హలో.. నేను సీఎంను మాట్లాడుతున్నా

Cm KCR Makes Phone Call To Farmer Nageshwar Reddy From Jahirabad - Sakshi

రైతు నాగేశ్వర్‌రెడ్డికి కేసీఆర్‌ ఫోన్

ఆలుగడ్డ సాగు, దిగుబడి, ధరపై ఆరా

25 ఎకరాల్లో పంట వేశానని.. పంట తీసేటప్పుడు రావాలని రైతుకు ఆహ్వానం

నాలుగున్నర నిమిషాలపాటు సంభాషణ

జహీరాబాద్‌: ‘హలో.. నేను సీఎంను మాట్లాడుతున్నాను..’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఓ ఆలుగడ్డ రైతుకు ఫోన్‌ చేసి పంట గురించి ఆరా తీశారు. సం గారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం రంజోల్‌ గ్రామానికి చెందిన రైతు నల్లా నాగేశ్వర్‌రెడ్డికి శనివారం సీఎం ఫోన్‌ చేశారు. నాలుగున్నర నిమిషాలపాటు సంభాషించారు. 

సంభాషణ సాగిందిలా.. 
సీఎం: మీ ప్రాంతంలో ఈ ఏడాది ఆలుగడ్డ సాగు ఎలా ఉంది?
రైతు: పంట సాగు ఆశాజనకంగా ఉంది సర్‌.. సాగు విస్తీర్ణమేమీ తగ్గలేదు.

సీఎం: ఎలాంటి రకాన్ని సాగు చేస్తున్నారు?
రైతు: జహీరాబాద్‌ ప్రాంతంలో 166 రకం సాగు చేస్తారు. దీన్ని కుఫ్రీగా పిలుస్తారు. జ్యోతి, ఖ్యాతి రకాల విత్తనాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ ప్రాంతంలో సాగు చేయడం లేదు. 

సీఎం: ఒక మొక్క బాగుంటే ఎన్ని గడ్డలు ఉంటాయి?
రైతు: 8 నుంచి 10 గడ్డల వరకు ఉంటాయి.

సీఎం: ఇంతమేర గడ్డలుంటే పంట దిగుబడి బాగా వచ్చినట్లా? 
రైతు: అవును సార్‌ 

సీఎం: ఎంత బరువు తూగుతుంది? 
రైతు: కిలో మేర తూగుతుంది. 

సీఎం: ఎకరాకు ఎన్ని బస్తాల విత్తనం ఉపయోగిస్తారు? 
రైతు: 15 నుంచి 16 బస్తాలు వాడుతాం. పంటను బెడ్‌ విధానంలో వేశాం. పంట వేసి 45 రోజుల వరకు అయింది.

సీఎం: నేను 25 ఎకరాల్లో ఆలుగడ్డ పంట వేశా. పంట బాగుంది. 
రైతు: ఎకరాకు 12 నుంచి 15 టన్నుల మేర దిగుబడి వస్తుంది. ఒక బస్తా విత్తనానికి 16 బస్తాల వరకు పంట దిగుబడి వస్తుంది.

సీఎం: మార్కెట్లో ఆలుగడ్డ పంటకు ధర ఎలా ఉంది?
రైతు: ప్రస్తుతం ధర తగ్గింది. క్వింటాలుకు రూ.1,700 నుంచి రూ.2,000 మేర ధర పలుకుతోంది. కోహీర్‌ ప్రాంతంలో ఎర్ర నేలలు ఉన్నందున పంట ఎరుపురంగులో వస్తుంది. దీనికి ధర తక్కువగా ఉంటుంది. రేగడి నేలల్లో వచ్చే పంట తెలుపు రంగులో ఉండటంతో ధర కొంత ఎక్కువ ఉంటుంది. 

సీఎం: ఎన్ని రోజుల్లో పంటను తీస్తారు?
రైతు: 85 రోజుల్లో పంట చేతికొస్తుంది. పక్షం రోజుల ముందు నుంచే నీటి తడులు ఇవ్వడాన్ని నిలిపివేస్తాం. 

సీఎం: నేను ఇంకా పంట తీయలేదు. పంట తీసే సమయంలో పిలిపిస్తా.
రైతు: సరే సార్‌.. నాలుగైదు మందిమి వస్తాం.
సీఎం: థ్యాంక్యూ 

ఇదిలా ఉంటే, నాలుగు నెలల క్రితం రైతు నాగేశ్వర్‌రెడ్డితోపాటు మరో నలుగురు రైతులు సీఎం ఆహ్వానం మేరకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లారు. వారితో సీఎం సుమారు ఆరు గంటల పాటు పంటల సాగు గురించి చర్చించిన విషయం తెలిసిందే.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top