చిన్నారులపై కుక్కల దాడి

Bandlaguda: Five Children Were Attacked By Dogs In Last 24 Hours - Sakshi

24 గంటల్లో ఐదుగురు చిన్నారులపై దాడి

ఒకరి పరిస్థితి విషమం

ఆందోళనలో బండ్లగూడవాసులు 

సాక్షి, రాజేంద్రనగర్‌: బండ్లగూడ జాగీరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. 24 గంటల్లో ఐదుగురు చిన్నారులపై దాడి చేశాయి. ఓ బాలుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. బండ్లగూడ పద్మశ్రీహిల్స్‌ కాలనీ ప్రాంతంలో రఘు(7) తన తండ్రి రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన టీ కొట్టు వద్ద గురువారం సాయంత్రం నిలబడి ఉన్నాడు. బాలుడి తండ్రి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ ఇంటివద్ద టీలు ఇచ్చేందుకు వెళ్లాడు. ఈ సమయంలో గుంపుగా వచ్చిన వీధి కుక్కలు రఘుపై దాడి చేశాయి. ఈ దాడిలో రఘు తల, నుదుటిపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో రఘును సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు చిన్నారికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం బండ్లగూడలో కూలీ పని చేసేందుకు తండ్రి తో వచ్చిన మరో బాలుడు కార్తీక్‌(7)పై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడి వీపు, చేతులు, చెంపలపై తీవ్ర గాయాలయ్యాయి. 24 గంటల్లో ఐదుగురు చిన్నారులు కుక్కల దాడిలో గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు...
బండ్లగూడ కార్పొరేషన్‌ పరిధిలోని ఆయా ప్రాంతాల నుంచి వీధి కుక్కలతో ఇబ్బంది పడుతున్నామని నిత్యం 20కి పైగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా కమిషనర్‌తో పాటు ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top