NEET: బయాలజీ చాలా సులువు.. కెమిస్ట్రీ కఠినం

Candidates At NEET Examination Center In Ramanthapur Hyderabad - Sakshi

బయాలజీ ఈజీ.. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ కఠినం ∙రాష్ట్రంలో 112 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ.. 97 శాతం హాజరు

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ పరీక్ష తెలంగాణలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. గతేడాదితో పోలిస్తే ఈసారి పరీక్ష మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని వైద్య విద్య నిపుణులు వెల్లడించారు. అందరికీ మార్కులు తగ్గే అవకాశముందన్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది పరీక్ష సులువుగా ఉండగా, అప్పట్లో 720 మార్కులకుగాను, 700కుపైగా మార్కులు సాధించినవారు చాలామంది ఉన్నారు.

ఈసారి ఆ సంఖ్య చాలావరకు తగ్గే అవకాశముంది. గతేడాది నీట్‌ ఆలిండియాస్థాయిలో 625 మార్కులకు 10వేల ర్యాంకు రాగా, 2019లో 560 మార్కులకు, 2018లో 540 మార్కులకు ఈ ర్యాంకు వచ్చింది. తెలంగాణలో గతేడాది జనరల్‌ కేటగిరీలో 497 మార్కులు వచ్చినవారికి ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది. ఈసారి 470 నుంచి 480 మార్కులకు వచ్చే అవకాశముంది.  

130 మార్కులొస్తే అర్హత! 
ఇక బయాలజీ పేపర్‌ చాలా సులువుగా ఉంది. అన్ని ప్రశ్నలూ సులువుగానే ఉన్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నపత్రం కొంచెం కఠినంగానే ఉంది. ప్రశ్నతోపాటు అన్ని జవాబులను కూడా జాగ్రత్తగా చదివి సమాధానం రాయాల్సినవి ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫిజిక్స్‌ పేపర్‌లో ఇచ్చిన ప్రశ్నలన్నీ కఠినంగానే ఉన్నాయి. ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చేయడానికి క్యాలిక్యులేషన్స్‌ సుదీర్ఘంగా ఉన్నాయి. 45 ప్రశ్నల్లో 30 నుంచి 35 వరకు ఎక్కువమంది చేయగలిగేలా ఉన్నాయి.

10 నుంచి 15 ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థులకు సమయం సరిపోలేదు. టాప్‌ 10 ర్యాంకులు సాధించగలిగే విద్యార్థులు మాత్రమే మొత్తం ప్రశ్నలకు సమాధానం రాసి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది జనరల్‌ కేటగిరీలో నీట్‌ అర్హత మార్కు 147 కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో 113 అర్హత మార్కుగా ఉంది. 2019లో జనరల్‌ కేటగిరీలో నీట్‌ అర్హత మార్కు 134గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో ఇది 107గా ఉంది. ఈసారి జనరల్‌ కేటగిరీలో 130 మార్కులొస్తే అర్హత సాధించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 105 మార్కులు ఉండే అవకాశముంది. 

112 కేంద్రాల్లో పరీక్ష 
నీట్‌ పరీక్షను రాష్ట్రంలో పలు నగరాల్లోని 112 కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 55 వేల మంది దరఖాస్తు చేయగా, 97 శాతం మంది హాజరైనట్లు చెప్పారు. కరోనా జాగ్రత్తలు, పరీక్ష నిబంధనల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడినా ప్రశాంతంగానే జరిగినట్లు చెబుతున్నారు.

జేఈఈ మెయిన్స్‌లో అక్రమాలు జరిగిన నేపథ్యంలో నీట్‌ పరీక్షపై నిఘా పెట్టారు. పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సీసీటీవీల ద్వారా నిఘా ఉంచారు.  కాగా, ‘నీట్‌’కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోగా, వీరిలో 95 శాతానికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈసారి దుబాయ్, కువైట్‌లోనూ ఈ పరీక్ష నిర్వహించారు.   

ఫిజిక్స్‌ కఠినం 
బాటనీ, జువాలజీ సులువుగా ఉన్నా, కొన్ని ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకున్నాయి. జువాలజీలోని ఒక ప్రశ్న మినహా అన్ని ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ నుంచే ఉన్నాయి. చాలా ప్రశ్నలు మెమరీ ఆధారంగా ఉన్నాయి. కాన్సెప్ట్‌ ప్రశ్నలు చాలా తక్కువగా ఉన్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. అన్ని ప్రశ్నలూ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ నుంచే వచ్చాయి.

కొన్ని ప్రశ్నలకు అత్యంత సమీపంగా ఆప్షన్లు ఇచ్చారు. ఐదు నుంచి పది ప్రశ్నల వరకు కఠినంగా ఉన్నాయి. మూడు ప్రశ్నలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఫిజిక్స్‌ పేపర్‌ కఠినంగా, సుదీర్ఘంగా ఉంది. సాధారణ విద్యార్థులకు సమయం సరిపోలేదు. 
– శంకర్‌రావు, డీన్, శ్రీచైతన్య కాలేజీ, కూకట్‌పల్లి

మధ్యస్థంగా ప్రశ్నలు
కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ పేపర్లలో ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. బయాలజీ సులువుగా ఉంది. మొత్తంగా నీట్‌ పరీక్ష ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. నాకు 650 నుంచి 670 మార్కులు వచ్చే అవకాశముంది. 
– రోహన్‌ కృష్ణ వడ్లమూడి, విద్యార్థి, హైదరాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top