పందెం కోడి రూ.30 వేలు.. 31 కోళ్లకు రూ.4.46 లక్షల ఆదాయం | Sakshi
Sakshi News home page

పందెం కోడి రూ.30 వేలు.. 31 కోళ్లకు రూ.4.46 లక్షల ఆదాయం

Published Sun, Jul 17 2022 3:19 AM

Auction Of Seized Pandem Kollu In Sangareddy - Sakshi

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ స్థావరంలో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్లకు శనివారం సంగారెడ్డిలోని ఎక్సైజ్‌ కోర్టు వేలం పాట నిర్వహించింది. ఇందులో అత్యధికంగా ఓ పందెం కోడి రూ.30 వేలు పలికింది. మొత్తం 31 కోళ్లకు రూ.4.46 లక్షల ఆదాయం లభించింది. 46 మంది వేలంపాటలో పాల్గొన్నారు. చింతమనేని ప్రభాకర్‌ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిన్న కంజర్ల గ్రామ శివారులో ఓ ఫాంహౌస్‌లో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఈనెల 7వ తేదీ రాత్రి కోళ్ల పందేల స్థావరంపై దాడి చేశారు. అక్కడ 22 మందిని అదుపులోకి తీసుకోగా, వారి వద్ద రూ.13.12 లక్షల నగదు, 24 సెల్‌ఫోన్లు, 31 చిన్న కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో ఏ1గా ఉన్న చింతమనేని ప్రభాకర్‌ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. తాను కోడిపందేల స్థావరం వద్ద లేనని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చింతమనేని సోషల్‌ మీడియాలో బుకాయించారు. అయితే పోలీసులకు లభించిన వీడియోలను పరిశీలించగా చింతమనేని అక్కడే ఉన్నట్టు స్పష్టమైంది.

పోలీసులు రావడం చూసి ఆయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం స్పష్టంగా కనిపించింది. పరారీలో ఉన్న ఏ1 చింతమనేనిని పట్టుకోవడం కోసం సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారులు మూడు బృందాలను నియమించారు. కాగా వేలం పాటలో వచ్చిన రూ.4.46 లక్షలను ప్రభుత్వ ఖాతాలో జమ చేసినట్లు ఎక్సైజ్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ హన్మంతరావు పేర్కొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement