టైరు పేలి కారు బావిలోకి.. తల్లీతనయుడి సహా మరొకరి మృతి

Car Crashed On To The Well In Karimnagar - Sakshi

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో విషాదం

బావి నిండా నీరుండటంతో గాలింపునకు ఇబ్బంది

దాదాపు 7 గంటలు శ్రమించి కారును బయటకు తీసిన సిబ్బంది  

పైకి తీస్తుండగా కారులో ఇరుక్కొని గజ ఈతగాడు మృతి 

ఈతగాడి మృతదేహం కోసం గాలింపు 

దుబ్బాక టౌన్‌: కారులో ఊరికి బయలుదేరిన తల్లీతనయుడిని విధి వక్రించింది. టైరు పేలడంతో కారు వెళ్లి నిండుగా నీళ్లున్న బావిలో పడిపోయి మృతిచెందారు. వాళ్లను ప్రాణాలతో బయటకు తీయడానికి వెళ్లిన ఓ గజ ఈతగాడు కూడా ఆ కారులోనే నీళ్లలో ఇరుక్కుపోయాడు. విగతజీవిగా మిగిలాడు. ఒకే ప్రమాదం రెండు ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది.  

కారు పల్టీలు కొడుతూ..  
మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి (45), ప్రశాంత్‌ (26) బుధవారం  కారులో హుస్నాబాద్‌ బయల్దేరారు. చిట్టాపూర్‌ శివారుకు రాగానే మధ్యాహ్నం 1.13కి కారు టైరు పేలి రోడ్డు పక్కన 20 మీటర్ల దూరంలో ఉన్న బావిలో పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో బైక్‌పై అటుగా వెళ్తున్న వాహనదారుడు వెనక్కి చూసేసరికి కారు పల్టీలు కొడుతూ బావిలో పడింది.

అతనితో పాటు మరికొందరు వాహనదారులు వెంటనే భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం భూంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు కిలోమీటరు దూరంలోని కూడవెల్లి పెద్ద వాగు దాటాక చిట్టాపూర్‌ శివారులో ఉంది. మధ్యాహ్నం 2 గంటల్లోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.  

నీళ్లు ఎక్కువగా ఉండటంతో..: పోలీసులు ఫైర్, రెవెన్యూ, విద్యుత్‌ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఏసీపీ చల్లా దేవారెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. అధికారులు, చిట్టాపూర్‌ సర్పంచ్‌ పోతనక రాజయ్య, ఎంపీటీసీ సభ్యుడు కనకయ్య, సమీప రైతులతో బావి వివరాలు సేకరించారు. సుమారు 16 గజాల లోతు బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో ఫైర్‌ సిబ్బంది, పోలీసులు ముందు గజ ఈతగాళ్లతో కలిసి పాతాల గరిగెల (హ్యాంగర్స్‌)తో గాలింపు చేపట్టారు. కానీ ఫలితం లేదు.

నీరు ఎక్కువగా ఉండటంతో రెండు పెద్ద జనరేటర్లు పెట్టి ఎత్తిపోయడం మొదలుపెట్టారు. సాయంత్రం 4 గంటల కల్లా 2 గజాల వరకు నీటినే తోడేయగలిగారు. దీంతో చేగుంట, సిద్దిపేటల నుంచి రెండు భారీ క్రేన్లు తెప్పించారు. వాటి సాయంతో గజ ఈతగాళ్లు మళ్లీ గాలింపు మొదలుపెట్టారు. క్రేన్ల కొండి బావి లోపల ఉన్న కారుకు చిక్కుకున్నా నీరు ఎక్కువగా ఉండటంతో పైకి లేస్తున్న క్రమంలో కొండ్లు జారుతూ ఇబ్బందిగా తయారైంది. 

నీటిని తోడుతూ.. గాలిస్తూ..: మరో 4 మోటార్లు పెట్టి బావిలోని నీటిని తొలగిస్తూ క్రేన్లతో కారు వెలికితీతను అధికారులు కొనసాగించారు. సుమారు 7 గంటలు శ్రమించి రాత్రి 8.20కి కారును పైకి తీశారు. కారు నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి, ప్రశాంత్‌గా గుర్తించారు. రాములు లారీ డ్రైవర్‌ కాగా భార్య లక్ష్మి రోజువారీ పనులకు వెళ్లేది. ప్రశాంత్‌ ఐటీఐ పూర్తి చేసి రామాయంపేట మండలంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కూతురు రేవతి డైట్‌ సెట్‌కు ప్రిపేర్‌ అవుతోంది.

కారులో ఇరుక్కుపోయిన గజ ఈతగాడు 
బావిలోంచి కారు తీసే క్రమంలో దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన గజ ఈతగాడు బండకాడి నర్సింహులు (40) మృతి చెందాడు. బుధవారం సాయంత్రం 3 గంటలకు  తోటి గజ ఈతగాళ్లతో కలిసి నర్సింహులు గాలింపు చర్యల్లో పాల్గొన్నాడు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో చాలాసార్లు క్రేన్‌ కొండిని తగిలించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మోటార్లతో రాత్రి 8 గంటల వరకు 5 గజాలకు పైగా నీటిని తోడారు.

తర్వాత క్రేన్‌ కొండిని కారుకు తగిలించేందుకు బావి లోపలికి వెళ్లాడు. కారుకు కొండిని తగిలించి అందులోనే ఇరుక్కుపోయా డు. క్రేన్‌ సాయంతో కారును పైకి తీస్తుండగా కారుకు, తాళ్లకు మధ్య చిక్కుకొని అపస్మారక స్థితిలో కనిపించాడు. తాళ్లను కొంత పైకి లాగాక ఒక్కసారిగా నీటిలో పడిపోయాడు. అతడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పటివరకు సహాయక చర్యలో ఉన్న గజ ఈతగాళ్లు కూడా వెళ్లిపోయారు.

పోలీసుల నిర్లక్ష్యం వల్లే: పోలీసులు, ఫైర్‌ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నర్సింహులు మృతి చెందాడంటూ అతని కుటుంబీకులు, బంధువులు రామాయంపేట–సిద్దిపేట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు బావిలో దిగకుండా ప్రైవేట్‌ వ్యక్తులను బావిలోకి దింపి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top