మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌తో మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర చర్చ

Bill Gates Telangana IT Minister KTR Discussed Various Issues 19th Bioasia Conference - Sakshi

వేగంగా టీకాల అభివృద్ధి, ఆక్సిజన్‌ కొరత నివారణ ఆ కోవలోవే

19వ బయో ఆసియా సదస్సులో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌

వర్చువల్‌గా మంత్రి కేటీఆర్‌తో చర్చ.. పలు ప్రశ్నలకు సమాధానాలు  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మానవాళి స్పందించిన తీరు ఆశించినంతగా లేదని మైక్రోసాఫ్ట్‌ అధినేత, గిఫ్ట్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు బిల్‌గేట్స్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఈ మహమ్మారి మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని చెప్పారు. హైదరాబాద్‌లో గురువారం వర్చువల్‌ పద్ధతిలో మొదలైన 19వ బయో ఆసియా సదస్సులో బిల్‌గేట్స్, తెలంగాణ ఐటీ మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రెండేళ్ల కరోనా మహమ్మారి మనిషికి నేర్పించిన పాఠాలు ఏవని ప్రశ్నించగా గేట్స్‌ స్పందిస్తూ వ్యాక్సిన్లను అత్యంత వేగంగా తయారు చేయగలగడం మ నిషి సాధించిన ఘనత అని వ్యాఖ్యానించారు. అ లాగే ఆక్సిజన్‌ కొరత విసిరిన సవాళ్లనూ సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు. అంతర్జాతీయ సహకారంతో భారత్‌ టీకాలను వేగంగా తయారు చేసింద ని, ప్రజలందరికీ ఈ టీకాలను అందించే విషయంలో ధనిక దేశాలకంటే మెరుగ్గా వ్యవహరించిం దని కొనియాడారు. టీకాల సమర్థ పంపిణీతో ఎ న్నో విలువైన ప్రాణాలను కాపాడగలిగిందన్నారు. 

సిద్ధంగా ఉండాలి.... 
భవిష్యత్తులోనూ కరోనా లాంటి మహమ్మారులు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు మానవాళి సంసిద్ధంగా ఉండాలని గేట్స్‌ ఆకాంక్షించారు. మెరుగైన వ్యాక్సిన్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో రాగల మహమ్మారి గురించి గేట్స్‌ 2015లోనే అంచనా వేయడాన్ని కేటీఆర్‌ ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు కరోనా మాదిరిగా ఏళ్లపాటు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తు మహమ్మారిని ఎదుర్కొనేందుకు పరిశోధనలపై అన్ని దేశాలు దృష్టి పెట్టాలని కోరారు. జీవశాస్త్రంలో మనిషి ఊహించని స్థాయిలో ఆవిష్కరణలు జరగనున్నాయని, అవి భవిష్యత్‌ సవాళ్లకు మనల్ని సిద్ధం చేస్తాయని అన్నారు. 

ఎంఆర్‌ఎన్‌ఏదే భవిష్యత్తు...  
హెచ్‌ఐవీ మొదలు అనేక ఇతర వ్యాధులకు చికిత్స అందించే సామర్థ్యంగల ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీదే భవిష్యత్తు అని బిల్‌గేట్స్‌ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఎంఆర్‌ఎన్‌ఏ సాం కేతికత అందర్నీ ఆశ్చర్యపరిచిందన్నారు. ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రయత్నాలు ము మ్మరం చేసిందని చెప్పారు. సృజనాత్మక ఆలోచనలతో చవకైన మందులను తయారు చేయగల సామర్థ్యం ఉన్న భారతీయ కంపెనీలతోనూ ఫౌండేషన్‌ భాగస్వామ్యం ఏర్పాటు చేసు కున్నట్లు ఆయన తెలిపారు. హెచ్‌ఐవీతోపాటు అనేక వ్యాధులకు రానున్న 10–15 ఏళ్లలో ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ ద్వారా చికిత్స అందించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో సెన్సార్లు కృత్రిమ మేధ సా యంతో పనిచేసే పరికరాలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తేనున్నాయన్నారు. హైదరాబాద్‌కు ఎప్పుడు వస్తారన్న కేటీఆర్‌ ప్రశ్నకు కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తేశాక ఆసియాలో పర్యటించే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top