ఊరంతామునక.. గూడు చెదిరి.. గుండె పగిలె.. ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన

BN Thimmapur Villagers Troubles For Not Getting Full Compensation - Sakshi

సాక్షి, యాదాద్రి: బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న భూములు, ఇళ్లకు పూర్తి పరిహారం ఇవ్వకుండానే అధికార యంత్రాంగం అక్కడి ప్రజలను ఖాళీ చేయిస్తోంది. దీంతో ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన కారణంగా మనస్తాపం చెందిన నిర్వాసితుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఎన్‌ తిమ్మాపూర్‌ గ్రామంలో నెలకొన్న దయనీయపరిస్థితి ఇది.

వ్యవసాయ భూములు, ఇళ్లు పోయి.. పరిహారం రాక భవిష్యత్తుపై భయంతో పాటు రకరకాల కారణాలతో దాదాపు ఐదేళ్లలో గ్రామంలో 50 మందికి పైగా చనిపోయారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు.., తమకు పిల్లను ఇవ్వడంలేదని మనోవేదనతో కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు అనారోగ్యంతో మంచంపట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గత 57 రోజులుగా బస్వాపూర్‌ ప్రాజెక్టు కట్టపై నిర్వాసితులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. బుధవారం కూడా ఓ నిర్వాసితుడు బెంగతో చనిపోయాడు.

ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు.. 
కాళేశ్వరం ప్రాజెక్టులో చివరిదైన నృసింహసాగర్‌ రిజర్వాయర్‌ (బస్వాపూర్‌ రిజర్వాయర్‌)ను 11.39 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు 1,724 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇందులో 700 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బీఎన్‌ తిమ్మాపూర్, లక్ష్మీనాయకుని తండా, చోకల్‌నాయకుని తండాలు పూర్తిగా మునిగిపోతున్నాయి.

ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ముంపు గ్రామాల వాసులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో జాప్యం అవుతోంది. బీఎన్‌ తిమ్మాపూర్‌ గ్రామస్తుల వ్యవసాయ భూములకు పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు అందరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న గ్రామంలోని 655 నివాస గృహాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ముంపు భూములకు పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ డబ్బులను మరింత పెంచి ఇవ్వాలని గ్రామస్తులు తీర్మానం చేసి నోటీసులు తీసుకోకుండా అధికారులను తిప్పిపంపారు.

655 మందికే పరిహారం.. 
బీఎన్‌ తిమ్మాపూర్‌లో గ్రామకంఠంతోపాటు పరిసరాల్లోని 36.11 ఎకరాల భూమి మునుగుతోంది. ఇంతవరకు ఈ భూమికి సంబంధించి అవార్డు ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఎంత పరిహారం వస్తుందో తెలియని పరిస్థితి. అలాగే భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 90 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద గ్రామంలో 1,086 మంది నిర్వాసితులు తేలారు. వీరిలో 655 మందికి పరిహారం చెల్లించారు.

ఒక్కొక్కరికి రూ.7.61 లక్షల చొప్పున రూ.50 కోట్లు పంపిణీ చేశారు. మిగతా వారికి రూ.34 కోట్లు రావాల్సి ఉంది. డబ్బులు ఒకేసారి ఇవ్వకపోవడంతో విడతలుగా వచ్చిన డబ్బులు వృథాగా ఖర్చవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. డబ్బులు చేతికి వచ్చిన వారిలో సగం మందికిపైగా చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా ఖర్చు అయ్యాయని చెపుతున్నారు. పరిహారం రాని వారు ఎప్పుడిస్తారో.. అని ఎదురుచూస్తున్నారు. 

గ్రామస్తుల ప్రధాన డిమాండ్లు..
2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి.
2019లో ప్రకటించిన అవార్డును రద్దు చేసి కొత్తగా భూసేకరణ అవార్డును ప్రకటించాలి.
ప్రాజెక్టు ముంపులో కోల్పోతున్న వ్యవసాయ భూములు, ఇళ్లకు పరిహారం ఒకేసారి చెల్లించాలి.
గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని ప్రకటించాలి
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని హుస్నాబాద్‌ వద్ద 107 సర్వే నంబర్‌లో చేపట్టిన లేఅవుట్‌ ప్లాట్లను వెంటనే బీఎన్‌ తిమ్మాపూర్‌ గ్రామస్తులకు కేటాయించాలి. ఒక్కో ఇంటినిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలి. 

