గ్రూప్‌-1: సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు | Candidates Approach High Court division bench On Group 1 issue | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-1 పంచాయితీ.. హైకోర్టు, సుప్రీంకోర్టులో అభ్యర్థుల పిటిషన్లు

Oct 18 2024 11:46 AM | Updated on Oct 18 2024 1:32 PM

Candidates Approach High Court division bench On Group 1 issue

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్-1 పంచాయితీ మళ్లీ హైకోర్టుకు చేరింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలైంది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ గ్రూప్‌-1 అభ్యర్థులు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు.

కాగా ఈనెల 15న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ముగ్గురు అభ్యర్థులు డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. దీంతో మెయిన్స్ పరీక్షల నిర్వహణపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

సుప్రీంలోనూ పిటిషన్‌
తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థి పీ రాంబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ప్రిలిమ్స్ నుంచి మెయిన్ ఎగ్జామినేషన్‌ను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అందరికీ వర్తింపజేయాలని కోరారు. ఓపెన్ కేటగిరీలో అర్హత పొందిన  ఎస్సీ ఎస్టీ బీసీ మెరిట్ విద్యార్థుల సంఖ్యను రిజర్వ్ కేటగిరి నుంచి మినహాయించవద్దని తెలిపారు. రిజర్వేషన్ కేటగిరి విద్యార్థుల పై ఇది ప్రభావం చూపుతుందని, సుప్రీంకోర్టు గత తీర్పులకు ఇది వ్యతిరేకమని పేర్కొన్నారు.

అక్టోబర్ 21న మెయిన్స్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో ఈ కేసును త్వరగా విచారణ చేయాలని కోరారు. మెయిన్స్ ఎగ్జా మ్స్‌పై  స్టే విధించకుండా ఈ కేసు పై నవంబర్ 20వ తేదీన తుది విచారణ జరపడం వల్ల విద్యార్థులకు అన్యాయమని అన్నారు. త్వరగా విచారణకు స్వీకరించాలని చీఫ్ జస్టిస్ కోర్టులో  సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ మెన్షన్ చేశారు. అయితే  సోమవారం విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం తెలిపింది.

కాగా ఈనెల 15న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈనెల 21 నుంచి 27 వరకు యథావిధిగా మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యర్థులు మళ్లీ కోర్టు మెట్లెక్కడంతో.. మెయిన్స్ పరీక్షల నిర్వహణపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.

మరోవైపు జీవో 29 రద్దుతోపాటు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సంబంధిత అభ్యర్థులు గురువారం హైదరాబాద్‌లో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. గాంధీనగర్‌లోని కెనరాబ్యాంకు సమీపంలో ఉన్న జీహెచ్‌ఎంసీ ఉద్యానంలో వారంతా ఆందోళన చేపట్టారు. అనంతరం ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. న్యాయం చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి వారిని అరెస్టు చేసేందుకు యత్నించడంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 31 వేల మంది వరకు క్వాలిఫై అయితే.. 34 వేల మందిని మెయిన్స్‌ పరీక్షలను ఎలా అనుమతిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రూప్‌-1పై న్యాయస్థానాల్లో ఉన్న కేసులు కొలిక్కివచ్చాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement