మీరే పరిష్కరించుకోవాలి | Board issues clarification to Telangana, Andhra Pradesh on Krishna waters | Sakshi
Sakshi News home page

మీరే పరిష్కరించుకోవాలి

Apr 1 2026 1:21 AM | Updated on Apr 1 2026 1:21 AM

Board issues clarification to Telangana, Andhra Pradesh on Krishna waters

కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీలకు బోర్డు స్పష్టీకరణ

సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలంటూ లేఖ 

ప్రస్తుతానికి కృష్ణా ట్రిబ్యునల్‌–1 తీర్పునకు లోబడి నడుచుకోవాలని సూచన 

ఇతర వేదికలను సైతం సమస్యల పరిష్కారానికి వాడుకోవాలని సలహా 

ఏపీ జల విద్యుదుత్పత్తితో శ్రీశైలం జలాశయం ఖాళీ అవుతోందన్న తెలంగాణ 

తమ సాగు, తాగునీటి అవసరాల కోసం ఏపీని కట్టడి చేయాలని విజ్ఞప్తి 

రాష్ట్ర ప్రభుత్వ లేఖకు స్పందనగా కృష్ణా బోర్డు తాజా లేఖ  

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల విషయంలో నదీ యాజమాన్య బోర్డు చేతులెత్తేసింది. ఇకపై నీటి తరలింపు, ఇతర అంశాలకు సంబంధించిన సమస్యలను మీకు మీరే పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు తేల్చిచెప్పింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ విషయంలో రెండు రాష్ట్రాలు ప్రస్తుతం అమల్లో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్‌–1 తీర్పునకు లోబడి నడుచుకోవాలని సూచించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖలకు మార్చి 30న లేఖ రాసింది. ఏపీ శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ కిందికి నీళ్లను విడుదల చేస్తుండడంతో జలాశయం ఖాళీ అవుతోందని, తమ సాగునీటి అవసరాలతో పాటు వేసవి తాగునీటి అవసరాలకి నిల్వలను పరిరక్షించడం కోసం జల విద్యుదుత్పత్తి జరపకుండా ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని కోరుతూ తెలంగాణ మార్చి 25న కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఈ లేఖకు స్పందిస్తూ రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు తాజాగా లేఖ రాసింది.  

పెండింగ్‌ అంశాలతో బోర్డుకు ప్రాథమిక పరిమితులు.. 
ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న వాటాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా పునః కేటాయింపులు జరపడంతో పాటు ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నిర్వహణకు సంబంధించిన ఆపరేషన్‌ ప్రొటోకాల్స్‌ను జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌–2 ఖరారు చేయాల్సి ఉంది. అలాగే ఏపీ పునర్విభజన చట్టం, 2014 ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ మేరకు రెండు రాష్ట్రాలు ఉమ్మడి జలాశయాలను కృష్ణా బోర్డుకు అప్పగించాల్సి ఉంది. ఈ విషయాలు తేలకపోవడం.. తమ విధులకు సంబంధించి ప్రాథమిక పరిమితులుగా మారిందని కృష్ణా బోర్డు పేర్కొంది. ఇవన్నీ తేలేవరకు పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాలకు స్పష్టం చేసింది.  

ఇకనైనా ఏపీని కట్టడి చేయాలి 
– కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ 
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరపకుండా ఏపీ జెన్‌కోను కట్టడి చేయాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మార్చి 25న లేఖ రాసింది. ‘శ్రీశైలం జలాశయంలో నిల్వలు గత మార్చి 20 నాటికి 839.9 అడుగులకు పడిపోవడంతో కనీస నిల్వ మట్టానికి ఎగువన 7.824 టీఎంసీల నీళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రాష్ట్రానికి తాగునీటితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద సాగునీటి అవసరాల కోసం జలాశయంలో నిల్వలను పరిరక్షించాల్సి ఉంది. నాగార్జునసాగర్‌ కుడి ప్రధాన కాల్వ ఆయకట్టు అవసరాలను తీర్చడానికే ఏపీ.. శ్రీశైలం నుంచి సాగర్‌కు విద్యుదుత్పత్తి ద్వారా నీళ్లను విడుదల చేస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయం వేగంగా ఖాళీ అవుతోంది. 

సాగర్‌ కుడి ప్రధాన కాల్వకు 132 టీఎంసీల కేటాయింపులుండగా, ఏపీ ఇప్పటికే 178.06 టీఎంసీలను తరలించుకుంది..’ అని తెలంగాణ వివరించింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ ఏకంగా 738.25 టీఎంసీల (76.19శాతం) కృష్ణా జలాలను వాడుకోగా, తాము 230.76 టీఎంసీలు (23.18శాతం) మాత్రమే వాడుకున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి ఏపీ ఇంకా నీళ్లు తీసుకోకుండా కట్టడి చేయాలని ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినా బోర్డు పట్టించుకోవడం లేదని, ఇకనైనా ఏపీని కట్టడి చేయాలని కోరింది.  

లెక్కలు ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయండి
కేంద్ర జలశక్తి శాఖ 2015 జూన్‌ 18, 19న ఏపీ, తెలంగాణతో నిర్వహించిన సమావేశంలో త్రిసభ్య కమిటీ ద్వారా నీటి పంపకాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించిన విషయాన్ని బోర్డు గుర్తు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల పరిష్కారానికి సీడబ్ల్యూసీ చైర్మన్‌ అధ్యక్షతన ఇటీవల కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం ప్రస్తావించింది. త్రిసభ్య కమిటీ, సీడబ్ల్యూసీ కమిటీతో పాటు ఇతర వేదికలను జల వివాదాల పరిష్కారానికి వినియోగించుకోవాలని సూచించింది. 

మరోవైపు ఒక్కో మేజర్, మీడియం ప్రాజెక్టుతో పాటు స్థూలంగా అన్ని మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా ప్రతినెలా వాడుకుంటున్న కృష్ణా జలాల లెక్కలను రెండు రాష్ట్రాలు క్రమం తప్పకుండా తమ వెబ్‌పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని కృష్ణా బోర్డు కోరింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం త్రిసభ్య కమిటీ సమావేశమైనప్పుడు ఈ గణాంకాలు అవసరం అవుతాయని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement