ఏప్రిల్‌ 15 కల్లా ‘యాదాద్రి’ సిద్ధం చేయండి | CM KCR Sets April 15 Deadline To Complete Yadadri | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 15 కల్లా ‘యాదాద్రి’ సిద్ధం చేయండి

Mar 13 2021 3:13 AM | Updated on Mar 13 2021 4:32 AM

CM KCR Sets April 15 Deadline To Complete Yadadri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున:ప్రారంభించనున్నందున నిర్దేశించిన గడువులోపు తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. యాదాద్రి పనుల పురోగతిపై శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు ఆలయ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో యాదాద్రి క్షేత్ర పునర్నిర్మాణ పనులకు సంబంధించి తుదిదశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆలయ దివ్యాలంకృత రూపం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ఆలయ అధికారులతో ఆయన చర్చించారు. ఇటీవల తాను యాదాద్రి క్షేత్రంలో పర్యటించిన సందర్భంగా చేసిన సూచనలకు సంబంధించి పురోగతి ఎంతవరకు వచ్చిందన్న దానిపై అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ‘పునర్నిర్మాణానంతరం ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకతను చాటుకోబోతోంది. నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో, కృష్ణ శిలలతో నిర్మితమవుతున్న ఈ ఆలయం అద్భుత రూపాన్ని సంతరించుకుంటోంది. జైనులు, పల్లవుల ఆకృతుల నిర్మాణాలతో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. పున:ప్రారంభ అనంతరం లక్ష్మీనారసింహుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గుట్ట పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దాలి’అని చెప్పారు.

సుందర శివాలయం.. 80 ఫీట్ల దీప స్తంభం
యాదాద్రి నారసింహుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న క్యూలైన్‌ నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ గురించి సీఎం పలు సూచనలు చేశారు. ఉత్తర దిక్కున ఉన్న ప్రహరీని తొలగించి అక్కడ క్యూలైన్‌ నిర్మాణం చేపట్టాలని, 350 ఫీట్ల పొడవైన క్యూలైన్‌ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలని, ఏప్రిల్‌ 15కల్లా ఈ క్యూలైన్‌ నిర్మాణం పూర్తి కావాలని ఆయన గడువు విధించారు. క్యూలైన్‌ పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలకు సంబంధించి నాలుగు ఆకృతులను ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు చూపించగా అందులో ఒకదాన్ని ఖరారు చేశారు. దీప స్తంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్ది, నడకదారిలో కూడా ఇత్తడితో ఆకృతులను ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్ర పరిధిలో శివాలయ నిర్మాణం గురించి వివరాలు తెలుసుకున్న సీఎం దేవాలయం చుట్టూ 360 డిగ్రీల కోణంలో ఐకానిక్‌ ఎలిమెంట్‌లా తయారు చేయాలని, ఆలయ ప్రహరీలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలని, ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించేలా గ్రిల్స్, రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలని, ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ కనిపించేలా తుది మెరుగులు దిద్దాలని ఆదేశించారు.



సుదర్శన చక్రం తరహాలో..
బ్రహ్మోత్సవాల్లో సుదర్శన చక్రం తరహాలో శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనమివ్వాలని, రథశాలను ఆలయాకృతిలో తీర్చిదిద్దాలని, విష్ణు పుష్కరిణి కొండ చుట్టూ నిర్మించే ప్రహరీల మీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్‌ దీపాలను అలంకరించాలని, 80 ఫీట్ల పొడవున్న దీప స్తంభాన్ని లాన్‌ నడుమ ఏర్పాటు చేయాలని సూచించారు. అద్దాల మండపం పనులు అత్యంత సుందరంగా జరుగుతున్నాయని కితాబిచ్చిన సీఎం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రివేళల్లో ఆలయ సముదాయం, ప్రాంగణం, పరిసరాలు దివ్యమైన విద్యుత్‌ వెలుగులతో ప్రకాశించేలా రూపొందించిన వీడియోను కేసీఆర్‌ ఈ సందర్భంగా తిలకించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, సలహాదారు అనురాగ్‌ శర్మ, సీఎం కార్యాలయ కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి, వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్‌రావు, ఆర్కిటెక్ట్‌లు ఆనంద్‌సాయి, మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement