యువతను తిరిగి క్రీడలవైపు రప్పించాలి | CM Revanth Reddy Attends Closing Ceremony of All India Police Football Championship | Sakshi
Sakshi News home page

యువతను తిరిగి క్రీడలవైపు రప్పించాలి

Apr 6 2026 1:04 AM | Updated on Apr 6 2026 1:04 AM

CM Revanth Reddy Attends Closing Ceremony of All India Police Football Championship

పోలీసు క్రీడాకారులతో సీఎం రేవంత్‌రెడ్డి

పబ్‌లు, డ్రగ్స్‌ సంస్కృతి వైపు వెళ్తున్న యువతను మైదానం బాట పట్టించాలి 

దేశం ఒలింపిక్‌ పతకాలు సాధించేలా ముందుకు సాగాలి 

ఒకప్పుడు హైదరాబాద్‌కు ఫుట్‌బాల్‌ నర్సరీగా పేరుంది 

యువతకు మార్గదర్శనం చేసేందుకే మెస్సీని తెలంగాణకు తీసుకొచ్చాం 

అఖిల భారత పోలీసు ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ ముగింపు వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి 

ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో మూడు గోల్స్‌ కొట్టిన ముఖ్యమంత్రి 

టోర్నీ విజేతలుగా పురుషుల జట్టు నుంచి సీఐఎస్‌ఎఫ్, మహిళల జట్టు నుంచి అస్సాం రైఫిల్స్‌

సాక్షి, హైదరాబాద్‌: క్రీడామైదానం వదిలి దేశ యువత పెద్ద తప్పు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మైదానం వదిలి పబ్‌లు, డ్రగ్స్‌ సంస్కృతి వైపు వెళ్తున్న యువతను తిరిగి క్రీడా మైదానాల్లోకి రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. డ్రగ్స్‌ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో చదువుకున్న యువతే ఎక్కువ ఉంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు వీరుల భూమి అయిన పంజాబ్‌లో ఇప్పుడు డ్రగ్స్‌ పెరిగాయని.. పంజాబ్‌లా మరే రాష్ట్రం కావొద్దన్నారు. యువతను సరైన దారిలో పెట్టకపోతే దేశ భవిష్యత్తుకు ప్రమాదమని హెచ్చరించారు.

ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన బీఎన్‌ ముల్లిక్‌ స్మారక అఖిల భారత పోలీసు ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌–2026 పోటీల ముగింపు వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం తన ఆటతో ఆకట్టుకున్నారు. సీఐఎస్‌ఎఫ్, గోవా జట్ల మధ్య జరిగిన ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో గోవా టీం తరఫున రేవంత్‌రెడ్డి వరుసగా మూడు గోల్స్‌ కొట్టి జట్టును గెలిపించారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో హైదరాబాద్‌కు గొప్ప పేరుందన్నారు. 1950 నుంచి 1960ల వరకు నర్సరీ ఆఫ్‌ ఇండియన్‌ ఫుట్‌బాల్‌గా హైదరాబాద్‌ను పిలిచేవారని.. భారత ఫుట్‌బాల్‌ జట్టుకు అగ్రశ్రేణి క్రీడాకారులను ఈ నగరం అందించిందని సీఎం గుర్తుచేశారు. స్పై మాస్టర్‌గా పేరుగాంచిన బీఎన్‌ ముల్లిక్‌ పేరిట నిర్వహించిన ఈ టోర్నమెంట్‌తో దేశంలోని వివిధ పోలీసు బలగాల మధ్య సమన్వయం పెంచడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించిన తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నట్లు చెప్పారు.  

అంతర్జాతీయ క్రీడల్లో దేశం పేరు నిలబెట్టాలి 
నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న దక్షిణ కొరియా ఒలింపిక్స్‌లో 30కిపైగా పతకాలు సాధిస్తే 140 కోట్లకుపైగా కోట్ల జనాభాగల భారత్‌ నుంచి ఒక్క పతకం రాకపోవడం బాధాకరమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశం పేరు నిలబెట్టేలా క్రీడాకారులను తయారు చేసేందుకు తెలంగాణలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీలో పుల్లెల గోపీచంద్, కపిల్‌దేవ్‌ వంటి ఎందరో గొప్ప క్రీడాకారులు బోర్డు సభ్యులుగా ఉన్నారన్నారు.

‘మహిళా బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగంతోపాటు రూ. 2 కోట్ల నగదు పురస్కారం ఇచ్చాం. టీం ఇండియా క్రికెటర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ 12వ తరగతి తప్పినా నిబంధనలు పక్కనపెట్టి అతన్ని డీఎస్పీని చేశాం. చదువుకుంటే జాబ్‌లు వస్తాయో లేదో కానీ మీరు క్రీడాకారులుగా రాణిస్తే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

తెలంగాణ యువతకు మార్గదర్శనం చేసేందుకే దిగ్గజ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సీని తెలంగాణకు తీసుకువచ్చానని తెలిపారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ను అరికట్టేందుకు పోలీసులు కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ అందరూ క్రికెట్‌ క్రేజ్‌తో ఫుట్‌బాల్‌ను మరిచిపోతున్న తరుణంలో భారీ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహణతో తెలంగాణ పోలీసులు గర్వపడేలా చేశారన్నారు. 

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సీఎం 
12 రోజులపాటు జరిగిన మ్యాచ్‌లలో 34 జట్లు పాల్గొన్నాయని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. విజేతలను, మ్యాచ్‌ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన అధికారులను ఆయన అభినందించారు. ఈ టోర్నమెంట్‌ విజేతలుగా పురుషుల జట్టు నుంచి సీఐఎస్‌ఎఫ్, మహిళల జట్టు నుంచి అస్సాం రైఫిల్స్‌ నిలిచాయి. విజేత జట్లతోపాటు మహిళల నుంచి గోల్డెన్‌ బూట్‌ గెలుచుకున్న క్రీడాకారిణి ప్రియా సాసా, పురుషుల నుంచి గోల్డెన్‌ బూట్‌ గెలుచుకున్న క్రీడాకారుడు విజయ్‌ బెహారేలకు సీఎం రేవంత్‌రెడ్డి ట్రోఫీలను బహూకరించారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో స్పెషల్‌ డైరెక్టర్‌ స్వప్న తివారీ, సైబరాబాద్‌ సీపీ డా. రమేశ్‌రెడ్డి, తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్, టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయల్, సాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement