RRR Alignment: ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంటు ఖరారు. మూడేళ్ల కిందటిదే ఫైనల్‌ చేశారా? 

Alignment Of Hyderabad Regional Ring Road Central Government Finally Finalized - Sakshi

భారీ సవరణలతో కూడిన పాత అలైన్‌మెంట్‌ వైపు మొగ్గు 

నాలుగు ఆప్షన్లు ప్రతిపాదించిన కన్సల్టెన్సీ సంస్థ 

వ్యయం దృష్ట్యా ఇదే మెరుగైందని తేల్చిన ఎన్‌హెచ్‌ఏఐ 

కాళేశ్వరం కాలువలకు దూరంగా రోడ్డు నిర్మాణం 

పాతదానితో పోలిస్తే 1.2 కి.మీ మేర తగ్గిన నిడివి 

157.2 కి.మీ నిడివి.. రూ.7,900 కోట్ల వ్యయం 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఉత్తర భాగం అలైన్‌మెంటు ఎట్టకేలకు ఖరారైంది. ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన కీలక సమావేశంలో అలైన్‌మెంట్‌పై నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు కన్సల్టెన్సీ బాధ్యతలు చూస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన కే అండ్‌ జే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఎన్‌హెచ్‌ఏఐకి అందజేసిన నాలుగు ఆప్షన్లలో అనుకూలమైన ఒకదాన్ని ఎంపిక చేశారు.

దాదాపు మూడేళ్ల క్రితం నాటి పాత కన్సల్టెన్సీ సంస్థ అప్పట్లో రూపొందించిన అలైన్‌మెంటుకు పలు సవరణలతో రూపొందించిన దాన్ని ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీని ప్రకారమైతే నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుందని, ఇతరత్రా ఇబ్బందులు కూడా ఉండవని ఎన్‌హెచ్‌ఏఐ అభిప్రాయపడినట్టు సమాచారం.  

మొత్తం 157.2 కి.మీ నిడివి 
పాత అలైన్‌మెంట్‌కు ప్రస్తుత కన్సల్టెన్సీ సంస్థ దాదాపు 15 చోట్ల సవరణలు ప్రతిపాదించింది. మూడేళ్ల క్రితం పాత కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంట్‌ను ప్రతిపాదించే సమయంలో కాళేశ్వరం కాలువలు లేవు. ఇప్పుడు ఆ కాలువలు, కొన్ని కొత్త జలాశయ ఛానళ్లు తెరపైకి వచ్చాయి. దీంతో వాటికి ఇబ్బంది లేకుండా ఒక కి.మీ. నుంచి 5 కి.మీ దూరంతో కొత్త అలైన్‌మెంట్‌ సవరణలు ప్రతిపాదించారు. అయితే ఈ మార్పులతో పాత అలైన్‌మెంటు కంటే 1.2 కి.మీ మేర నిడివి తగ్గటం విశేషం.

చాలా ప్రాంతాల్లో అలైన్‌మెంటును వెలుపలి నుంచి కాకుండా లోపలి నుంచి మార్చటంతో నిడివి తగ్గింది. పాత అలైన్‌మెంట్‌ 158.4 కి.మీ. ఉండగా, సవరణల తర్వాత కొత్త అలైన్‌మెంట్‌ 157.2 కిలోమీటర్లకు తగ్గింది. దీనికి రూ.7,900 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కి.మీ.కు భూ సమీకరణ ఖర్చు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు అవుతుందని, మొత్తంగా రూ.1600 కోట్ల వ్యయమవుతుందని సూచించినట్టు తెలిసింది.  

ఎలివేటెడ్‌ లేకుండా.. 
సాధారణంగా ఎక్స్‌ప్రెస్‌ వేల నిర్మాణంలో నీటి కాలువలను క్రాస్‌ చేయాల్సి వస్తే ఎలివేటెడ్‌ (పైనుంచి) పద్ధతిలో వాటిని దాటేలా రోడ్డును డిజైన్‌ చేస్తారు. ఎలివేటెడ్‌ పద్ధతిలో నిర్మాణానికి సాధారణం కంటే ఖర్చు 10 రెట్లు పెరుగుతుంది. తాజా అలైన్‌మెంటులో ఇలాంటివి దాదాపు పదికిపైగా ఉన్నందున, నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కాలువలను క్రాస్‌ చేయాల్సిన అవసరం లేకుండా వాటికి దూరం నుంచి వెళ్లేలా అలైన్‌మెంట్‌ను మార్చారు.  

గెజిట్‌లో 125 వరకు ఊళ్ల పేర్లు 
ఈ రోడ్డు 80 గ్రామాలపై నేరుగా ప్రభావం చూపించనుంది. ఇవి కాకుండా ఈ ఊళ్లకు కి.మీ. నుంచి కి.మీటరున్నర దూరంలో ఉన్న మరికొన్ని ఊళ్లను కూడా గెజిట్‌లో చేర్చి నోటిఫికేషన్‌ విడుదల చేయబోతున్నారు. వెరసి ఈ ఉత్తర భాగం రోడ్డు నిర్మాణంలో 125 ఊళ్ల పేర్లను ప్రకటించనున్నట్టు తెలిసింది.

మరో పక్షం రోజుల్లో గెజిట్‌ విడుదలకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. మరో రెండు నెలల్లో ఏ సర్వే నంబరులో ఎంత భూమిని సమీకరిస్తారో వివరాలు వెల్లడించనున్నారు. ఆ వెంటనే భూ సమీకరణ ప్రక్రియ మొదలు కానుంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top