
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో దీని ప్రభావం బల్క్ డీజిల్‌పై పడింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఆయిల్ కంపెనీలు బల్క్ డీజిల్ ధరను పెంచుతూ పోతున్నాయి. మంగళవారం నాటికి హైదరాబాద్‌లో బల్క్ డీజిల్« లీటర్ ధర రూ.103.70కి చేరింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రిటైల్ ధర మాత్రం పెరగడం లేదు. దీంతో ప్రస్తుతం లీటర్ రూ.94.62కు లభ్యమవుతోంది. దీంతో బల్క్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోగా, రిటైల్ విక్రయాలు పెరిగాయి. సాధారణంగా బల్క్ డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయి.
నెల క్రితం వరకు బల్క్ డీజిల్‌పై నాలుగు నుంచి ఐదు శాతం వరకు రాయితీ లభించేది. దీంతో రిటైల్ మార్కెట్‌లో కంటే లీటరుపై రూ.4 నుంచి రూ.5 వరకు తక్కువకు డీజిల్ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మరోవైపు డిస్కౌంట్‌ను కూడా చమురు సంస్థలు నిలిపివేశాయి. దీంతో బల్క్ డీజిల్‌ను విరివిగా కొనుగోలు చేసే ఆర్టీసీ, రైల్వే వంటి సంస్థలు రిటైల్ పెట్రోలు బంకులను ఆశ్రయిస్తున్నాయి. బల్క్ డీజిల్ వినియోగంలో హైదరాబాద్ నగర వాటా 60 శాతం వరకు ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద నెలకు బల్క్‌లో డీజిల్ అమ్మకాలు 67,800 కిలో లీటరు వరకు ఉంటే అందులో నగరంలోని సంస్ధల నుంచే 40,680 కిలో లీటర్లు వరకు ఉంటాయని అంచనా.