 
													పొన్నాల దాబాల వద్ద జరిగిన ఘటన
సిద్దిపేటఅర్బన్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎక్కేందుకు ఆపి బస్సు ఎక్కకుండా ముందు టైరు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని దాబాల వద్ద జరిగింది. త్రీటౌన్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు... మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నారదాసు బాలరాజు (47) హైదరాబాద్‌లోని తన బావ ఇంటికి వెళ్లి శుక్రవారం తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు.
దుద్దెడ చౌరస్తా వద్ద దిగాల్సి ఉండగా అక్కడ దిగకుండా పొన్నాల శివారులోని ఫ్లైఓవర్ వద్ద దిగాడు. జనగామ బస్సు ఎక్కేందుకుగాను హైదరాబాద్ వైపు రోడ్డు మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు రావడంతో దానిని ఆపాడు. బస్సు ఆగగానే బస్సు ఎక్కుతున్నట్లు ప్రయత్నించి బస్సెక్కకుండా ఒక్క సారిగా ముందు టైరు కిందకు దూకేశాడు.
అయితే ఇది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు కదిలించగా అదే సమయంలో పక్క నుంచి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి డ్రైవర్‌కు చెప్పడంతో బస్సును ఆపి చూడగా బాలరాజు ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలేంటనే విషయాలు ఇంకా తెలియరాలేదు. మృతుడి కొడుకు రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చంద్రయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
