‘పట్టాలు’ తప్పిన ఎనిమో మీటర్‌! | Anemometer Installed On Railway Culverts In The Wake Of Heavy Rains | Sakshi
Sakshi News home page

‘పట్టాలు’ తప్పిన ఎనిమో మీటర్‌!

Jul 12 2022 2:30 AM | Updated on Jul 12 2022 2:30 AM

Anemometer Installed On Railway Culverts In The Wake Of Heavy Rains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే కల్వర్టులపై ఎనిమో మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉండగా, మరికొన్ని కొత్త ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నవి సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్‌ చేసుకోవాలంటూ సోమవారం సాయంత్రం జరిగిన సమీక్షలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అధికారులను ఆదేశించారు. అయితే ఈ మీటర్ల ఏర్పాటుతో ఆశించిన ప్రయోజనం లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వెళ్లి చూసే పక్షంలో యంత్రమెందుకు? 
ఎనిమో మీటర్‌.. ఇది గాలి వేగం ఎంతుందో రికార్డు చేస్తుంది. అలాగే వరదల సమయంలో వరద ఎంతెత్తుతో ఉందో, ఎంత వేగంతో ప్రవహిస్తోందో కూడా రికార్డు చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రైల్వే కార్యాలయానికి దూరంగా ఎక్కడో ఏర్పాటు చేసిన యంత్రం రికార్డు చేసే వివరాలు.. సిబ్బంది అక్కడికి వెళ్లి చూస్తే కానీ తెలియక పోవడం, ఆ మేరకు సాంకేతికతను సమకూర్చుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు తెలుసుకునేందుకు అక్కడి వరకు వెళ్లిన సిబ్బందికి, అక్కడి వరద పరిస్థితి కనిపిస్తుంది కదా.. అంతదానికి ఆ యంత్రం ఎందుకు అన్న ప్రశ్నకు రైల్వే అధికారులు సరైన సమాధానం చెప్పలేక పోతున్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా.. 
అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎనిమో మీటర్లను వినియోగిస్తున్నాయి. వరద సంభవిస్తే దాని వివరాలన్నీ అవి రికార్డు చేయడమే కాదు.. ఆ సమాచారాన్ని సమీపంలోని రైల్వే కార్యాలయానికి చేరవేస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీనికి తగ్గ సాంకేతికతను ఆయా దేశాలు సమకూర్చుకున్నాయి. వాటిని చూసి ఆరేళ్ల క్రితం మన రైల్వే కూడా ఆ సాంకేతికతను సమకూర్చుకోవటం ప్రారంభించింది.

దాదాపు నాలుగేళ్ల క్రితం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట–బలార్షా సెక్షన్ల మధ్య రామగుండం సహా కొన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి, వాటిని సమీపంలోని రైల్వే కార్యాలయాలతో అనుసంధానించింది. వరద వస్తే ఆటోమేటిక్‌గా ఆ సమాచారం రైల్వే కార్యాలయాలకు రావాలి. కానీ సాంకేతికత వైఫల్యంతో ఆ ప్రయోగం విజయవంతం కాలేదు. మీటర్లు పనిచేస్తున్నా, వాటి నుంచి సమాచారం రైల్వే కార్యాలయాలకు రావటం లేదు. లోపం ఎక్కడుందో సరిగా గుర్తించి తగు మార్పులు చేయాల్సిన రైల్వే శాఖ దీనిపై దృష్టి సారించడం లేదు.  

ఉన్నా, లేకున్నా ఒకటే..!  
ప్రస్తుత వరదల నేపథ్యంలో, వాటిని రెగ్యులర్‌గా చెక్‌ చేయాలని జీఎం నుంచి ఆదేశాలందాయి. వరద వచ్చిన వెంటనే అవి కార్యాలయాలకు సమాచారం పంపితే, అక్కడి సిబ్బంది ఆయా మార్గాల్లో వచ్చే రైళ్లను అప్రమత్తం చేసి నిలిపేయటమో, వరద నీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవటమో చేస్తారు. తద్వారా రైళ్లకు, ప్రయాణికులకు ముప్పు తప్పుతుంది.

కార్యాలయాలకు సమాచారం రాకుండా, సిబ్బందే వాటి వద్దకు వెళ్లి చెక్‌ చేసి తెలుసుకోవాలంటే అవి ఉన్నా, లేకున్నా పెద్దగా తేడా ఉండదని, వాటి కోసం చేసిన వ్యయం కూడా నిరుపయోగమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్న రైల్వే అధికారులు.. విదేశాల్లో మాదిరిగా ఎనిమో మీటర్లను కార్యాలయాలతో అనుసంధానించే దిశగా చర్యలు చేపట్టకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వలిగొండ దుర్ఘటన జరిగి 17 ఏళ్లు! 
ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. పెద్ద చెరువు నిండి పొంగి ప్రవహించడంతో ఉన్నట్టుండి కట్ట తెగిపోయింది. గ్యాలన్ల కొద్దీ వరద ఒక్కసారిగా పోటెత్తడంతో సమీపంలోని రైల్వే లైన్‌ కొట్టుకుపోయింది. అర్ధరాత్రి వేళ దీపావళి సంబరాలకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో కిక్కిరిసిన డెల్టా ప్యాసింజర్‌ రైలు అక్కడికి చేరుకుంది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు.

ట్రాక్‌ కొట్టుకుపోయిన విషయం తెలియక లోకో పైలట్లు రైలును అలాగే ముందుకు పోనిచ్చారు. అంతే.. పట్టాలు తప్పిన రైలు బోగీలు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యాయి. నాలుగు కోచ్‌లు ఒకదానిపైకొకటి దూసుకుపోయాయి. 114 మంది దుర్మరణం చెందారు. ఇది 2005 అక్టోబర్‌లో నల్లగొండ జిల్లా వలిగొండ సమీపంలో జరిగిన ఘోర దుర్ఘటన. 17 ఏళ్లు గడుస్తున్నా.. రైల్వే ఇప్పటికీ అదే దుస్థితిలో ఉంది. ఎక్కడైనా మెరుపు వరద సంభవిస్తే అప్రమత్తం చేసే వ్యవస్థే లేకపోవడం శోచనీయం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement