కొత్త వెలుగుల వ్యాసపురి | Basara Temple Development Works Begin with Rs 225 Crores in Telangana: CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

కొత్త వెలుగుల వ్యాసపురి

Apr 6 2026 1:15 AM | Updated on Apr 6 2026 1:15 AM

Basara Temple Development Works Begin with Rs 225 Crores in Telangana: CM Revanth Reddy

బాసర ఆలయ నిర్మాణ నమూనా

భవ్య మందిరంగా బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం 

తొమ్మిదంతస్తుల రాజగోపురం.. 3 ఏడంతస్తుల గోపురాలు  

ఉత్తరాన కోనేరు పునరుద్ధరణ

రూ.225 కోట్లతో పునర్నిర్మాణం.. 

నేడు భూమిపూజతో పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వేదవ్యాసుడు స్వయంగా ప్రతిష్ఠించారని భక్తులు భావించే జ్ఞాన సర స్వతీ దేవాలయం పూర్తి కొత్తరూపు సంతరించుకోబోతోంది. వ్యాసుడి పేరుతో వ్యాసపురిగా మొదలై ప్రస్తుతం బాసరగా పిలుచుకుంటున్న సరస్వతీ దేవాలయానికి దేశవ్యాప్తంగా ఖ్యాతి ఉంది. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద సరస్వతీ దేవాలయం. చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే చదువులో రాణిస్తారన్న నమ్మకంతో దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడ పిల్లలకు ఓనమాలు దిద్దిస్తా రు. క్రమంగా భక్తుల రాక పెరుగుతుండటంతో దేవాలయం ఇరుకుగా మారింది.

గర్భాలయం పురాతనమైంది కావటంతో మండపంలోని భక్తులకు అమ్మవారి విగ్ర హం పూర్తిస్థాయిలో కనిపించటం లేదు. చిన్న తలుపు ఉండటమే దీనికి కారణం. గర్భాలయం కూడా చిన్నదిగా ఉంది. దీంతో ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం తొలుత ఆలయ పునరి్నర్మాణానికి నిర్ణయించి రూ.50 కోట్లు మంజూరు చేసింది. కానీ, పనులు మొదలు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకంగా రూ.225 కోట్లతో ఈ ఆలయానికి కొత్తరూపు ఇవ్వనుంది. తొమ్మిదంతస్తుల భారీ రాజగోపురం, కోనేరు పునరుద్ధరణ, ధ్యాన మందిరం... ఇలా కొంగొత్త ఆకర్షణలతో చదువులతల్లి కోవెల భక్తులను ఆకట్టుకోబోతోంది. దేవాలయ పనులను సీఎం రేవంత్‌రెడ్డి సోమ వారం భూమిపూజ చేసి ప్రారంభిస్తారు.  

భక్త పారవశ్యం... 
చెంతనే విశాల గోదావరి ప్రవాహం... చుట్టూ దట్టమైన అడవితో కూడిన ప్రకృతి శోభ..తీరంలో చిన్న గ్రామం.. స్వయంగా వ్యాసమహర్షి తపస్సు చేశారని చెప్పుకొనే గుట్ట.. దాని దిగువనే దేవాలయం.. వెరసి ఈ ప్రాంతానికి వస్తే భక్తులు ఆనందపారవశ్యంలో మునిగితేలుతారు. వ్యాస మహర్షితో అనుబంధం ఉందన్న గాథ వారిలో భక్తి భావాన్ని నింపుతుంది. అందుకే ఇక్కడ అక్షరాభ్యాసాలకు అంత ప్రాధాన్యం.

వసంత పంచమి లాంటి ప్రత్యేక సందర్భాల్లో దేశ నలుమూలల భక్తులు వస్తుంటారు. కొంతమంది భక్తులు అక్కడ మూడు, ఐదు, ఏడు, తొమ్మిదిరోజులపాటు ఉండి ధ్యానం చేసుకుంటూ మాధవ కవలం రూపంలో బాసరలోని భక్తులు పంచే అన్నప్రసాదం స్వీకరిస్తూ గడిపే ఆనవాయితీ ఉంది. గతంలో ఆలయం పూర్తి రాతి నిర్మాణంతో అలరారేది. ఆలయం పక్కనే భారీ కోనేరు.. సమీపంలో మంచినీళ్లు తోడుకునే పెద్ద బావి ఉండేది. ఆ తర్వాత అభివృద్ధి పనుల్లో్ల భాగంగా అవి కాలగర్భంలో కలిసి పోయాయి. ఇప్పుడు మళ్లీ కోనేరును పునరుద్ధరించనున్నారు.  

శృంగేరీ పీఠాధిపతుల ఆధ్వర్యంలో... 
ఈ ఆలయ పునరి్నర్మాణానికి ప్రభుత్వం ముందుగా శృంగేరీ పీఠాధిపతులను సంప్రదించింది. పునరి్నర్మాణంలో చేపట్టే పనులు, వాటి ప్రత్యేకతలను వారికి వివరించి సూచనలు తీసుకుంది. వారి సూచనల ఆధారంగానే ఇప్పుడు పనులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు.  

మూడు రెట్లు పెరగనన్న ఆలయ ప్రాంగణం  
ప్రస్తుతం ఆలయ గర్భాలయం, అర్ధమండపం కేవలం 2 వేల చదరపు అడుగుల్లోనే ఉంది. వాటిని 5 వేల చదరపు అడుగులకు విస్తరిస్తారు. 9 అంతస్తుల ఉత్తర రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మిస్తారు. ప్రస్తుతం ఆలయం మొత్తం విస్తీర్ణం 20 వేల చదరపు అడుగుల మేర ఉండగా, ఇప్పుడు దాన్ని ఏకంగా 62 వేల చదరపు అడుగులకు పెంచనున్నారు. ఆలయ పునర్నిర్మాణంలో సిమెంటు బదులు శిలనే వాడుతారు.

ఆరువేల మంది భక్తులకు సరిపడా అన్ని వసతులతో (ఫీడింగ్‌ రూమ్, ఫుడ్‌ స్టాల్స్, టాయిలెట్స్‌ తదితరాలతో) 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్‌లు నిర్మిస్తారు. 200 మంది ఏకకాలంలో కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజన శాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు... తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో వీధుల అభివృద్ధి, దేవాలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్‌ పాస్, ఆవతలి వైపున సోలార్‌ రూప్‌టాప్‌తో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం... ఇలా ఎన్నో నిర్మాణాలు కొలువు దీరనున్నాయి. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్‌సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. భవిష్యత్‌లో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో ఆలరారేలా మొక్కలు నాటుతారు. . 

పుష్కరాలకు వచ్చే వారికి... 
వచ్చే ఏడాది జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు రానున్నందున, బాసరలో వారి కోసం భారీగా వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఆ పనులను కూడా ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చటం విశేషం. భక్తులు ఏ స్థాయిలోనూ ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement