‘భవ్య బాసర’కు భూమిపూజ | CM Revanth Lays Foundation Stone for Rs 225 Cr Basara Temple Development | Sakshi
Sakshi News home page

‘భవ్య బాసర’కు భూమిపూజ

Apr 7 2026 4:40 AM | Updated on Apr 7 2026 4:40 AM

CM Revanth Lays Foundation Stone for Rs 225 Cr Basara Temple Development

భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు

ఆలయం పునరాభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం

యంగ్‌ ఇండియా స్కూల్‌కు శంకుస్థాపన

మనవడు రియాన్ష్ కు అక్షరాభ్యాసం

నిర్మల్‌: దేశంలోని ఏకైక సరస్వతీ క్షేత్రమైన బాసరను భవ్యమైన ఆలయంగా పునరాభివృద్ధి చేసేందుకు రూ.225 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆ పనులకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే ముధోల్‌ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో నిర్మించే యంగ్‌ ఇండియా స్కూల్‌కు సీఎం శంకుస్థాపన చేశారు.

కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి..
ముఖ్యమంత్రి ఉదయం 11.42 గంటలకు సతీమణి గీతారెడ్డి, కుమార్తె, అల్లుడు, మనవడు రియాన్ష్ , మంత్రులతో కలిసి రెండు హెలికాప్టర్లలో బాసరకు చేరుకున్నారు. ముందుగా ఆలయంలో అమ్మవారి ఎదుట వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రియాన్ష్ కు తన సతీమణితో కలిసి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం సరస్వతీ, మహాలక్ష్మీ, మహంకాళీ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల నుంచి వేద ఆశ్వీరచనం, దేవాదాయ శాఖ అధికారుల సత్కారం స్వీకరించారు. తర్వాత మంత్రులతో కలిసి ఆలయ ప్రాంగణంలో తూర్పు ముఖద్వారం పక్కన మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం చేపట్టనున్న విశాలమైన నూతన ఆలయానికి భూమిపూజ నిర్వహించారు.

అక్కడే యంగ్‌ ఇండియా స్కూల్‌కు కూడా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీలు గొడం నగేశ్, వేం నరేందర్‌రెడ్డి, ముధోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దండె విఠల్, చిన్నమైల్‌ అంజిరెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, ఆలయ ఇన్‌చార్జి ఈవో విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి మౌనం
బాసర పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడా మాట్లాడలేదు. మీడియాను ఆలయంలోకి అనుమతించలేదు. బాసరలోనే ఉన్న ట్రిపుల్‌ ఐటీ సమస్యలపై స్పందిస్తారని, నిర్మల్‌ జిల్లాలో ఏర్పాటు చేస్తానన్న యూనివర్సిటీ గురించి ముఖ్యమంత్రి మాట్లాడతారని భావించినా భూమిపూజ, మనవడి అక్షరాభ్యాస కార్యక్రమాలకే పరిమితమయ్యారు. లంచ్‌ టైమ్‌లో కాసేపు నిర్మల్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement