టీడీఆర్ వినియోగంలో సవరణలు
భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు
ఇక 21 మీటర్ల నుంచి హైరైజ్
టీడీఆర్ వినియోగంపై 20 అంతస్తుల వరకు వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: టీడీఆర్ (ట్రాన్సఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత జనవరిలో జారీ చేసిన ఉత్తర్వులతో ఫలితం కనిపించకపోవడంతో కీలక సవరణలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బిల్డింగ్ రూల్స్–2012 నిబంధనలను కొంతమేర సరళీకరించింది. స్టేక్ హోల్డర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సాధారణ రియల్టర్లకు ఉపశమనం ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్ జీఓ నంబరు 95 జారీ చేశారు.
హైరైజ్ భవనమంటే...
ఇక నుంచి 21 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తు గల భవనాలను మాత్రమే హైరైజ్ భవనాలుగా పరిగణిస్తారు. అయితే పారిశ్రామిక భవనాల్లోని చిమ్నీలు, కూలింగ్ టవర్లు, ఇతర భవనాల్లోని వాటర్ ట్యాంకులు, ఆర్కిటెక్చరల్ డిజైన్లను ఈ ఎత్తు లెక్కలోకి తీసుకోరు. ఇప్పటి వరకు 18 మీటర్ల ఎత్తు, అంతకంటే ఎక్కువ ఉంటే హైరైజ్‌గా పరిగణించేవారు.
» 750 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్లలోపు విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో 18 మీటర్ల నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలను నిర్మించాలంటే టీడీఆర్ వినియోగించడం తప్పనిసరి. పార్కింగ్, ఇతరత్రా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
» హైరైజ్ భవనాల్లో టీడీఆర్ వినియోగంతో 10 శాతం వరకు సెట్‌బ్యాక్స్‌లో మినహాయింపు పొందొచ్చు. అయితే అన్ని వైపులా కనీసం 7 మీటర్ల సెట్‌బ్యాక్ తప్పనిసరి. నాన్–హైరైజ్ భవనాలకు కూడా కనీస సెట్‌బ్యాక్‌లు పాటిస్తూ టీడీఆర్ ద్వారా రాయితీ పొందొచ్చు.
» మాస్టర్ ప్లాన్ రోడ్లలో మార్పులు చేసినా, తగ్గించినా, తొలగించినా, దరఖాస్తుదారులు అభివృద్ధి/కన్వర్షన్ చార్జీలు చెల్లించాలి. లేదా చార్జీలకు సమానమైన టీడీఆర్‌ను సమర్పించొచ్చు.
టీడీఆర్ వినియోగంతో 2,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో రోడ్డు వెడల్పు ఆధారంగా అదనపు అంతస్తులకు అనుమతి ఇస్తారు.
40 అడుగుల రోడ్డు: 3 అదనపు అంతస్తుల వరకు
60 అడుగుల రోడ్డు: 4 అదనపు అంతస్తుల వరకు
80 అడుగుల రోడ్డు: 5 అదనపు అంతస్తుల వరకు
» ఫైర్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటారు.
గత జనవరిలో జారీ చేసిన జీఓకు చేసిన సవరణల మేరకు..
10 నుంచి 20 అంతస్తుల లోపు హైరైజ్ భవనాల్లో 10 అంతస్తులపైన ఉన్న మొత్తం బిల్టప్ ఏరియాలో 3% టీడీఆర్ వినియోగం తప్పనిసరి. 20 అంతస్తులకు పైబడిన భవనాలకు 20 అంతస్తుల పైన ఉన్న ఏరియాలో 5% టీడీఆర్ తప్పనిసరి. నిర్మాణ అనుమతి సమయంలో 50% టీడీఆర్, మిగిలిన 50% టీడీఆర్‌ను ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీకి ముందు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, గెజిట్‌లో ప్రచురించాలని పేర్కొన్నారు.
» గత జనవరిలో జారీ చేసిన జీఓ మేరకు ‘క్యూర్’ పరిధిలో పది అంతస్తులు దాటిన హైరైజ్ భవనాల్లో 11వ అంతస్తు నుంచి అన్ని అంతస్తులకు బిల్టప్ ఏరియాలో 10 శాతం టీడీఆర్ తప్పనిసరి అని పేర్కొన్నారు. అనుమతి పొందే సమయంలోనే మొత్తం టీడీఆర్ ఇవాల్సి ఉంటుంది. ప్రస్తుత సవరణలతో అనుమతి సమయంలో 50 శాతం టీడీఆర్, భవన నిర్మాణం పూర్తయ్యాక ఓసీ జారీ సమయంలో మిగతా 50 శాతం టీడీఆర్ సమర్పిస్తే సరిపోతుంది. ఇది సాధారణ రియల్టర్లకు ఎంతో ఉపశమనంగా ఉంటుందని టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొన్నారు.


