రుణ ప్రణాళికను విడుదల చేస్తున్న భట్టి, తుమ్మల
తెలంగాణ వృద్ధి రేటు 10.7 శాతం... దేశ సగటు కంటే వేగంగా వృద్ధి రేటు
పట్టణీకరణతో సేవల రంగానికి భారీ అవకాశాలు...విద్యార్థుల రుణాలు భవిష్యత్ పెట్టుబడులు
బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్ : 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇది పెద్ద కల అని, రాష్ట్ర ప్రస్తుత వృద్ధి రేటు చూస్తుంటే ఇది కచ్చితంగా సాధ్యమేనని స్పష్టమౌతోందన్నారు. ప్రస్తుతం దేశ సగటు ఊవృద్ధి రేటు 8.2% గా ఉంటే, తెలంగాణ వృద్ధి రేటు 10.7% తో దూసుకుపోతోందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం రూ.2.1 లక్షలుగా ఉంటే, తెలంగాణ తలసరి ఆదాయం రూ.4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉందని ప్రకటించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు దాదాపు రూ.9.43 లక్షల కోట్లకు, అడ్వాన్సులు రూ.12.34 లక్షల కోట్లకు చేరుకుందన్నారు.
రాష్ట్రం 130.78 శాతం క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తితో ముందుకు సాగడం గొప్పవిషయమన్నారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి రూ.1,65,297 కోట్ల లక్ష్యానికిగాను రూ.1,68,401 కోట్లు పంపిణీ చేసి 101.88 శాతం సాధించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. శుక్రవారం ప్రజాభవన్‌లో 49వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, మహిళ, దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని కోరారు. విద్యార్థులకు ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు మరింత సానుకూల దృక్ఫథంతో ముందుకు రావాలన్నారు.
సౌరశక్తి ప్రాజెక్టులు, రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ఇతర పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు బ్యాంకులు చురుగ్గా రుణ సహాయం అందించాలని సూచించారు. సామాజిక భద్రత, బీమా పథకాల పరిధిలోకి రాష్ట్ర ప్రజలను తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో త్వరలోనే అనేక ఇండస్ట్రియల్ హబ్‌లు, క్లస్టర్లను తీసుకువస్తున్నట్టు భట్టి వెల్లడించారు. ఇందులో భాగంగా ఫార్మా, ఫ్యాబ్ సిటీ, స్టీల్, లెదర్, టెక్స్‌టైల్ వంటి వివిధ రంగాలను డిజైన్ చేస్తున్నట్టు చెప్పారు.
స్వల్పకాలిక రుణాలకే బ్యాంకులు పరిమితం : మంత్రి తుమ్మల
ఇప్పటికీ వ్యవసాయ రుణాల్లోఅధిక భాగం స్వల్పకాలిక పంట రుణాలకే బ్యాంకులు పరిమితం కావడం ఆందోళన కలిగించే విషయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయం ఇప్పుడు ఉద్యానవనం, ఆయిల్ పామ్, సమగ్ర వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షిత సాగు, పాడి, మత్స్య, యాంత్రీకరణ వంటి రంగాల వైపు వేగంగా మారుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఇందుకు అనుగుణంగా స్పందించాలని కోరారు. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్ హౌస్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రిప్ ఇరిగేషన్, సోలార్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ వంటి రంగాలకు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలని సూచించారు. 2025–26 లో పంట రుణాల పంపిణీ రూ.75,486 కోట్లకు చేరి, వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంలో 84.34 శాతం సాధించిందన్నారు.
మొత్తం వ్యవసాయ, అనుబంధ రంగాలు, మౌలిక వసతుల కింద రూ.1,68,401 కోట్ల రుణాలు పంపిణీ చేసి 101.88 శాతం లక్ష్య సాధన నమోదు కావడం రాష్ట్ర బ్యాంకింగ్ వ్యవస్థ పురోగతిని సూచిస్తోందన్నారు. శుక్రవారం 49వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) త్రైమాసిక సమావేశంలో మంత్రి బ్యాంకింగ్ సంస్థల ప్రతినిధులు, నాబార్డ్ అధికారులు, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రధాన రంగ రుణాలు రూ.4.09 లక్షల కోట్లు, వ్యవసాయ రుణాలు రూ.1.87 లక్షల కోట్లకు చేరడం సంతోషకరమన్నారు. పీఆర్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ దాన కిషోర్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ ప్లానింగ్ సెక్రెటరీ గౌరవ్ ఉప్పల్, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ మోహన్, ఎస్‌బీఐ సీజీఎం నీలేష్ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.


