రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ | Chicken Shops to Shut Down in Telangana April 1st | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్

Mar 31 2026 4:08 PM | Updated on Mar 31 2026 4:57 PM

Chicken Shops to Shut Down in Telangana April 1st
  • మార్జిన్ పెంచాలని డిమాండ్
  • తెలంగాణ వ్యాప్తంగా సుమారు 50 వేల  రిటైల్ చికెన్  షాపులు

హైదరాబాద్‌:  రిటైల్‌ చికెన్‌ షాపులకు ఇచ్చే మార్జిన్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది రాష్ట్ర చికెన్‌ షాప్ ఓనర్స్ అసోసియేషన్. దీనిలో భాగంగా రేపట్నుంచి(బుధవారం, ఏప్రిల్‌ 1వ తేదీ) రాష్ట్ర వ్యాప్తంగా చికెన్‌ షాపులను బంద్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.  పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభం (మార్జిన్) తగ్గించడంతో వ్యాపారులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని, ఈ మార్జిన్‌ను పెంచాలని డిమాండ్‌ చేస్తోంది చికెన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌. 

గతంలో ఫౌల్ట్రి వాళ్ళు రిటైల్ షాపులకు కేజీకి 26 రూపాయలు మార్జిన్ ఇచ్చే వారని, గత 20 ఏళ్ళుగా 26 రూపాయలే మార్జిన్ ఉందని, కానీ ఇటీవల మార్జిన్‌ను16 రూపాయలకు తగ్గించారని, ప్రస్తుతం కేజీ చికెన్‌కు మార్జిన్ 30 రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తుంది.

అసోసియేషన్ నాయకుల చెబుతున్న దాని ప్రకారం, ప్రస్తుతం చికెన్‌ విక్రయాలపై వస్తున్న లాభం చాలా తక్కువగా ఉండటంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు జీవనోపాధి కొనసాగించడం సవాల్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్జిన్‌ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తూ, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ పాటించనున్నట్లు ప్రకటించారు.

ఈ నిర్ణయం వల్ల సాధారణ వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశముంది. ముఖ్యంగా వేసవి కాలంలో చికెన్‌కు ఉన్న డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ధరలు మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు త్వరగా జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని వ్యాపారులు కోరుతున్నారు. లేదంటే ఈ బంద్‌ దీర్ఘకాలం కొనసాగి మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement