ఉపకారానికి కొర్రీ .. విద్యార్థులు వర్రీ!

Center New Regulations On Scholarship Fee Reimbursement Fund For SCs - Sakshi

ఎస్సీల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులపై కేంద్రం కొత్త నిబంధనలు 

ముందుగా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వాలని స్పష్టీకరణ 

అర్హుల ఖాతాలో నేరుగా తామే నిధులు జమ చేస్తామని వెల్లడి 

ఎదురయ్యే సమస్యల దృష్ట్యా ఎటూ తేల్చకుండా రాష్ట్ర సర్కారు జాప్యం  

రెండేళ్లుగా రూ.600 కోట్ల నిధులు విడుదల చేయని కేంద్ర ప్రభుత్వం 

2 లక్షలకు పైగా విద్యార్థుల ఎదురుచూపులు 

సాక్షి, హైదరాబాద్‌:  ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలపై కేంద్రం విధించిన సరికొత్త నిబంధనలు పోస్టుమెట్రిక్‌ కోర్సులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాము సూచించినట్లుగా రాష్ట్ర ప్ర­భు­త్వాలు నడుచుకుంటేనే కేంద్ర వాటా విడుదల చేస్తామని స్పష్టం చేయడం, దీనిపై రాష్ట్ర సర్కారు మిన్నకుండడంతో రెండేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.600 కోట్లు నిలిచిపోయాయి. దీంతో అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందడం లేదు. రాష్ట్రంలో వివిధ పోస్టుమెట్రిక్‌ కోర్సులు చదివే వి­ద్యార్థులు ఏటా 2 లక్షలకు పైగా ఉంటారు.  

60 శాతానికి పెరిగిన కేంద్రం వాటా 
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఎస్సీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రాష్ట్రాలకు నిధులిస్తుంది. ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులు కలిపి విద్యార్థులకు అందిస్తుంటాయి. ఎన్నో ఏళ్లుగా ఈ పద్ధతి కొనసాగుతోంది. అయితే తన వాటా నిధులు 40 నుంచి 60 శాతానికి పెంచిన కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి కొత్త నిబంధనలు విధించింది.

గతేడాది నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు 40 శాతం (గతంలో 60 శాతం) విడుదల చేయాలనే మెలిక పెట్టింది. అంతేకాకుండా విద్యార్థుల ఖాతా నంబర్లను కేంద్రానికి పంపితే నేరుగా నిధులు జమ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. వివరాలను పంపాలని సూచించింది. కానీ రాష్ట్ర ప్రభు­త్వం కేంద్రానికి సమాచారం పంపలేదు.  

సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం! 
నేరుగా తామే ఖాతాల్లో నిధులిస్తామనే నిబంధనతో లబ్ధిదారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశముందని అధికారవ­ర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాస్తవా­నికి ఇప్పటివరకు ఉపకారవేతనాలే నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీ ఖాతాలో జమ చేస్తోంది. కేంద్రం నిబంధనల ప్రకారం ఫీజులు కూడావిద్యార్థి ఖాతాలో జమ చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయని ఎస్సీ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో లబ్ధిదారులకు అందించడమే ఉత్తమ­మని, ఈ ప్రక్రియలో ఇబ్బందులు తలె­త్తితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల వివరాలను పంపకపోవడంతో రెండేళ్లుగా ఈ కోటాలో పైసా కూడా విడుదల కాలేదు. 

ఇరకాటంలో విద్యార్థులు.. 
2021–22 విద్యా సంవత్సర దరఖాస్తుల పరిశీలన పూర్తయినప్పటికీ ఆయా విద్యార్థులకు సంబంధించిన ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో మెజార్టీ విద్యార్థులు ఉపకారవేతనాల కోసం ఎదురు చూస్తుండగా... కాలే­జీ యాజమాన్యాలు ఫీజు నిధుల కోసం పడిగాపులు కాస్తున్నాయి. కొన్నిచోట్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తుండడంతో వారు అప్పులు చేసి సొంతగా ఫీజులు చెల్లిస్తున్న ఉదంతాలు సైతం కనిపిస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top