చం‍ద్రబాబే నాతో మాట్లాడారు.. ప్రత్యేక కోర్టులో​ స్టీఫేన్ | AP Former CM Chandrababu And Stephenson Phone Conversation | Sakshi
Sakshi News home page

చం‍ద్రబాబే నాతో మాట్లాడారు.. ప్రత్యేక కోర్టులో​ స్టీఫేన్

Apr 2 2021 2:28 AM | Updated on Apr 2 2021 9:58 AM

AP CM Chandrababu And Stephenson Phone Conversation  - Sakshi

హైదరాబాద్‌: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలంటూ తనను ప్రలోభ పెట్టాడని నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఫోన్‌లో నేరుగా తనతో మాట్లాడారని, ‘మనవాళ్లు అంతా బ్రీఫ్‌ చేశారు, వాళ్లు చెప్పినట్లు చేయాలి’ అని కోరారని.... తానున్నానని, వాళ్లు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని వివరించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్‌సన్‌  గురువారం ప్రత్యేక కోర్టు ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ కన్వీనర్‌గా పరిచయం చేసుకున్న సెబాస్టియన్‌...చంద్రబాబునాయుడుతో ఫోన్‌లో మాట్లాడించారని తెలిపారు. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ఎంత డబ్బు కావాలో చెబితే చంద్రబాబునాయుడు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సెబాస్టియన్‌ చెప్పినట్లు వివరించారు. 

రేవంత్‌రెడ్డి వస్తారని సెబాస్టియన్‌ చెప్పారు.. 
‘‘2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసే విషయంలో చంద్రబాబునాయుడు నేరుగా మాట్లాడాలను కుంటున్నారని ఆంథోనీ అనే వ్యక్తి ద్వారా హ్యారీ సెబాస్టియన్‌ నన్ను సంప్రదించారు. చంద్ర బాబునాయుడు ప్రతినిధిగా పార్టీలో కీలకమైన వ్యక్తి వస్తేనే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. దీంతో చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా రేవంత్‌రెడ్డి మాట్లాడడానికి వస్తారని చెప్పారు’’ అని స్టీఫెన్‌సన్‌ వివరించారు. లంచం తీసుకోవడం ఇష్టం లేదని, దీంతో వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించానని తెలిపారు. 

రూ.50 లక్షలు అడ్వాన్స్‌ అని చెప్పారు..
‘‘ఏసీబీ అధికారులు మేము ఉన్న ఫ్లాట్‌లో ఐఫోన్‌ను, ఇతర ఆడియో, వీడియో పరికరాలను ఏర్పాటు చేశారు. 2015 మే 30న రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహలు నేను ఉన్న ఫ్లాట్‌కు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తాం. అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇస్తున్నాం. మిగిలిన డబ్బు ఓటింగ్‌ తర్వాత ఇస్తాం అని చెప్పారు. ఇందులో భాగంగా రూ.2.5 లక్షలుగా ఉన్న 500 రూపాయల బండిళ్లు 20 టీపాయ్‌ మీద పెట్టారు. వెంటనే ఏసీబీ అధికారులు వచ్చి రేవంత్‌రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకున్నారు’’ అని స్టీఫెన్‌సన్‌ వివరించారు. ఈ మేరకు ఆయన వాంగ్మూలాన్ని పాక్షికంగా నమోదు చేసిన న్యాయమూర్తి సాంబశివరావునాయుడు....తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేశారు. 

రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై అభ్యంతరం..
ఇదిలా ఉండగా ఇదే కేసులో మరికొందరు సాక్షుల వాంగ్మూలాల నమోదు పూర్తయ్యే వరకూ స్టీఫెన్‌సన్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసే ప్రక్రియను ఆపాలంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేస్తామని కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈనెల 7కు వాయిదా వేశారు. 

ఉదయసింహ అప్పీల్‌ కొట్టివేత..
మరోవైపు ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ తాను దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ మరో నిందితుడు ఉదయసింహ దాఖలు చేసుకున్న అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే ప్రత్యేక కోర్టు డిశ్చార్జ్‌ పిటిషన్‌ను కొట్టివేసిందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement