రెండు లీటర్లు తాగించి మళ్లీ ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు  

Banswada: Covid Patient Escaped From Hospital For Palm Wine - Sakshi

సాక్షి, బాన్సువాడ: కల్లు లేక ఓ కరోనా బాధితుడు ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. అయితే.. అతని కోసం రోజంతా గాలించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తాను కల్లు లేనిదే ఉండలేనని, చికిత్స కన్నా.. కల్లే ముఖ్యమని సదరు బాధితుడు తెగేసి చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. దీంతో కల్లు తాగించి మళ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం చోటుచేసుకుంది. పిట్లం మండలం తిమ్మానగర్‌ గ్రామానికి చెందిన కరోనా బాధితుడు (55) కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం ఉదయం ఆస్పత్రి నుంచి పారిపోయాడు. రె

గ్యులర్‌ చెకప్‌ కోసం వచ్చే వైద్యుడు, సిబ్బంది ఆ రోగి లేకపోవడంతో అవాక్కయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్‌ అధికారులు పట్టణంలో తనిఖీలు చేశారు. సంగమేశ్వర కాలనీలోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఓ మూలన అర్ధనగ్నంగా కూర్చొని కనిపించాడు. ఆస్పత్రి నుంచి ఎందుకు పారిపోయావని నిలదీయగా.. తనకు కల్లు దొరకడం లేదని, అందుకే పారిపోయి వచ్చానని చెప్పాడు. అంబులెన్స్‌లో ఎక్కించేందుకు యత్నించగా.. ఆస్పత్రికి రానంటూ మొండికేశాడు. దీంతో పోలీసులు రెండు లీటర్ల కల్లు తెప్పించి ఇచ్చారు. అది తాగిన తర్వాత అతడిని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.   

చదవండి: బ్లాక్‌-వైట్‌-ఎల్లో... ఈ ఫంగస్‌లతో ప్రమాదమేంటి?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top