పరిహారం డబ్బులన్నీ పప్పు పుట్నాలకే.. 
ప్రభుత్వం తీసుకున్న భూములకు పరిహారం డబ్బులన్నీ ఒకేసారి ఇవ్వకపోవడంతో నిర్వాసితులకు ఇంతవరకు ఇచ్చిన డబ్బులన్నీ ఇతర అవసరాలకే ఖర్చయ్యాయి. అప్పుడప్పుడు ఇచ్చిన పరిహారం డబ్బులు ఇలా ఖర్చు కావడంతో రైతుల చేతులు ఖాళీ అయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు తొలుత ఎకరానికి రూ.6 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు.

బస్వాపూర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు   

ఆ తర్వాత రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 0.87 టీఎంసీలనుంచి 11.39 టీఎంసీలకు పెంచిన ప్రభుత్వం.. నిర్వాసితులకు 123 జీవో ప్రకారం పరస్పర అంగీకారం ద్వారా ఎకరానికి రూ.15.60 లక్షల చొప్పున 400 ఎకరాలకు పరిహారం ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2019 డిసెంబర్‌ 11న జారీచేసిన అవార్డు ప్రకారం దానిని సవరించి ఎకరానికి రూ.15.30 లక్షలు నిర్ణయించింది. అయితే, పరిహారం మరింత ఎక్కువగా ఇవ్వాలని రైతులు కోరుతూ వస్తుండగా.. రూ.30 వేలు తగ్గడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎక్కువ పరిహారం వస్తుందని భావించిన రైతులకు పరిహారం ఇలా తక్కువగా రావడంతో తీవ్ర మనో వేదన చెందుతున్నారు.

మా భూమికి డబ్బులు రాలేదు 
బస్వాపురం రిజర్వాయర్‌లో మా భూమి 12 ఎకరాలు పోయింది. ఇందులో 5 గుంటల భూమి పైసలు మాత్రమే పడ్డాయి. మిగతా డబ్బులు నేటికీ ఇవ్వలేదు. పునరావాసం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు కానీ నేటికీ లేదు. రెవెన్యూ అధికారులు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా గ్రామంలో ఉన్న ఇళ్లకు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. ముంపు భూములు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ డబ్బులు మొత్తం అందరికీ ఇస్తే తప్ప నోటీసులు తీసుకోబోమని చెప్పాం. 
– ఎండీ సాబేర్, బీఎన్‌ తిమ్మాపురం 

అనారోగ్యం పాలవుతున్నాం
ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూస్తూ, ఎంత వస్తుందో.. ఎప్పుడు ఇస్తా రో అని ఆలోచిస్తూ అనారోగ్యం పాలు అవుతున్నాం. గ్రామంలో ఇలా ఆలోచించి కొందరు చనిపోగా, మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. నాకున్న అర ఎకరం వ్యవసాయ భూమి బస్వాపురం రిజర్వాయర్‌ కట్ట కోసం పోయింది. అప్పుడు ఎకరానికి రూ.6 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఆ డబ్బులతో ఎక్కడా భూమి కొనుగోలు చేయలేకపోయాం. ఇంటి కోసం ఇచ్చే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకెజీ కోసం ఎదురు చూస్తున్నాం. 
– జంగిటి సుగుణ, బీఎన్‌ తిమ్మాపూర్‌  

రూ. 46.35 కోట్లు విడుదల
బస్వాపూర్‌ ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాల పరిహారం, లే అవుట్‌ అభివృద్ధికి ప్రభుత్వం బుధవారం రూ.46.35 కోట్లను విడుదల చేసింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి బా«ధితులకు పరిహారం ఇవ్వాలని కోరడంతో వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం రూ.33.45 కోట్లు, పునరావాస లేఅవుట్‌ అభివృద్ధికి రూ.12.90 కోట్లు ఉన్నాయి. రెండురోజుల్లో బాధితులకు పరిహారం అందుతుంది.  
– ఫైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top