Modi Telangana Tour: BJP Plans Grand Welcome for PM Narendra Modi - Sakshi
Sakshi News home page

తెలంగాణకు మోదీ..అపూర్వ స్వాగతం పలికేలా భారీ ఏర్పాట్లు..షెడ్యూల్‌ ఇదే..

Published Thu, May 26 2022 1:32 AM

Bjp Plans Grand Welcome for PM Narendra Modi - Sakshi

Modi Telangana Tour, సాక్షి, హైదరాబాద్‌/సనత్‌నగర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రానికి రానున్నారు. నగరంలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అదీగాక, కేంద్రంలో కాంగ్రెసేతర ప్రధానిగా ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మోదీకి అపూర్వమైన రీతిలో స్వాగతం పలకనుంది. గతంలో ప్రధాని పదవిని చేపట్టాక గుజరాత్‌లో అడుగిడినప్పుడు మోదీకి అక్కడ స్వాగతం పలికిన పంథాలో ఇక్కడా ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.25 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వచ్చే మోదీకి రాష్ట్ర ముఖ్యనాయకులు స్వాగతం పలుకుతారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై నుంచి భారీగా తరలివచ్చే కార్యకర్తలు, ప్రజలకు మోదీ అభివాదం చేస్తారు. దాదాపు 10 నిమిషాలపాటు ఇక్కడివారిని ఉద్దేశించి ప్రసంగిస్తారని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సంబంధిత వర్గాల నుంచి అనుమతి లభించినట్టు తెలుస్తోంది. ప్రధాని పర్యటనకు సుమారు 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.  

మోదీ పర్యటనతో ఫుల్‌ జోష్‌ 
రాష్ట్ర బీజేపీలో మోదీ హైదరాబాద్‌ పర్యటన కొత్త ఉత్సాహం నింపుతోంది. దాదాపు 20 రోజుల వ్యవధిలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు రాష్ట్రానికి రావడం పార్టీకి శుభపరిణామంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలు రాష్ట్రపార్టీకి, శ్రేణులకు మంచి ఊపునిస్తున్నాయని అంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా జాతీయస్థాయి ముఖ్యనేతలు వరస పర్యటనలకు వచ్చేలా జాతీయ నాయకత్వం కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. మోదీకి స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల కోసం మొత్తం ఆరుసెట్ల నాయకుల లైనప్‌లను పార్టీ రూపొందించింది. మోదీ చెంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, డా.కె.లక్ష్మణ్, టి.రాజాసింగ్, ఇతరనేతలు ఉండే అవకాశాలున్నాయి. బేగంపేట నుంచి హెచ్‌సీయూకు వెళ్లేటప్పుడు హెలికాప్టర్‌లో మోదీ వెంట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెళ్లనున్నారు. అవకాశాన్ని బట్టి బండి సంజయ్‌ కూడా వెళ్లే అవకాశముంది. ప్రధాని హెచ్‌సీయూ నుంచి రెండు కి.మీ. దూరంలోని ఐఎస్‌బీకి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలు, హోర్డింగ్‌లు ఏర్పాటుచేశారు. ప్రధాని హాజరుకానున్న ఐఎస్‌బీ స్నాతకోత్సవానికి పాస్‌లు ఉంటేనే అనుమతిస్తారు. సుమారు 1,200 మంది విద్యార్థులకు పాస్‌లు జారీ చేసినట్లు తెలిసింది.  

కేసీఆర్‌ తీరుతో ప్రజలు విసిగిపోయారు: కె.లక్ష్మణ్‌ 
ప్రధాని మోదీ ఐఎస్‌బీ స్నాతకోత్సవంలో విద్యార్ధులకు దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనకపోవడం శోచనీయం. ముఖ్యమంత్రికి ముఖం చెల్లక బెంగుళూరు పర్యటన పేరుతో తప్పించుకు తిరుగుతున్నారు. విదేశీ పర్యటనలో ప్రవాస భారతీయులు ప్రధానికి బ్రహ్మరథం పడుతుండగా ఇక్కడ కేసీఆర్‌ మాత్రం రాజకీయాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. సీఎం ఇక్కడి రైతుల బాధలను పట్టించుకోకుండా ఉత్తరాది రైతులను ఆదుకుంటామని చెప్పడం విచారకరం. అన్ని వర్గాల ఆశలను అడియాసలు చేసిన కేసీఆర్‌ తీరుపై ప్రజలు విసిగిపోయారు. 

ప్రధాని మోదీ షెడ్యూల్‌ 
హైదరాబాద్‌లో రెండున్నర గంటల పాటు సాగనున్న మోదీ పర్యటన షెడ్యూల్‌ ఇలా.. 

  • మధ్యాహ్నం 1:25 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీఎస్, డీజీపీ, మేయర్‌ స్వాగతం పలుకుతారు. 
  • బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి 1:50 గంటలకు హెచ్‌సీయూ క్యాంపస్‌లో దిగుతారు. 
  • అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో 2 గంటలకు ఐఎస్‌బీకి చేరుకుంటారు. 
  • 3:15 గంటల దాకా ఐఎస్‌బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ప్రసంగిస్తారు.  
  • 3:20 గంటలకు ఐఎస్‌బీ నుంచి బయలుదేరి 3:30కు హెచ్‌సీయూకు వస్తారు. 
  • 3:50 గంటలకు బేగంపేటకు చేరుకొని 3:55 గంటలకు విమానంలో చెన్నైకి పయనమవుతారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement