కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం..  భూమా అఖిలప్రియ!

Boinpally Kindnap Case Directed By Akila Priya Sed Police - Sakshi

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ ఉదంతానికి ఆమె సూత్రధారి

వివరాలు వెల్లడించిన నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌

సాక్షి, హైదరాబాద్‌ : బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియే కర్త, కర్మ, క్రియ అని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. పాత్రధారుల వెనుక ఉండి కథ నడిపించేందుకే ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలిపారు. ఆమె వ్యక్తిగత సహాయకుడు సహా మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు సోమవారం వెల్లడించారు. తన కార్యాలయంలో మీడియాకు అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు.

పక్కాగా రెక్కీ చేసుకున్నాకే... 
ముగ్గురు బాధితుల్ని టార్గెట్‌గా చేసుకున్న అఖిలప్రియ నేరానికి ముందు పక్కాగా రెక్కీ చేయించారు. ఆళ్లగడ్డకు చెందిన సంపత్, కడపకు చెందిన బాల చెన్నయ్య ద్విచక్ర వాహనంపై వెళ్లి ఈ పని చేసి వచ్చారు. తమ రెక్కీలో గుర్తించిన వివరాలను భార్గవ్‌రామ్‌తో పాటు శ్రీనుకు తెలిపారు. కూకట్‌పల్లిలో ఉన్న ప్రాధ గ్రాండ్‌ హోటల్‌లో నిందితులు బస చేశారు. కిడ్నాప్‌నకు కొన్ని రోజుల ముందు గుం టూరు వెళ్లిన అఖిలప్రియ నేరం చేసే రోజు ఆ వ్యవ హారాన్ని పర్యవేక్షించడానికి తన నివాసమైన లోథ అపార్ట్‌మెంట్స్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో  వీరి మధ్య 50కి పైగా ఫోన్‌ కాల్స్‌ జరిగాయి.

మధ్యాహ్నమే మొదలైన సన్నాహాలు..
కిడ్నాప్‌ జరిగిన గత మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచే నిందితులు అఖిలప్రియ నివాసంలోనే గడిపారు. నాలుగు తేలికపాటి వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలపై బయలుదేరిన నిందితులు ఆ రోజు సాయంత్రం 4 గంటలకు యూసుఫ్‌గూడలోని భార్గవ్‌కు చెందిన ఎంజీఎం ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ వస్త్రాలు, కార్ల నంబర్‌ ప్లేట్లు మార్చుకుని బోయిన్‌పల్లి బయలుదేరారు. నకిలీ గుర్తింపుకార్డులు, వాహనాల కోసం 12 నకిలీ నంబర్‌ ప్లేట్లు తయారుచేశారు. మూడు వాహనాల్లో బోయిన్‌పల్లి వెళ్లిన వీరు ముగ్గురు బాధితుల్ని కిడ్నాప్‌ చేసి మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు తీసుకువెళ్లారు.

కీలక సాక్షిగా నార్త్‌జోన్‌ డీసీపీ.. 
వీరి కదలికలు, వ్యవహారాలకు సంబంధించిన కీలక ఆధారాలను సాంకేతిక అంశాలైన టవర్‌ లొకేషన్లు, ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ (ఏఎన్‌పీఆర్‌) సిస్టం అందించాయి. కిడ్నాపర్లు వాడిన వాహనం నగరంలోని ఏఏ ప్రాంతాల్లో సంచరించింది అనే అంశాన్ని సీసీ కెమెరాలకు అనుసంధానించి ఉన్న ఏఎన్‌పీఆర్‌ సిస్టం గుర్తించింది. అఖిలప్రియ ఆదేశాల మేరకు బాధితుల్ని విడిచిపెట్టాలని కిడ్నాపర్లు నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగెన్వర్‌కు బాధితుడు సునీల్‌రావు అర్ధరాత్రి 1.01 గంటలకు కాల్‌ చేసి చెప్పారు. ఆ సమయంలో గుంటూరు శ్రీను వినియోగించిన తాత్కాలిక నంబర్‌ కలిగిన ఫోన్‌ను వాడారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో డీసీపీ సైతం కీలక సాక్షిగా మారనున్నారు. మరో మూడు తాత్కాలిక నంబర్లు వాడిన వాళ్లే కీలకం, వారు ఎవరనేది గుర్తిస్తున్నాం. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి బోయ సంపత్‌కుమార్, ఎన్‌.మల్లికార్జున్‌రెడ్డి, రెక్కీ నిర్వహించిన బాల చిన్నయ్యలను అరెస్టు చేశాం. భార్గవ్‌రామ్‌ సహా పరారీలో ఉన్న గుంటూరు శ్రీను, గుంటూరుకు చెందిన ఎం.సిద్ధార్థ, ఎం.కృష్ణ, వి.వంశీ, దేవ ప్రసాద్, శివప్రసాద్, భాను, డి.కృష్ణ చైతన్య, అంజయ్య కోసం గాలిస్తున్నాం. కాగా, అఖిలప్రియకు సోమవారం సాయం త్రం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 

చట్టప్రకారమే.. 
భూమా అఖిలప్రియ అరెస్టుకు సం బంధించి చట్ట ప్రకారమే నడుచుకున్నాం. ఆమెను అరెస్టు చేసేప్పుడు మహిళాఇన్‌స్పెక్టర్‌ జ్యోత్స్న, ఎస్సై వెంకటలక్ష్మి ఉన్నారు. రిమాండ్‌కు తరలించే ముందు గాంధీ ఆసు పత్రి సూపరింటెండెంట్‌ పర్యవేక్షణ లో డాక్టర్ల బృందం పరీక్షించింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. జైళ్ల అథారిటీ సైతం ఉస్మానియా ఆసు పత్రి వైద్యబృందంతో మళ్లీ పరీక్షలు చేయించి ఫిట్‌ అని తేల్చింది. ఫిర్యాదులోని అంశాల ఆధారంగా ఏవీ సుబ్బారెడ్డిని ఏ–1గా చేర్చాం.  వెలు గులోకి కీలకాంశాలు రావడంతో అఖిలప్రియ అలా మారింది. సికింద్రాబాద్‌ కోర్టు అఖిలప్రియను 3 రోజుల కస్టడీకి అప్పగించింది. లోతుగా విచారించి మరిన్ని వివరాలు రాబడతాం.  – అంజనీకుమార్, సిటీ కొత్వాల్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top