఈ దిశలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తోంది..’ అని అన్నారు. సోమవారం సచివాలయంలో..ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాల ప్రారంభం సందర్భంగా..8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సీఎం స్విచ్‌ నొక్కి వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  

మహిళల ఆర్థిక బలోపేతానికి కీలక నిర్ణయాలు 
‘రాష్ట్ర వ్యాప్తంగా రూ.800 కోట్లతో 8 వేల మహిళా సంఘాల భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేశాం. ఈ మేరకు ప్రభుత్వం దేశంలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం. మహిళా సంఘాలకు మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) మహిళలను పారిశ్రామిక రంగంలోకి తీసుకురావడంలో భాగంగా మహిళల ఆధ్వర్యంలో రైస్‌ మిల్లుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం అవసరమైన భూమి, బ్యాంకు రుణాలు, ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుంది. 

మహిళా సంఘాలు మండలాల్లో గోడౌన్లు, లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేసుకోవాలి. వీటి కోసం వంద ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైస్‌ మిల్లులు, గోడౌన్ల కోసం సున్నా వడ్డీతో బ్యాంక్‌ లింకేజీ ఏర్పాటు చేసి కావాల్సిన రుణాలను మంజూరు చేస్తాం. అలాగే మహిళా సంఘాలతో మహిళా శక్తి సూపర్‌ బజార్లు కార్పొరేట్‌ తరహాలో ఏర్పాటు చేస్తాం. ఈ బజార్లలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటాదారుగా ఉంటుంది. వీటిల్లో నాణ్యమైన వస్తువులు దొరికేలా చూడాలి. పట్టణ ప్రాంతాల్లో వీటి కోసం ప్రభుత్వ భూములను చాలా తక్కువ ధరకు లీజుకు ఇస్తాం. ఇవి దేశంలోనే బెస్ట్‌ సూపర్‌ బజార్లుగా తయారు కావాలి. డీమార్ట్, బిగ్‌ బజార్‌ల కంటే బెస్ట్‌గా మహిళా శక్తి సూపర్‌ బజార్లు ఉండాలి..’ అని సీఎం అన్నారు. 

5వ తేదీన మహిళలకు మరో 553 బస్సులు 
‘మహిళలను బస్సుల యజమానులను చేయాలని వెయ్యి బస్సులు కొనుగోలు చేసి ఆరీ్టసీకి అద్దెకు ఇచ్చాం. అదే విధంగా జూన్‌ 5న పరేడ్‌ గ్రౌండ్స్‌లో మహిళా సంఘాల ద్వారా నడిచే మరో 553 బస్సులను ప్రారంభిస్తున్నాం.  

మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వ చేయం 
భవిష్యత్తులో మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టం. మహిళా ఎస్‌హెచ్‌జీలు వడ్లు కొనుగోలు చేసి బియ్యం ప్రభుత్వానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఆడబిడ్డలు ప్రతి గింజకు జవాబుదారిగా ఉంటారు.  

ఇకపై రూ.10 లక్షల వరకు బ్యాంక్‌ లింకేజీ రుణాలు 
సోలార్‌ ఎనర్జీ అనగానే అదానీ, అంబానీ గుర్తుకు వస్తారు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి మెగావాట్ల సోలార్‌ ఎనర్టీ ప్లాంట్లను మహిళా సంఘాలతో ఏర్పాటు చేయిస్తోంది. రిలయన్స్‌ వాళ్లు చేసే పెట్రోల్‌ బంక్‌ వ్యాపారాన్ని కూడా మహిళా స్వయం సహాయ సంఘాలతో  చేయిస్తున్నాం. మహిళలకు సంబంధించి రూ. 5 లక్షల వరకున్న బ్యాంక్‌ లింకేజీ లోన్లను రూ.10 లక్షలకు పెంచుతున్నాం. మహిళలు తాము తీసుకున్న ప్రతి రూపాయిని నిక్చచ్చిగా చెల్లించి ముందుకు వెళ్తున్నారు. లోన్లు తీసుకున్న వ్యాపారులు మాత్రం ఎగ్గొట్టి పారిపోతున్నారు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

చిలుక పచ్చ రంగులో ఇందిరమ్మ చీరలు 
‘రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డకు సారెలా చీరలు అందజేసింది. గతంలో ఇచ్చిన చీరలు పంట పొలాల్లో పిట్టలను కొట్టడానికి ఉపయోగించారు. ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణి చేస్తాం. చిలుక పచ్చ రంగులో కొత్త డిజైన్‌లో ఇందిరమ్మ చీరలు ఇవ్వబోతున్నాం. అన్నదమ్ములు కొందరు ఇంట్లో నుంచి చెల్లెళ్లను వెళ్లగొడుతున్నారు. ఈ మధ్య రాజకీయాల్లో కొందరు చెల్లెళ్లను బయటకు వెళ్లగొడితే బయటకు వెళ్లి ఎలా శాపనార్థాలు పెడుతున్నారో చూస్తున్నాం..’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు ఇచ్చే ఇందిరమ్మ చీరల డిజైన్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు. మహిళా వారోత్సవాల పురస్కరించుకుని మంత్రి సీతక్కకు, ఎమ్మెల్యే మట్టా రాగమయికి సీఎం చీరలు బహూకరించారు.  

మహిళా సమాఖ్యలతో ముఖాముఖి 
వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా పలు జిల్లాల మహిళా సమాఖ్యలతో రేవంత్‌ ముఖాముఖిలో పాల్గొన్నారు. నారాయణపేట మహిళా సమాఖ్య సభ్యులు పెట్రోల్‌ బంక్‌ ద్వారా తాము ఇప్పటివరకు రూ.27 లక్షలు సంపాదించామంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా బ్యాంకులకు వందకు వంద శాతం రీపేమెంట్‌ చేసిన నిర్మల్‌ జిల్లా సమాఖ్య పరిధిలోని సంఘాలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. 

మెయిన్‌ రోడ్డులో వారికి పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, మహిళా కమిషన్‌ చైర్మన్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం.దానకిశోర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఎండోమెంట్‌ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్‌ సీఈఓ దివ్య, మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ శృతి ఓజా తదితరులు పాల్గొన్నారు. 

గ్రామాల్లో పనులు షురూ 
మహిళా శక్తి భవనాల వర్చువల్‌ ప్రారంభం తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఆయా భవనాలకు భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. స్థానికులతో కలిసి అధికారులు పనులు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ పనులు పూర్తయిన వందకు పైగా మహిళా భవనాలను ఎక్కడికక్కడ ప్రారంభించారు.   

Advertisement
 
Advertisement
Advertisement