
కడెం: కడెం ప్రాజెక్టు రక్షణపై సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) దృష్టి సారించింది. గతేడాది, ఈఏడాది ఎగువ నుంచి వరదనీరు వస్తున్న సమయంలో ప్రాజెక్టు గేట్లు తరచు మొరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు, సీడబ్ల్యూసీ బృందం ఈనెల 27, 28, 29 తేదీ ల్లో వస్తున్నట్టు సమాచారం. కడెం ప్రాజెక్టు నిర్మాణం 65 ఏళ్ల క్రితం జరిగింది. ప్రస్తుతం డ్యాం సేఫ్టీ, వరద గేట్ల పనితీరు, ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం, ఔట్‌ఫ్లో కెపాసిటీ, ప్రాజెక్ట్ నిర్వహణ తదితరాలను బృందం పరిశీలిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. సీడబ్ల్యూసీ బృందం వస్తుందన్న సమాచార నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రాజెక్టు వరద గేట్లు, ఇతర మరమ్మతులు చకచకా చేస్తున్నారు.
అదనపు గేట్ల ఏర్పాటుపై...
కడెం ప్రాజెక్ట్ నుంచి దిగువకు 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్ రూపొందించారు. అయితే గతేడాది 6 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో రాగా, గేట్ల పైనుంచి వరద వెళ్లింది. దీంతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సామర్థ్యం పెంచేలా కడెం ప్రాజెక్టు మొదటి గేటు పక్క నుంచి పాత జనరేటర్ గదివైపు ఐదు అదనపు గేట్లు ఏర్పాటు చేసే అవకాశాలపై అధ్యయనం చేయనున్నట్టు తెలిసింది. అదనపు గేట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సీడబ్ల్యూసీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం.