ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత.. గేట్లు క్లోజ్‌ చేసిన పోలీసులు.. | Sakshi
Sakshi News home page

ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత.. గేట్లు క్లోజ్‌ చేసిన పోలీసులు..

Published Wed, Aug 16 2023 12:56 PM

All Party Leaders Protest At Khammam Collectorate - Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మం నూతన కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్‌ ముట్టడిని పిలుపునిచ్చారు. ముట్టడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీంతో, ఖమ్మం కలెక్టరేట్‌ గేట్లను పోలీసులు మూసివేశారు. ఈ క్రమంలో​ రోడ్డుపై బైఠాయించి అఖిలపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.

ఈ సందర్బంగా అఖిలపక్ష పార్టీల నేతలు నాగపూర్‌-అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేపే అలైన్‌మెంట్‌ మార్చాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేను బ్రౌన్‌ ఫీల్డ్‌ హైవేగా మార్చాలని డిమాండ్‌ చేశారు. హైవే విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ప్రైవేటు మార్కెట్‌ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

రైతు పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదు..
ఇక, కలెక్టరేట్‌ వద్ద సీపీఐ రాష్ట్ర కార్శదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతు పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. రైతును చిన్నచూపు చూస్తున్నారు. ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రభుత్వాలు ఉద్యోగుల కాళ్ల వద్దకు వస్తున్నాయి. రైతుకు ఆ పరిస్థితి లేదు. పోలీసులతో ఇబ్బంది పెడితే ఖమ్మంను స్తంభింప చేస్తాం. పోరాడితేనే మన భూములు మనకు మిగులుతాయి. వద్దన్న రోడ్లు వేస్తున్నారు.. కావాలన్న రోడ్లు వేయడం లేదు. బీఆర్‌ఎస్‌కు మేము చెబితే వినే పరిస్థితి లేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

రైతులది చట్టబద్దమైన పోరాటం..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. రైతుల భూ పోరాటం తీవ్ర స్థాయికి  చేరింది. రైతులు చూపిన త్యాగం, ధైర్యంతోనే పోరాటం విజయం సాధిస్తుంది. రైతుల పోరాటానికి సీపీఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది. రైతులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడం లేదు. ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. రైతు పోరాటం వీధి పోరాటం కాదు, చట్టబద్ధమైన పోరాటం. 90శాతం మంది రైతులు అంగీకరిస్తేనే ప్రభుత్వం రైతుల నుండి భూమిని తీసుకోవాలని చట్టంలో ఉంది. తక్కువ నష్టం అయ్యే భూమినే ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంది. మార్కెట్ విలువకు 3 రెట్లు ఎక్కువ కట్టించి రైతులకు ఇవ్వాలి. 2016లో భూసేకరణ చట్ట ప్రకారం రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: జెండావిష్కరణలో బీజేపీ నేతల బాహాబాహీ.. రెచ్చిపోయిన ఇరువర్గాలు

Advertisement
Advertisement