బరితెగించిన ఇసుకాసురులు | Case registered against tractor driver Shivaratri Shivaji | Sakshi
Sakshi News home page

బరితెగించిన ఇసుకాసురులు

Apr 16 2026 4:19 AM | Updated on Apr 16 2026 4:19 AM

Case registered against tractor driver Shivaratri Shivaji

తహసీల్దార్‌ వాహనంపైకి ట్రాక్టర్‌ ఎక్కించేందుకు ప్రయత్నం  

కేసు నమోదు చేసిన పోలీసులు 

సిరిసిల్ల క్రైం: సిరిసిల్లలో ఇసుకాసురులు బరితెగించారు. తహసీల్దార్‌ వాహనం మీదకే ట్రాక్టర్‌ ఎక్కించేందుకు ప్రయతి్నంచారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సిరిసిల్లలోని సాయినగర్‌ రీచ్‌ నుంచి అధికారికంగా ఆన్‌లైన్‌ విధానంలో ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నాయి. అయితే ఇలా ట్రాక్టర్లు నడవడంతో దుమ్ము వస్తోందని, నీటిని చల్లాలని స్థానికులు సిరిసిల్ల తహసీల్దార్‌ మహేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్‌ వెంటనే సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌కు విషయాన్ని తెలిపి నీటిని చల్లించేందుకు చర్యలు తీసుకున్నారు. 

ఇదే క్రమంలో ఇసుక రవాణా తీరును పర్యవేక్షించేందుకు బుధవారం సాయినగర్‌ ఏరియాకు వెళ్లే క్రమంలో ఓ ట్రాక్టర్‌ ఇసుక లోడ్‌తో రాంగ్‌రూట్‌లో అధిక వేగంతో వెళ్లడం గమనించారు. అనధికారికంగా ఇసుకను తరలించే ట్రాక్టర్లు ఇక్కడ ఇలా రాంగ్‌ రూట్‌లో వెళ్తుంటాయి. కాగా ట్రాక్టర్‌ను ఆపేందుకు తహసీల్దార్‌ ప్రయత్నించారు. దీన్ని గమనించిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఇంకాస్త స్పీడ్‌ పెంచాడు. అయితే తహసీల్దార్‌ ముందుకెళ్లి ట్రాక్టర్‌ను నిలువరించగా..డ్రైవర్‌ ట్రాక్టర్‌ను ఆపకుండా అధికారి వాహనంపైకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. 

అప్రమత్తంగా వ్యవహరించిన తహసీల్దార్‌ తన వాహనాన్ని పక్కన నిలుపగానే ట్రాక్టర్‌ డ్రైవర్‌ దిగి పరారయ్యాడు. తహసీల్దార్‌ సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ శివరాత్రి శివాజీపై కేసు నమోదు చేశారు. ‘ఇసుక రవాణాకు అధికారిక అనుమతి ఉంటే ఓవర్‌స్పీడ్‌ ఎందుకు? పైగా అతివేగం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది..’అని తహసీల్దార్‌ మహేశ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement