
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గుచూపింది. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉందంటూ జరుగుతున్న విస్తృత ప్రచారానికి తెరదించేందుకు సిద్ధమైంది. పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ సొంతంగానే పోటీచేస్తామని.. బీఆర్‌ఎస్‌తో పొత్తుగానీ, ఎలాంటి అవగాహనగానీ ఉండదని ప్రజలకు చాటాలని తెలంగాణ బీజేపీ నేతలకు స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌లకు పలు సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ విజయ సంకల్పయాత్రలను ప్రారంభించి.. అందరికన్నా ముందుగా ఎన్నికల సమరం ప్రారంభించిందని వివరిస్తున్నాయి.
వరుసగా పొత్తు వార్తల నేపథ్యంలో..
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని, అందుకు బీజేపీ ఢిల్లీనేతలు కూడా సుముఖంగా ఉన్నారంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు, కొందరు రాష్ట్ర మంత్రులు కూడా బీఆర్‌ఎస్–బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని, ఆ రెండు పార్టీల మధ్య రహస్య బంధం కొనసాగుతోందని ఆరోపణలు చేస్తున్నారు. ఒకరిద్దరు బీఆర్‌ఎస్ నేతలు కూడా బీజేపీతో పొత్తు ఉండవచ్చంటూ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో కూడా బీఆర్‌ఎస్–బీజేపీల పొత్తు ప్రచారం ముమ్మరమైంది.
అయోమయానికి తెరదించుతూ..
బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రచారం బీజేపీ శ్రేణుల్లో అయోమయం, గందరగోళానికి దారితీసింది. ఇదిలాగే కొనసాగితే క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలపైనా ప్రభావం పడవచ్చని భావించిన బీజేపీ అప్రమత్తమైంది. బీజేపీ రాష్ట్ర కీలక నేతలు ఎలాంటి పొత్తు ఉండదని పలుమార్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆ పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ ఎలాంటి పొత్తు, సీట్ల సర్దుబాటు వంటివి ఉండబోవని స్పష్టం చేసింది.
వచ్చే నెల రెండోవారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చన్న అంచనా నేపథ్యంలో పార్టీ శ్రేణులు, ప్రజల్లో గందరగోళం తలెత్తకుండా చూడాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులకు ఫోన్‌చేసి స్పష్టమైన సూచనలు చేసినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే పొత్తు కోసం బీఆర్‌ఎస్ చేసిన ప్రతిపాదనలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇటీవల ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల దృష్టికి తీసుకెళ్లారని.. వారు నిర్ద్వందంగా తిరస్కరించారని ఢిల్లీ వేదికగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
మోదీ ఫ్యాక్టర్.. పెరిగిన మద్దతుతో..
రాష్ట్రంలో బీజేపీకి సానుకూలత పెరిగిందని, దీనికి ప్రధాని మోదీ చరిష్మా జతకలిస్తే.. ఇక్కడ మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తామని ఆ పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు చెప్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సొంతంగా 4 సీట్లు గెలిచామని గుర్తు చేస్తున్నారు. ఈసారి బీజేపీ ఏడెనిమిది సీట్లు గెలుస్తుందని సర్వేల్లో తేలిందని, పార్టీ నాయకులు కొంచెం కష్టపడితే మరో రెండు సీట్లనూ సాధించవచ్చని జాతీయ నాయకత్వం స్పష్టం చేసిందని అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇతర ప్రధాన పార్టీల కంటే ముందే.. 17 ఎంపీ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించి విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టినట్టు వివరిస్తున్నారు.
త్వరలోనే అభ్యర్థుల ఎంపిక
ఈనెల 24న ఢిల్లీలో జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో కనీసం సగం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడం, జనసేనతో పొత్తు కారణంగా పార్టీ బలంగా ఉన్న కొన్నిసీట్లను కోల్పోవాల్సి రావడంతో ఇబ్బంది ఎదురైందని అంటున్నాయి.
అందువల్ల ఈసారి తొందరగానే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించేందుకు జాతీయ నాయకత్వం సిద్ధమైందని చెప్తున్నాయి. కాగా.. ఈనెల 24న లేదా 25న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు రావాల్సి ఉందని.. కానీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ నేపథ్యంలో పర్యటన వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడిందని పార్టీ వర్గాల సమాచారం.