అధికారికంగా హైదరాబాద్‌ సంస్థాన విమోచన దినోత్సవం

Center Key Decision On Hyderabd Liberation Celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థాన విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 17న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, హోంశాఖల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ ఉత్సవాల్లో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై పాల్గొననున్నారు.

ఈ ఉత్సవాలను హైదరాబాద్‌ స్టేట్‌ విలీన దినోత్సవంగా కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ శాఖలు భావిస్తున్నట్లు సమాచారం. పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంశాఖ పరిధిలోని ఏడు సాయుధ దళాలతో నిర్వహించే సైనిక కవాతు సందర్భంగా అమిత్‌ షా సైనిక వందనం స్వీకరించనున్నారు. సైనిక కవాతుతోపాటు కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గతంలో హైదరాబాద్‌ స్టేట్‌లో భాగంగా ఉన్న వివిధ ప్రాంతాలు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలలో విలీనమైన విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో కేంద్ర సాంస్కృతికశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలోనూ...: ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ తరహాలో ఈ నెల 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 17 దాకా (హైదరాబాద్‌ స్టేట్‌ విలీనమై 75 ఏళ్లు పూర్తయ్యే దాకా) ఏడాదిపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నైజాం విముక్త స్వతంత్ర ఉత్సవాల పేరిట చేపట్టాలని రాష్ట్ర స్వయం సేవక్‌సంఘ్‌ (ఆరెస్సెస్‌) నిర్ణయించింది. రాజకీయరంగు లేకుండా నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఆనాటి నియంతృత్వ పాలనను ఎత్తిచూపేలా వివిధ కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తున్నారు.

ఏడాదిపాటు వీటి నిర్వహణకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, ఇతర భావసారూప్య శక్తులు, వ్యక్తులతో ఒక సమన్వయ కమిటీ ద్వారా చేపట్టనున్నట్లు సమాచారం. ఈ సమితికి గౌరవాధ్యక్షుడిగా జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి, అధ్యక్షుడిగా డా. వంశతిలక్‌ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమితి లక్ష్యాలు, ఆలోచనలు, చేపట్టబోయే కార్యక్రమాలను శనివారం ప్రకటించనున్నారు.
చదవండి: ఏడాది పొడవునా తెలంగాణ విలీన వజ్రోత్సవాలు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top