ANMs Protest In Front Of Assembly Demands To Hike Salaries - Sakshi
Sakshi News home page

సీఎం సారూ.. మాకెందుకు సారూ జీతాలు పెంచట్లేదు? వెక్కి వెక్కి ఏడుస్తూ వేడుకోలు

Published Fri, Feb 10 2023 1:40 AM

ANMs Protest In Front Of Assembly Demands To Hike Salaries - Sakshi

హిమాయత్‌నగర్‌: ‘‘అయ్యా.. సీఎం సారూ.. మిమ్మల్ని గెలిపించినవారిలో మేం కూడా ఉన్నామయ్యా. మీరంటే మాకూ అభిమానం, మా కేసీఆర్‌ సారు తెలంగాణ సాధించినోడు, ఆయనను సీఎంగా గెలిపించుకోవాలనే ఆశతో మీకు మా ఇంటిల్లిపాదీ ఓట్లు వేసి గెలిపించుకున్నాం సారూ. అందరికీ అన్నీ చేస్తున్నావు సారూ.. మరి మాకెందుకు సారూ జీతాలు పెంచట్లేదు.

ఉప్పు, పప్పు, కారం, నూనె.. ఇలా ఏది కొనాలన్నా కొనలేకపోతున్నాం. మాకిచ్చే ఆ రూ.25 వేల జీతాలు చాలక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం. మాయందు దయ తలచి మమ్మల్ని రెగ్యులరైజ్‌ చేయండి సారూ’అంటూ సెకెండ్‌ ఏఎన్‌ఎంలు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రతి ఒక్కరూ వెక్కి వెక్కి ఏడుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్థిస్తున్న తీరు చూపరుల హృదయాలను ద్రవింపజేసింది.

ఈ సన్నివేశం గురువారం హిమాయ త్‌నగర్‌ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. వీరి కన్నీటిబాధను చూసిన వాహన దారులు సైతం సంఘీభావం తెలిపారు. చలో అసెంబ్లీ నిమిత్తం అన్ని జిల్లాల నుంచి వీరు హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ భవన్‌ వద్దకు తెల్లవారుజామునే చేరుకున్నారు. వీరిలో కొందరు తమ చంటిబిడ్డలను సైతం వెంట తీసు కొనివచ్చారు.

పోలీసులకు, సెకెండ్‌ ఏఎన్‌ఎంలకు మధ్య పెద్దఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. మగ పోలీసులు పలువురిని ఈడ్చి రోడ్డు పక్కన వేశారు. మహిళా పోలీసులు చాలాసేపు పక్కనే నిలబడి చోద్యం చూస్తూ నిలబడ్డారు. ఈ సందర్భంగా సెకెండ్‌ ఏఎన్‌ఎంల రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మమత మాట్లాడుతూ 16 ఏళ్లుగా ప్రభుత్వాలు మాతో గొడ్డుచాకిరి చేయిస్తున్నా యన్నారు. కోవిడ్‌ సమయంలో నేరుగా కోవిడ్‌ పేషెంట్లకు ఇంజక్షన్లు చేసింది తామే నన్నారు. ప్రభుత్వం ఏ పనిమొదలు పెట్టినా ముందు ఉండి చేసేది తామేనన్నారు. తమను ఇప్పటికైనా ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయాలని అభ్యర్థించారు. 

Advertisement
 
Advertisement