తెలంగాణపై కాషాయ జెండా | BJP aims for double-engine Govt in Telangana in 2028: Nitin Nabin | Sakshi
Sakshi News home page

తెలంగాణపై కాషాయ జెండా

Jun 30 2026 6:18 AM | Updated on Jun 30 2026 6:18 AM

BJP aims for double-engine Govt in Telangana in 2028: Nitin Nabin

బీజేపీ బూత్‌ అధ్యక్షుల సమ్మేళనంలో పార్టీ నేతలు బహూకరించిన విల్లును ఎక్కుపెడుతున్న నితిన్‌ నబీన్‌. సమ్మేళనానికి హాజరైన బీజేపీ బూత్‌ అధ్యక్షులు

2028లో అదే జరుగుతుంది.. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఏర్పడి తీరుతుంది: నబీన్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణపై కాషాయ జెండా ఎగురుతుందని.. బీజేపీ అధికారంలోకి వచ్చి డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ సిన్హా జోస్యం చెప్పారు. ఆ లక్ష్య సాధన కోసం ప్రతి బూత్‌లో పార్టీని బలోపేతం చేయాలని.. కార్యకర్తలంతా ప్రజల్లో నిరంతరం ఉండాలని పిలుపునిచ్చారు.

సోమవారం మధ్యాహ్నం హనుమకొండలో వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధన కోసం గిరిజన నేతలతో సమావేశమైన ఆయన.. అనంతరం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన పార్టీ బూత్‌ అధ్యక్షుల సమ్మేళనంలో మాట్లాడారు. బీజేపీ విజయానికి బూత్‌ అధ్యక్షులు, బూత్‌ కమిటీలను వెన్నముకగా అభివర్ణించారు. వారి కృషి వల్లే దేశవ్యాప్తంగా కమలం వికసిస్తోందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించడంలో బూత్‌ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమన్నారు.

తెలంగాణతో బీజేపీది పోరాటాల బంధం
తెలంగాణతో బీజేపీకి కేవలం రాజకీయ సంబంధం మాత్ర­మే కాదని.. అది పోరాటాల ద్వారా ఏర్పడిన బంధమని నితిన్‌ నబీన్‌ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో బీజేపీ రాజకీయ లాభనష్టాలు చూడకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు మద్దతిచ్చిందని చెప్పారు. దివంగత సుష్మా స్వరాజ్‌ పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చారని గుర్తుచేశారు.

బీజేపీ తెలంగాణకు కొత్త పార్టీ కాదన్న ఆయన.. 1980లో పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా గెలిచిన రెండు స్థానాల్లో ఒకటి తెలంగాణ నుంచే రావడం చారిత్రక విషయమన్నారు. అధికారం కోసం కాకుండా ప్రజాసేవ కోసం బీజేపీ పనిచేస్తోందని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గొంతుకగా, అధికారంలో ఉన్నప్పుడు మరింత సమర్థంగా ప్రజలకు సేవ చేయాలన్నదే పార్టీ సిద్ధాంతమని చెప్పారు.

బీజేపీ కార్యకర్తలంతా పూర్తిస్థాయి ప్రజాసేవకులు
గత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరించి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని నితిన్‌ నబీన్‌ ఆరోపించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాధనాన్ని కుటుంబ ప్రయోజనాల కోసం వినియోగించిందని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనలో ప్రజల ఆశలు నెరవేరలేదని, తెలంగాణకు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల్లో కనిపించే పార్ట్‌టైమ్‌ రాజకీయ నాయకుడు అని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు మాత్రం 24 గంటలూ ప్రజల కోసం పనిచేసే ఫుల్‌టైమ్‌ ప్రజాసేవకులని కొనియాడారు.

వరంగల్‌ అభివృద్ధిపై చర్చకు సిద్ధం: జి. కిషన్‌రెడ్డి
తెలంగాణలో బీజేపీ అధికారంలో లేకపోయినా వరంగల్‌ అభివద్ధికి కేంద్రం గణనీయమైన నిధులు కేటాయించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీకి వరంగల్‌పై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. కేంద్రం చేసిన అభివృద్ధిపై నివేదికతో సహా చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు వరంగల్‌కు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ఏం చేసిందని విమర్శించే వారికి పూర్తి వివరాలతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని... కేసీఆర్, రాహుల్‌ గాంధీ విమర్శలు వాస్తవాలకు విరుద్ధంగా ఉందని విమర్శించారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ తర్వాత అత్యధికంగా కేంద్ర నిధులు వరంగల్‌కే వచ్చాయని.. కానీ వాటిని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. స్మార్ట్‌ సిటీ నిధులతో కరీంనగర్‌ అభివృద్ధి చెందగా వరంగల్‌లో అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురుతుందని.. బీజేపీ గెలిస్తేనే వరంగల్‌ సుందర నగరంగా మారుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆశిష్‌ షెలార్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్, జాతీయ, రాష్ట్ర నాయకులు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, టి.రాజేశ్వర్‌రావు, దొంతి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆ మూడు వర్గాల సాధికారతతోనే రాష్ట్రాభివృద్ధి
యువత, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని నితిన్‌ నబీన్‌ చెప్పారు. ఆ మూడు వర్గాల సాధికారత ద్వారానే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్‌ సిద్ధాంతంతో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రతి కుటుంబానికీ తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement