
ప్రభుత్వానికి నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అల్టిమేటం
10 రోజుల్లో బకాయిలు చెల్లించాలి..ప్యాకేజీలు పునఃసమీక్షించాలి
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు తన్హా నోటీసు
సాక్షి, హైదరాబాద్: పది రోజుల్లో బకాయిలు చెల్లించడంతో పాటు వైద్య సేవలకు నిర్ణయించిన ధరలను ప్రభుత్వం పునఃసమీక్షించని పక్షంలో ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తన్హా) తెలిపింది. గత జనవరిలో ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్‌కు గురువారం నోటీసు పంపించినట్లు తన్హా అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ తెలిపారు. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎస్) కింద అందిస్తున్న సేవలకు గాను ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగడం లేదని, ఈ పరిస్థితుల్లో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొన్నారు.
రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు
ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలో 471 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ప్రభుత్వం సుమారు రూ.1,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. 2023 డిసెంబర్ 8వ తేదీ వరకు రూ.723.97 కోట్ల మేర బకాయిలు ఉండగా, కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెల సగటున రూ.100 కోట్లకు తగ్గకుండా చెల్లింపులు చేస్తూ వస్తున్నట్లు ఆరోగ్యశాఖ చెపుతోంది.
ఈ నేపథ్యంలో గత జూన్ 9 నాటికి బకాయిలు రూ.981 కోట్లకు చేరాయి. తాజాగా ఈ బకాయిలు రూ.1,000 కోట్లకు పైగానే పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో బకాయిలు ఉన్నా ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు రాకేష్ వివరించారు.
గత జనవరిలో సేవలు నిలిపివేత
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో గత జనవరిలో వైద్య సేవలను నిలిపివేస్తూ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం స్పందించి రూ.117 కోట్లు విడుదల చేసింది. అయితే అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన ప్యాకేజీల సవరణ, క్రమం తప్పకుండా బకాయిల చెల్లింపు, ఒప్పందాల పునరుద్ధరణ వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆక్షేపిస్తూ తాజాగా మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని అసోసియేషన్ నిర్ణయించింది.