CM KCR: భారీ వర్షాలు, వరదలపై ప్రజలకు సీఎం కేసీఆర్‌ హెచ్చరిక

CM KCR Review Meeting On Heavy Rains, Floods In Telangana - Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ శనివారం అత్యవసర సమీక్ష చేపట్టారు. మొన్నటికంటే ఎక్కువ వరదలు వచ్చే ప్రమాదముందని తెలిపిన సీఎం.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోసారి ఎగువనుంచి గోదావ‌రిలోకి భారీ వ‌ర‌ద వ‌చ్చే అవ‌కాశం ఉందని, దీంతో గోదావ‌రి ప‌రివాహ‌క జిల్లాల‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం సూచించారు. ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఉండాల‌ని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్షా సమయమని, కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్నిశాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటిలాగే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు.  వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  పోలీసు యంత్రాంగాన్ని కిందిస్థాయి పోలీస్ స్టేషన్ల వరకు ఎస్ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి  ఆదేశించారు. 

హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎం.డి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గోదావరి ప్రవాహాన్ని, శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు ప్రాజెక్టుల పరిస్థితులను, వరదలు ఎట్లా వస్తున్నాయనే విషయాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. భారీ వర్షాలతో గోదావరి నదీ ప్రవాహం ఎస్సారెస్పీ నుంచి, కడెం నుంచి వస్తున్న ప్రవాహాలను, గంట గంటకూ మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసే విధానాన్ని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. 
చదవండి: తెలంగాణ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. కొత్తగా 13 మండలాలు

వాతావరణ హెచ్చరికలను ఆధారం చేసుకొని, కురవబోయే భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేస్తే.. లోతట్టు ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యల కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని రజత్ కుమార్ వివరించారు.  వాతావరణ శాఖ వానలను అంచనా వేస్తుంది. కానీ తద్వారా వచ్చే వరద ముప్పును పసిగట్టలేక పోతుందని, ఈ టెక్నాలజీతో వరద ముప్పును కూడా అంచనా వేయవచ్చని రజత్ కుమార్ తెలిపారు.

ఇదిలా ఉండగా తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉపరితల  ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top