అమర్‌నాథ్‌ యాత్రికులకు మెడికల్‌ సర్టిఫికెట్లు.. దరఖాస్తు ఇలా.. | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్‌ యాత్రికులకు మెడికల్‌ సర్టిఫికెట్లు.. దరఖాస్తు ఇలా..

Published Fri, Apr 22 2022 12:57 PM

Amarnath Yatra 2022: Secunderabad Gandhi Hospital Issue Fitness Certificates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమర్‌నాథ్‌ వెళ్లే యాత్రికులకు అవసరమైన మెడికల్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో వైద్యపరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేందుకు నిర్ధేశించిన మెడికల్‌ బోర్డు నుంచి తప్పనిసరిగా ఆరోగ్య ధృవీకరణ పత్రం పొందాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసింది.

కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో గత రెండేళ్లుగా అమర్‌నాథ్‌ యాత్ర నిలిపివేశారు. ఈ కారణంగా ఈ ఏడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రతివారం 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని, ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికే వరుస క్రమంలో వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు.  మెడికల్‌ బోర్డు కమిటీ ఎంపిక చేశామని, నితిన్‌కాబ్రా (కార్డియాలజీ) సత్యనారాయణ (ఆర్ధోపెడిక్‌), కృష్ణమూర్తి(ఫల్మనాలజీ), రవీందర్‌ (జనరల్‌ మెడిసిన్‌) వైద్యులు బోర్డు సభ్యులుగా కొనసాగుతారని సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు.  

దరఖాస్తు ఇలా...  
యాత్రికులు ఆథార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో గాంధీ మెడికల్‌ రికార్డు సెక్షన్‌లో సంప్రదించాలి. దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత వరుస క్రమంలో వచ్చే తేదీని నిర్ణయిస్తారు. సదరు తేదీ రోజు గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం మొదటి అంతస్తు ఎంఆర్‌డీ సెక్షన్‌ కార్యాలయంలో మెడికల్‌ బోర్డు వైద్యుల నిర్వహించే వైద్య పరీక్షలకు నేరుగా హాజరుకావాలి. (క్లిక్: సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు)

చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవీ.. 
కంప్లీట్‌ బ్లడ్‌ ప్రొఫిల్లింగ్‌ (సీబీపీ), ఆర్థరైటీ సెడిమెంటేషన్‌ రేట్‌ (ఈఎస్‌ఆర్‌), కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్‌ (సీయు ఈ), గ్లూకోజ్‌ ర్యాండమ్‌ బ్లడ్‌ సుగర్‌ (జీఆర్‌బీఎస్‌) బ్లడ్‌ యూరియా, సీరం క్రియేటిన్, ఎలక్టోకార్డియా గ్రామ్‌(ఈసీజీ), ఎక్స్‌రే చెస్ట్‌ వైద్యపరీక్షల నివేదికలను కమిటీ ముందుంచాలి. యాభై ఏళ్ల వయసు పైబడినవారు పై నివేదికలతోపాటు రెండు మోకాలి (బోత్‌ నీస్‌) ఎక్స్‌రేలు జతచేయాలి. మెడికల్‌ బోర్డు సభ్యులు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. (క్లిక్: చింత చెట్టుపై వింత ఇల్లు .. 20 ఏళ్ల క్రితమే!)

Advertisement

తప్పక చదవండి

Advertisement